ఫోటోలు చెప్పించిన కబుర్లు;-- యామిజాల జగదీశ్
 నేను కొంత కాలం పాటు ఓ వారపత్రికలో అనుకుంటాను, ఓ అందమైన శీర్షికను తప్పనిసరిగా చూసేవాడిని. ఆ శీర్షిక పేరు "మీరెక్కడున్నారు?" అనే గుర్తు. అదేంటంటే కొన్నేళ్ళ క్రితం నాటి ఓ గ్రూప్ ఫోటో వేసి అందులో మీరెక్కడున్నారో చూసుకోండని చెప్పేవారు. ఆ వారపత్రిక పేరు "స్వాతి" అని గుర్తు. నిజంగానే ఫోటోలెప్పుడూ అందులోనూ కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఫోటోలంటే మాటలా. అలాంటి ఫోటోలు పాతవి కావచ్చు కానీ అవి చూస్తున్నప్పుడు వచ్చే మాటలు అప్పుడే వికసిస్తున్న పువ్వుల్లాంటివే సుమీ. ఆ ఫోటోలోని వ్యక్తులను కానీ దృశ్యాలను కానీ చూసినప్పుడు వచ్చే జ్ఞాపకాలతో మన మనసు వర్తమానాన్ని మరచిపోయి  ఆరోజుల్లోకి పోతుంది. అప్పుడు కలిగే ఆనందం అవధుల్లేనివి. మాటలకు అందనిది. 
ఏమిటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా...
విషయానికొస్తాను.
ఓ వారంరోజుల తేడాలో నాకు వాట్సప్ లో ఓ మూడు ఫోటోలు అందాయి. ఆ మూడు ఫోటోలలో నేను లేను గానీ మద్రాసులోని టీ.నగర్లో నేను చదువుకున్న శ్రీ రామకృష్ణా మిషన్ బాలుర ఉన్నత పాఠశాల (మెయిన్ బ్రాంచ్, పనగల్ పార్కు ఎదురుగా ఉన్న స్కూలు) లో చదువుకున్న విద్యార్థులున్న ఫోటోలవి. ఓ రెండు ఫోటోల వయస్సు అరవై రెండేళ్ళ క్రితంనాటిది. మరొక ఫోటో యాభై రెండేళ్ళ నాటిది. 
1961 జపవరి 16న తీసిన గ్రూప్ ఫోటో. ఈ ఫోటోలో దొరైస్వామి మాష్టారుగారితో కనిపిస్తున్న శిష్యులందరూ అప్పట్లో ఎనిమిదో తరగతిలో చదువుతున్నవారే. వీరిలో ఉన్న రెండుచింతల మురళీకృష్ణగారితో నిన్న రాత్రి (జూలై 19) ఫోన్లో మాట్లాడాను. ఆయన మద్రాసులో మేముండిన బజుల్లారోడ్డులోనే 52వ నెంబర్ ఇంట్లో ఉండేవారట. ఈయన క్లాస్ మేట్ మా మూడవ అన్నయ్య ఆంజనేయులు. ఈ ఫోటోని రెండో ఆన్నయ్య ఆనంద్ పంపాడు. "రవ్వలడ్డు చోరీ"  అనే శీర్షికతో ప్రదర్శించిన నాటకంలో మా అన్నయ్య ఆంజనేయులు, మురళీకృష్ణ తదితరులు నటించారు. మురళీకృష్ణ గారి సోదరి లక్ష్మిగారు మా నాన్నగారి (యామిజాల పద్మనాభస్వామిగారు) శిష్యురాలే రామకృష్ణామిషన్ వారి శారదా విద్యాలయంలో. 
ఇక మరొక ఫోటో 1970 - 71 అకడమిక్ ఇయర్లోది. అంటే నా స్కూల్ ఫైనల్ (అప్పట్లో పదకొండో తరగతి). మేజర్ ఎక్స్ కర్షన్ పేరుతో విద్యార్థులను డిల్లీ, బొంబాయి, హైదరాబాద్ నగరాలకు తీసుకుపోయినప్పుడు తీసిన గ్రూప్ ఫోటో అది. ఈ టూరుకి నేను వెళ్ళలేదు. కానీ నా క్లాసు మేట్స్ హరి నాగభూషణ శాస్త్రి, మోచర్ల ప్రభాకర్ ఈ టూరుకి వెళ్ళారు. వీరిద్దరిలో హరి మాత్రమే ఫోటోలో ఉన్నాడు. ఈ ఫోటో తీసిన రోజున ప్రభాకర్ స్కూలుకి రాకపోవడంతో అందులో లేడు.  అలాగే ఈ ఫోటోలో కన్పిస్తున్న మాష్టార్లలో కోరాడ రామచంద్ర శాస్త్రిగారు మాకు సైన్స్ చెప్పారు. ఈయన కుమారుడు సూర్యనారాయణ మా సహవిద్యార్థే. మా తెలుగు మాష్టారు కోట సత్యరంగయ్య శాస్త్రిగారు, డ్రిల్ మాష్టారు తంగవేలు, ఇంగ్లీషు పాఠాలు చెప్పే ఓ.వి. గోపాలన్ తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. తంగవేలు గారిని చూడటంతోనే భయం వేసింది. ఆయన కాస్తంత లావుగా ఉండి ఖాకీ లాగు, తెల్ల టీషర్టు వేసుకునే వారు. ఆయన చేతిలో ఓ  కర్ర ఉండేది. అది చిన్నపాటి కర్రేకానీ దానిని చూడటంతోనే భయమేసేది కొడతారేమోనని. స్కూలు గ్రౌండ్లో మమ్మల్ని ఆడించేవారు. నాకు మామూలు తరగతులకంటే ఈ డ్రిల్ క్లాస్ బాగా ఇష్టం. ఎందుకంటే పాఠాలు బుర్రకెక్కేది కాదు. ఏదో బట్టీ పట్టి ప్యాసవడమే ప్రతి ఏడాదీనూ. కొద్దో గొప్పో జ్ఞాపకశక్తి ఉండేది బట్టిపట్టినవి రాయడానికి అప్పట్లో. ఇప్పుడైతే అదీ లేదు. టూరుకి వెళ్ళిన విద్యార్థులలో ఒకడైన ప్రభాకరుతో మాట్లాడాను ఆ నాటి జ్ఞాపకాలేవైనా చెప్తాడేమోనని. బాంబేలో రైలు దిగడంతోనే తెలుగు మాష్టారు సత్యరంగయ్య శాస్త్రిగారు ఆ నగరం గురించి ఆశువుగా పద్యాలను రాగయుక్తంగా చెప్పడం గుర్తుందన్నాడు. ఫోటోని వాట్సప్ లో పోస్ట్ చేసిన హరికి థాంక్స్. 
మా స్కూల్ ఫైనల్లో చదువుకున్న వారిలో ఓ ఇరవై మందిదాకా వాట్సప్ లో "బాల్యమిత్రులు" అనే గ్రూపులో మెసేజస్ పంచుకుంటూ ఉంటాం. ఈ గ్రూపు అడ్మిన్లు హరి, పిల్లలమర్రి శివప్రసాద్. వీరిద్దరూ మద్రాసులోనే ఉంటున్నారు. ప్రభాకర్ సుచిత్రారోడ్డులోని దండమూడి ఎన్ క్లేవ్ లో ఉంటున్నాడు. ఇటీవలే మేం కలిశాంకూడా. హరి, శివ మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తే ప్రభాకర్ ఇంట్లో కలుసుకోవడం తప్పనిసరి. మంచి భోజనం పెట్టారు ప్రభాకర్ వాళ్ళావిడ.
నా స్కూల్ జీవితంలో నేను వెళ్ళిన ఎక్స్ కర్షన్ ఒక్కటే. అది కూడా ఎన్నో క్లాసప్పుడు వెళ్ళామో గుర్తుకు రావడం లేదు కానీ వెళ్ళిన చోట్లు గుర్తున్నాయి లీలగా. అవి మీనంబాక్కం విమానాశ్రయంలో "ది హిందూ" దినపత్రికవారి విమానంలోపలకెళ్ళి చూడటం. అలాగే గిండీలో పెన్సిళ్ళు తయారుచేసే ఫ్యాక్టరీకి వెళ్ళడం. మరొకటి ఓ డెయిరీ ఫామ్. మాధవరం పాల ఫ్యాక్టరీ అని గుర్తు. 
ఇలా చెప్పుకుంటే పోతో బోలెడన్ని ఉంటాయి. అందుకే పాత ఫోటోలు చూడాలన్నా, డైరీలు, ఉత్తరాలు చదవాలన్నా నాకెంతో ఇష్టం. వీటివల్ల ఎన్ని మధురమైన విషయాలు జ్ఞాపకానికొస్తాయో చెప్పలేను. అంతకు రెట్టింపు ఆనందం కలుగుతుంది మనసుకి. హాయిగా ఉంటుంది.కామెంట్‌లు