ఎందుకు చెప్పలేదు నాన్నా?;-బాలవర్ధిరాజుమల్లారం
అంతర్జాతీయ పితృదినోత్సవం (  జూన్  19.)  సందర్భంగా..మా నాన్నగురించి  అక్షరాల్లో...
----------------------------
నాన్నా!
నాకు
అవ్వ.. జన్మనిస్తే..
నువ్వు.. బతుకునిచ్చావు!
అవ్వ... నడక నేర్పిస్తే..
నువ్వు... నడత నేర్పించావు!
అవ్వ.. నేను పడకుండ వేలందిస్తే...
నువ్వు... నేను చెడకుండ వేలు చూపించావు!

మీరు 
నా సంతోషాలకు సమిథలయ్యారు,
నా ప్రగతికి ప్రమిదలయ్యారు.

మన మల్లారం ఊరును ప్రేమించుమన్నావు
అక్కడ.. మమతానురాగాలు ఊరును అన్నావు
అనుబంధం,ఆత్మీయతలు సమకూరును అన్నావు
శాంతి ,సామరస్యాలు చేకూరును అన్నావు.
పుట్టిన పల్లెను మరువ వద్దన్నావు
పట్నాన్ని చూసి మురువ వద్దన్నావు
కష్టాలకు వెరువ వద్దన్నావు
కన్నీళ్ళను విడువ వద్దన్నావు
బాధలు వస్తే... బెదర వద్దన్నావు
సమస్యలు వస్తే..చెదర వద్దన్నావు
గెలిచే వరకు పోరాడుమన్నావు
విజయాలు వస్తే విర్రవీగకుమన్నావు

అపజయాలను పునాదులుగా చేసుకోమన్నావు
నిరాశా, నిస్పృహలను సమాధి చేయుమన్నావు
ఊహల్లో బతుకవద్దన్నావు
వాస్తవంలో జీవించుమన్నావు
మనోధైర్యమే బలమన్నావు
జీవితమంటేనే సుఖదుఃఖాల నిలయమన్నావు

నువ్వు
నాకు పెద్దగా ఆస్తి అంతస్తులనివ్వకపోయినా..
అంతులేని ఆత్మస్థైర్యాన్ని అందించావు
అంతగా ధనాన్ని కూడగట్టకపోయినా....
మన ఊరి ప్రజల అభిమాన ధనాన్ని సంపాదించి ఇచ్చావు.

మతం కన్నా మానవత్వమే గొప్పదన్నావు
కలిమి కన్నా చెలిమి మిన్న అన్నావు
అన్నీ చెప్పిన నువ్వు...
అవ్వ,నువ్వు లేకపోతే.. నేనెలా బతకాలో
ఎందుకు చెప్పలేదు నాన్నా?
ఎవరున్నా, ఎందరున్నా
మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది
ఆ వ్యథను నా చిన్నిగుండె ఓర్చుకో(లే)నిది
అవ్వను.. నా బిడ్డలో..
నిన్ను... తమ్మునిలో చూసుకుంటూ....
జీవశ్చవంలా  బతుకునీడుస్తున్నాను నాన్నా! 
నాన్నా!
మీరు 
దైవత్వానికి ప్రతీకలు!
త్యాగానికి ప్రతీకలు!!
( పదకొండు ఏళ్ళ  క్రితం మాకు భౌతికంగా దూరమైన మా నాన్న (జంగం ముత్తయ్య) గారిని అక్షరాలతో పలకరిస్తూ....పలవరిస్తూ..
పులకరిస్తూ....స్మరిస్తూ...) 


కామెంట్‌లు