చిత్రకారుడు నందలాల్ బోస్;-- యామిజాల జగదీశ్
 ఓరోజు చిత్రకారుడు నందలాల్ బోసు (3 డిసెంబరు 1882 – 16 ఏప్రిల్ 1966) కి విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ నుంచి పిలుపు వచ్చింది..... "నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను" అని. అభనింద్రనాథ్ టాగూర్ శిష్యుడే నందలాల్ బోస్.  
దేశంలో టాగూరుని తెలియని వారంటూ లేని రోజులవి.
ఆయనను ఎంతో గౌరవంగా భావించిన వారెందరో. ఆయన కవితలూ ఆలోచనలూ దేశ విదేశాలలో గుర్తింపు పొందాయి. అటువంటి టాగూర్ తనను కలవాలనుకోవడం నందలాల్ బోసుకి గొప్పగానూ అనిపించింది. కానీ ఆయన తన నుంచి ఏమిటి ఆశిస్తున్నారో అని నందలాల్ బోసు ఆలోచనలో పడ్డారు. టాగూరుని కలవడానికి బయలుదేరారు నందలాల్.
"నేను మీరు గీసిన బొమ్మలను చూశాను. నాకు అవి ఎంతగానో నచ్చాయి. నేనిప్పుడు ఓ కవితా సంపుటి రాయడం మొదలుపెట్టాను.  ఆ పుస్తకంలో కన్ని కవితలకు మీరు బొమ్మలు గీయాలన్నది నా ఆశ" అన్నారు టాగూర్.
నందలాల్ బోసు విస్తుపోయారు. 
టాగూర్ కవితలను చదవొచ్చు. ఆస్వాదించొచ్చు, కానీ వాటిని ప్రతిబింబించే రీతిలో బొమ్మలు గీయడం అంత సులువైన పని కాదు కదా. ఆ కవితలను చదివి అర్థం చేసుకున్న తర్వాత దానికి తగినట్టు బొమ్మలు గీయడం మాటలా అనుకున్నారు నందలాల్.
దాంతో ఆయన తాను మీ కవితలకు తన చిత్రాలతో న్యాయం చేయలేనేమోనని టాగూరుని  క్షమించమని అడిగారు. 
"నేను మీ కవితలకు బొమ్మలు వేసేంత శక్తి నాకు లేదు. అయినా కవితల గురించి నాకు పెద్దగా తెలీదు. కనుక  మీ కవితలకు చక్కటి బొమ్మలు గీయగలనా అనేది అనుమానమే" అన్నారు నందలాల్.
కానీ టాగూరు ఊరుకోలేదు.
"మీ శక్తి మీకు తెలీదేమో. మీకేం తెలుసో నాకు తెలుసు. కాస్త ఉండండి. నేను మీకు కొన్ని కవితలు చదివి వినిపిస్తాను"  అన్నారు టాగూరు.
టాగూర్ తీయని స్వరంలో కవితలు చదివి వినిపిస్తున్న కొద్దీ నందలాల్ బోస్ తన్మయం చెందారు.
టాగూరు కవితలు వింటుంటే ఓ అందమైన దృశ్యాలుగా నందలాల్ ముందు మెదిలాయి.
నందలాల్ పరవశించి లేచి నిల్చున్నారు టాగూర్ ఎదుట.
అంతే ఆ క్షణమే టాగూర్ కవితలకు బొమ్మలు గీయడానికి ఒప్పుకున్నారు. 
మునుపు నాకు కవితల గురించి పెద్దగా తెలీదు అని చెప్పిన నందలాల్ ఇప్పుడు టాగూర్ కవితలకు అర్థవంతమైన, ఆకర్షణీయమైన బొమ్మలు గీశారు. 
అవి టాగూరుకి ఎంతగానో నచ్చాయి.
నందలాల్ బోసుకి చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి మెండు.
చిత్రకళను అంకితభావంతో నేర్చుకుని ఆ రంగంలో కృషి చేశారు. ఎదిగారు. 
కానీ ఆయన కుటుంబ సభ్యులు మొదట్లో పెద్దగా ఆదరించలేదు. వారి బలవంతంతో ఆయన మరొక కాలేజీలో చేరి చదవవలసి వచ్చింది.
అయినప్పటికీ ఆయన మనసు మళ్ళీ మళ్ళీ బొమ్మలు గీయడంపైనే పోతుండేది. 
చివరకు ఆయన అందరి వ్యతిరేకతను అధిగమించి ఆర్ట్స్ కాలేజీలో చేరారు. బొమ్మలు గీయడం నేర్చుకున్నారు. అందులో తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. 
గొప్ప గొప్ప బొమ్మలు గీశారు. ప్రశంసలూ పొందారు. 
భారత దేశ ఆధునిక చిత్రరంగానికి ఆదర్శంగా నిలిచారు.
నందలాల్ బోసు గీసిన చిత్రాలలో ప్రసిద్ధి చెందినది బాపూజీ బొమ్మ. 
ఆ బొమ్మ....బ్యాక్ గ్రౌండ్ నలుపు రంగు. దానిపై తెల్ల రేఖలతో ఓ చేతికర్ర పట్టుకుని ముందుకు నడుస్తున్నట్టు కనిపిస్తారు గాంధీజీ. 1930లో గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహానికి దిగినప్పుడు నందలాల్ బోస్ గీసిన ఈ చిత్రం ఇప్పటికీ పలు చోట్ల చూడవచ్చు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి, అహింసా వాదానికి చిహ్నంగా ఈ చిత్రాన్ని భావిస్తారు.
ఆయన చిత్రాలు, ఆయన వద్ద శిక్షణ పొందినవారు, ఆయన బొమ్మలను చూసి గీసినవారి చిత్రాలు ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి ఇప్పటికీ ఎప్పటికీ.   
ఆయన శిష్యులు బెనోడ్ బెహారీ ముఖర్జీ, రాంకింకర్ బైజ్, బియోహర్ రామ్ మనోహర్ సిన్హా. ప్రతిమా ఠాకూర్, సొవోన్ సోమ్, జహర్ దాస్ గుప్తా, సబితా ఠాకూర్, కొండపల్లి శేషగిరి రావు తదితరులు. 
ఆయనను భారత ప్రభుత్వం 1954లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
1908లో ఏర్పాటు చేసిన ఓ చిత్రకళా ప్రదర్శనలో నిర్వాహకులు ఆయన గీసిన చిత్రానికి అయిదు వందల రూపాయలు కానుకగా ఇచ్చారు.   
భారత రత్న, పద్మశ్రీ వంటి వాటికి ఆయనతోనే ఎంబ్లమ్ గీయించారు జవాహర్ లాల్ నెహ్రూ. 
ఆయన తన కెరీర్లో  దాదాపు ఏడు వేల బొమ్మలు గీశారు. ఆయన గీసిన బొమ్మలలో అనేకం డిల్లీలోని జాతీయ మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. శాంతినికేతన్ లో కళాభవన్ ఏర్పాటు చేసినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనను అందులో చేరమని ఆహ్వానించారు. కళాభవన్ కి నందలాల్ బోస్ 1922 – 1951 సంవత్సరాల మధ్య ప్రిన్సిపాల్ గా కొనసాగారు. 
నందలాల్ బోస్ మొదటిసారిగా 1911లో తన చిత్రాలను ప్రదర్శించారు. 
ఆయన భార్య సుధీరా దేవి. నందలాల్ తల్లిగారి స్నేహితుల కుమార్తె సుధీరా దేవి. ఆయన కంటే దాదాపు పన్నెం డేళ్ళు చిన్న సుధీరాదేవి. వీరికి ఓ కుమార్తె, పేరు గౌరి.







కామెంట్‌లు