*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - (౦౧౧-011)*
 *ఉత్పలమాల:*
*శ్రీరఘువంశ తోయధికి | శీతమయూఖుఁడవైన నీ పవి*
*త్రోరు పదాబ్జముల్ వికసి | తోత్పల చంపక వృత్తమాధురీ*
*పూరిత వాక్ప్రసూనముల | బూజలొనర్చెదఁ జిత్తగింపుమీ*
*తారకనామ భద్రగిరి | దాశరధీ కరుణాపయోనిధీ.*
*తా:*
కరుణయే రూపము గా కలిగిన భద్రగిరి రామచంద్రా! రఘువంశం అనే సముద్రానికి చల్లదనమును ఇచ్చే చంద్రునివంటి వాడివి నీవు. సంసారమనే సాగరమును తరిపంచేయ గలిగిన తారకరాముడివి నీవు. ఇటువంటి నిన్ను నా మాటలు అనే పువ్వుల తో, ఉత్పలమాల, చంపక మాల అనే పద్య పద్ధతుల లో నాచే రచించపబడిన శతకము అనే పూలతో పూజలు చేస్తున్నాను అందుకో, లక్ష్మణాగ్రజా! ........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రాముడు చూపిన దారిలో నడవడం, రామాయణం. రఘువంశానికి చల్లదనాన్ని పంచే చంద్రుడు అయ్యాడు రామచంద్రుడు. మనలో ఎంత మంది మనము జన్మించిన వంశానికి చంద్రులము కాకపోయినా, కనీసం మంచిపేరు తీసుకుని రావాలి అని ఆలోచిస్తున్నాము. తనను నమ్మిన వారిని రక్షించడమే కాకుండా, రాజ్యం కూడా ఇచ్చాడు, అహల్యా ముక్తి దాయకుడు. మనలో చాలామంది, ఎవరైనా మనల్ని నమ్మి వస్తే వారిని ఎలా మోసగించాలి, వారి సంపదను ఎలా కొల్లగొట్టాలి అని ఆలోచన చేస్తున్నాము. మరి రామాయణం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము. నలుగురి మంచినీ కోరుకుంటూ మన జీవితాన్ని గడిపే అవకాశం ఇమ్మని కౌసల్యా నందనుని ప్రార్థిస్తూ....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు