*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 120 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*నారదా!  శంకరుని ఆజ్ఞను అనుసరించి సంధ్య, మేధాతిథి యజ్ఞము చేస్తున్న, చంద్రభాగ పర్వతం నుండి పుట్టిన చంద్రభాగ నదీ తీరంలో బృహల్లత అనబడే సరస్సు దగ్గర వున్న, ఆశ్రమానికి చేరుకుంది. శివుని అనుగ్రహం వలన సంధ్య అక్కడ వున్న వారెవరికీ కనబడలేదు. హోమ గుండంలో అగ్ని దేవుడు తన పొడవాటి కోరలు చాచి భగ భగ మండుతున్నాడు. ఆ హోమాగ్నిని చూచిన సంధ్య, శివుని ఆజ్ఞ ప్రకారం, తనకు మౌనంగా చేయవలసిన తపస్సు నియమాలు బోధించిన బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మచారి అయిన యువకుని తలచుకుని హోమ గుండంలో ఆత్మ సమర్పణ చేస్తుంది. శివుని తలంపు తెలుసుకున్న అగ్ని దేవుడు బంగారు కాంతితో మెరసి పోతున్న సంధ్య శరీరమును దగ్ధము చేసి, పరిశుద్ధముగా చేసి, అగ్ని పునీత అయిన సంధ్యను సూర్యమండలానికి చేరుస్తాడు.*
*ఆ విధంగా, అగ్ని పునీత అయి వచ్చిన సంధ్య ను పితరులు మరియు దేవతల తృప్తి కొరకు ప్రాతః సంధ్య, సాయం సంధ్య అనే రెండు భాగాలుగా చేస్తాడు, సూర్యుడు. సంధ్య శరీరం యొక్క పై భాగం, అరుణారుణ కాంతులతో ఉదయించే సూర్యుని తో కలిసి వచ్చే ప్రాతః సంధ్య. ఇది దేవతలకు చాలా ఇష్టమైన సమయం. ఎర్ర కలువల కాంతితో అస్తమిస్తున్న సూర్యనితో వచ్చేది సాయం సంధ్య. ఈ సమయం పితరులకు ప్రీతి అయినది.*
*ఈ సాయం సంధ్యకు, భక్తవశంకరుడు, దివ్య శరీరము ఇచ్చి, బంగారు కాంతులతో మెరసే దేహధారి అయిన స్త్రీగా చేసి, యజ్ఞము ముగిసే సమయానికి, మహర్షి మేధాతిథికి యజ్ఞ ఫలంగా, కుమార్తె గా ఇస్తాడు. శిష్యులతో చుట్టబడి వున్న మేధాతిథి మహర్షి తన ఒడిలో కూర్చున్న దైవ ప్రసాదాన్ని చూచి చాలా సంతోషపడి, ఆ బంగారు తల్లికి, "అరుంధతి" అని నామకరణం చేసాడు.*
*మహాసాధ్వి, పరమ పవిత్రురాలు అయిన అరుంధతి యుక్తవయసులో కి రావడం చూచిన విష్ణువు, శివుడు, నేను,  నా మానస పుత్రుడైన వశిష్ఠునికి ఇచ్చి వివాహం జరిపించాము. ఈ వివాహ సమయంలో మా ముగ్గురి చేతులనుండి జారిన నీటి ధారలతో "శిప్ర" మొదలగు ఏడు నదులు ఏర్పడ్డాయి. అరుంధతీ వశిష్ఠుల సంసార నౌక ఆనందంగా సాగిపోతోంది. వారికి శుభాన్ని, శ్రేష్ఠతను ఇవ్వగల ఏడుగురు కుమారులు కలిగారు. సంధ్యా దేవి యొక్క ఈ పుణ్య కథను విన్న స్త్రీ, పురుషులు సకలకార్య సిద్ధిని పొందుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు