ఊపిరి పీల్చుకున్న జింకలు;-- యామిజాల జగదీశ్
 అదొక అడవి. అక్కడ ఒక తల్లి జింక, దాని పిల్ల ఉన్నాయి. తల్లి జింక ఎక్కడికి వెళ్ళినా తన పిల్లను తీసుకుపోతుంటుంది. 
ఆ అడవికి తరచూ వేటగాళ్ళు వస్తుండేవాళ్ళు. వారు తమతో ఒక వేటకుక్కను తీసుకొస్తుంటారు. వారెక్కువగా కుందేలు‌, జింకలనే వేటాడేవారు. ఎక్కడైనా కుందేలునో జింకలనో చూస్తే వాటిమీదకు తోడేలుని వాటిపైకి ఉసిగొలిపే వారు. 
ఓరోజు తల్లి జింక "ఈ అడవిలో వేటకుక్కల బెడద ఎక్కువ. కనుక నువ్వు జాగర్తగా ఉండాలి" అంది. 
"వేటకుక్కలా? అంటే అదెలా ఉంటుందమ్మా?" అని అడిగింది పిల్ల జింక.
"అబ్బో...అవి చూడ్డానికి అది భీకరంగా ఉంటుంది. భయంపుడుతుంది" అంది తల్లి.
"అవునా? భయమంటే?" అంది పిల్ల జింక.
"నువ్వు పిల్లవు. నీకు భయం గురించి తెలీదులే. మనకు దూరం నుంచి వాటి అరుపులు వినడంతోనే మనం మరొక దిశలో పారిపోవాలి" అంది తల్లి జింక.
"అలాగా...అదేం చేస్తుంది?"
",ఏం చేస్తుందా? మనమీద దాడి చేసి ఇట్టే చంపేస్తాయి. అప్పుడు వేటగాళ్ళు పరుగున వచ్చి మనల్ని తీసుకుపోతారు"అంది తల్లి జింక.
 "అంటే జింకలన్నింటికీ వేటకుక్కలంటే భయమా అమ్మా?" అడిగింది పిల్ల జింక.
"అవును, జింకలన్నింటికీ వేటకుక్కలంటే భయం"
"అదేంటీ మగ జింకలకు కొమ్ములుంటాయిగా...అవెందుకు భయపడాలి? వేటకుక్కలు దగ్గరకు రాగానే కొమ్ములతో వాటిని పొడవచ్చుగా. నికు కొమ్ములు రానీ. వాటి సంగతి చెప్తా" అంది పిల్ల జింక.
ఇలా తల్లీ పిల్లా మాట్లాడుకుంటుంటే దూరం నుంచీ అరుపులు వినిపించాయి.
వెంటనే తల్లి జింక చెవులు నిక్కబొడుచుకున్నాయి. శబ్దం వినవచ్చిన దిశలో చూసింది.
"అయ్యా! వేటకుక్క వస్తున్నట్టుంది. త్వరగా పరిగెత్తు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అంది. తల్లి.
కానీ పిల్ల జింక పరుగెత్తలేదు. వేటకుక్క ఎలా ఉంటుందో చూడాలనుకుంది. 
పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. 
కాస్సేపటికి వేటకుక్క అటువైపుగా వచ్చింది.
కానీ దాక్కున్న పిల్ల జింకను చూడలేదు. వేటకుక్క మరో వైపుకి వెళ్ళిపోవడంతో పొదలోంచి జింక పిల్ల బయటకు వచ్చింది.
తల్లిజింక వెతుక్కుంటూ పిల్ల దగ్గరకు చేరింది.
"మంచివేళ..వేటకుక్క కంట పడలేదు నువ్వు. నేను పరుగెత్తగానే నువ్వూ నా వెంట వచ్చేయవలసింది. నువ్వు వెనకే వస్తావనుకునే నేను ముందుకు పరిగెత్తాను. ఇంకెప్పుడూ ఇలా చేయకు. నా వెంటే రావాలి" అంది తల్లి జింక.
"అమ్మా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు.వేటకుక్క నీ అంత ఎత్తుకూడా లేదమ్మా. దానికి కొమ్ములూ లేవు. కనుక అది మనల్నేమీ చేయలేదు. అయినా నాకు కొమ్ములు రానివ్వు. దాని పని పడతాను. ఒక్క పోటు పోడిచానో అది విలవిలలాడాల్సిందే" ఆన్నాది పిల్ల జింక.
అప్పుడు తల్లి జింక ఓ నవ్వు నవ్వి "నువ్వెంతటి ధైర్యవంతుడైనా వేటకుక్క, సింహం, పులి వంటివాటి దగ్గర  తోకముడవాల్సిందే. భయపడాల్సిందే" అంది.
 "ఈ అడవిలో సీంహం కూడా ఉందా? " అని అడిగింది పిల్ల. 
"ఉంది. మనమెప్పుడూ అటువైపు వెళ్ళింది లేదు. మనం పోయే దారిలో అది అంతగా రాదు" అన్నాది తల్లి జింక.
"అయితే దానినీ ఓ రోజు చూసెయ్యాలమ్మా" అంది పిల్ల జింక.
,నీరు తాగి తిరిగొస్తున్నప్పుడు తల్లి జింక నేల మీద చూసింది. "అమ్మో...సింహం ఇటొచ్చినట్టుంది. దాని పాదముద్రలివి" అని భయపడింది. 
"ఏమిటీ, సీంహం పాదముద్రలా? " అడిగింది పిల్ల జింకా ఆత్రుతతో.
"ఇదిగో చూడు. అవి సింహం పాద ముద్రలే. మనమిటువెళ్ళడం ప్రమాదకరం. వచ్చిన దారిలోనే పారిపోదాం. సింహం మనల్ని చూస్తే మన పని అయినట్టే" అంటూ సింహ గల్జన వినిపించిన దిశలో చూసింది తల్లి జింక.
అంతట పిల్ల జింక "నువ్వు కావాలంటే వెళ్ళమ్మా. నేను దానిని చూసాక వస్తానమ్మా" చెప్పింది పిల్ల.
పిల్ల జింక ఇలా అంటున్న సమయంలోనే దూరం నుంచి ఓ అరుపు వినిపించింది. 
“అయ్యో...వేటకుక్కసైతం వస్తోంది. త్వరగా రా!" అంటూ తల్లి జింక పరుగులు తీసింది.
కానీ పిల్ల జింక పరుగెత్తలేదు. దగ్గర్లోనే ఉన్న పొదలోకి దూరింది. వేటకుక్క ఎటొస్తోందో అటువైపు చూసింది.
పొద దగ్గరకొచ్చి ఆగి చుట్టూ చూసింది వేటకుక్క. 
సరిగ్గా అదే సమయంలో అడవి దద్దరిల్లేటట్టు సింహగర్జన వినిపించింది.
ఆ గర్జన ధ్వనికి వేటకుక్క ఓ చెట్టు చాటున దాక్కుంది. కాస్సేపటికి సింహం వచ్చిఉది.
పొద మాటున దాక్కున్న పిల్ల జింక సింహంకేసి చూసింది. 
"ఛ...ఈ సింహానికా మా అమ్మ భయపడుతోంది. ఇదేం చేస్తుంది? దీనికీ కొమ్ములు లేవుగా. ఇది అమ్మంత ఎత్తుకూడా లేదు. అరుపులే తప్ప దీనికేమీ లేదు" అనుకుంది పిల్లజింక. 
సింహం చెట్టుచాటున దాక్కున్న వేటకుక్కను చూసేసింది. వేటకుక్కంటే సింహానికి చెడ్డకోపం. "ఈ ఈ వేటకుక్కవల్లే అడవోలో కుందేళ్ళు, జింకల సంఖ్య తగ్గిపోతున్నాయి.దీనిని వజలకూడదు" అనుకుంది సింహం.
సింహం అమాంతం వేటకుక్కమీద దిడి చేసింది. అది పారిపోయే మార్గంలేక పోరాడాల్సి వచ్చింది. ఆ రెండింటి మధ్య జరిగిన యుద్ధాని చూసి వణికింది పిల్ల జింక.
భయంతో అక్కడ్నుంచి పరుగులు తీసింది పిల్లజింక. 
అమ్మను చూసాకే పిల్ల జింక పరుగు ఆగింది.
తన పిల్లను చూసిన క్షణంలోనే అమ్మ మనసు శాంతించింది. రెండూ కలిసి అక్కడి నుంచి చల్లగా జారుకుని తమ స్థావరానికి చేరుకోవడంతో ఆరోజు కథ ముగిసింది.

కామెంట్‌లు