*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - (౦౦౧-001)*
 *ఉత్పలమాల:*
*శ్రీ రఘురామ, చారుతుల | సీదళదామ, శమక్షమాది శృం*
*గార గుణాభిరామ, త్రిజ | గన్నుత శౌర్య రమాలలామ దు*
*ర్వార కబంధ రాక్షస వి | రామ, జగజ్జన కల్మషార్ణ వో*
*త్తారకనామ! భద్రగిరి | ధశరధీ కరుణాపయోనిధీ* 
*తా:*
ఎంతో గొప్పదైన ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు యొక్క పరంపరలో పుట్టిన వాడా, అందముగా కూర్చబడిన తులసీదళ మాల ధరించిన వాడా, శాంతము, ఓర్పు, శృంగారము అనే గుణములు ఆభరణములుగా గలవాడా, మూడు లోకములలోనూ పొగడబడుతున్న యుద్ద పరాక్రమము అనే లక్ష్మీ దేవిని కలిగిన వాడా, అతి భయంకరుడైన కంబంధుడు అనే రాక్షసుని జయించిన వాడా, మూడు జగములలోని అన్ని జీవుల పాపములు అనే సముద్రాన్ని దాటించగలిగిన వాడా, "రామ" అనే పేరుగలుగిన వాడా! కరుణ అనే గుణాన్ని నీదిగా చేసుకున్న ధశరాధరాజ కుమారుడా, భద్రాచల రామా!.... భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*పరంధామ పరమేశ్వర పరాత్పరుడు ముల్లోకాలలో వున్న జనావళిని ఉద్ధరించడానికి ఈ భూమి మీదికి దశరధరాముడుగా మనమధ్యకి వచ్చి మనిషిగా నడయాడాడు. అటువంటి ఉత్తముని, ధర్మమూర్తిని మనం కీర్తన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత మిగిలే వుంటుంది, ఆ పరాత్పరుని కీర్తి. దేవదేవుడు కదా! ఈ రాముడు సకల గుణాభి రాముడు. సమరలక్ష్మిని తనదిగా చేసుకున్నావాడు. గెలవడమే కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలియజేసిన వాడు. మానవాళికి కీడు చేసే ఎంతో మంది రాక్షస ప్రవృత్తి గలవారిని మర్దించిన వాడు. "మర్ద మర్ద మమ బంధాని" అని ఆర్తితో కొలిచిన వారిని బంధవిముక్తుని చేయగలవాడివి. ఇంతటి మహాదేవా! మమ్మల్ని మంచి దారిలో నడిపించు రామభద్రా!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు