మినీలు - యామిజాల జగదీశ్
 1
అవసరం
..............
ఓ ఆవు గడ్డి మేస్తోంది.
అక్కడే చెట్టుపైన ఉన్న పిల్ల పిచ్చుక తల్లిని అడిగింది...
"అమ్మా, ఎందుకమ్మా, ఆవుకి మనలాగా రెక్కలు లేవు" అని.
అప్పుడు తల్లి పిచ్చుక నవ్వుతూ మనలాగా ఆవుకి రెక్కల అవసరం లేదంది.
తల్లి పిచ్చుక ఇంకా ఇలా అంది...
"ఆకాశంలో గడ్డి మొలిచినప్పుడు ఆవుకి రెక్కలు మొలుస్తాయి" అని.
2
జగన్నాథుడు
.............
కుచేలుడు తన భార్యను పిలిచాడు
"సుశీ...నేను కృష్ణుడి ఇంటికి పోతున్నాను ఓసారి చూసొద్దామని. ఏమిస్తావు?" అని అడిగాడు.
"స్వామీ, మీకు తెలియకుండా నా దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి. పొరుగింట్లో నించి తీసుకొచ్చిన ఓ పిడికెడు అటుకులు ఉన్నాయి" అంది కుచేలుడి భార్య.
"అటుకులా....అతనికివి చాలా ఇష్టం. అది చాల్లే. ఇవ్వు" అన్నాడు కుచేలుడు.
"స్వామీ, పిల్లలు ఆకలితో గోలపెడుతున్నారు. కృష్ణుడు మీ మిత్రుడే కదా. మీరీ గుప్పెడూ తీసుకుపోవాల్సిందేనా" అడిగింది అతని భార్య.
"ఓసీ పిచ్చిదానా. కృష్ణుడు నా మిత్రుడు మాత్రమే కాదు, ఓ గొప్ప అధికారి. అతను జగన్నాథుడనే విషయాన్ని మరచిపోయేవా" అన్నాడు కుచేలుడు.
3
వేణువు
..................
అడవిలో ఉన్న వెదురుచెట్టు ఓ రోజు నరికివేతకు గురైంది. 
ఓ నిప్పు కమ్మీతో తనను పొడుస్తుంటే "అయ్యో నా దేహం పుండవుతోంది" అని ఏడ్చింది వెదురు.
"కాస్తంత ఓపిక పట్టు" అంది వెదురుని చూసి గాలి.
వెదురుబొంగు వేణువైంది,
వేదికపై...
ప్రపంచాన్ని తన్మయపరిచే వేణుగాన సంగీత ప్రవాహం సాగుతుంటే ప్రేక్షకులందరూ ఆనందపరవశులయ్యారు. 
అప్పుడు వేణువుని చూసి గాలి చెప్పింది...
"గాయపడిన మనసే ఓలలాడించగలదు" అని.

4
విలువ
-----------
బతికితే కోకిలలా బతకాలి అన్నాది సీతాకోకచిలుక.
ఇంకొక సీతాకోకచిలుక అడిగింది
"ఎందుకు" అని.
"అదిగో చూడు...మామిడిచెట్టుకొమ్మపైన పాడుతోంది కోకిల"
"అది మామిడి చెట్టుకోసమే పాడుతోంది. అనంతరం మామిడిపండుని తింటుంది. ఎగిరిపోతుంది" 
"అర్థం కాలేదా"
"ఎవరికీ బాకీ ఉండకూడదు. ఇచ్చి పుచ్చుకో. అంతేతప్ప ఒకరికి భారమై బతక్కూడదు"
"ఓహో...ఇప్పుడు అర్థమైంది" అంది రెండో సీతాకోకచిలుక.
తనతో తాను చెప్పుకుంది...
"చెట్టుకో పాట.
కోకిలకో పండు..."

కామెంట్‌లు