భక్తి-శ్రద్ధ! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా రోజూ  అమ్మ తో పాటు సాయిబాబా గుడి వీలుంటే శివాలయంకి వెళ్లి వస్తుంటాడు.అమ్మ తో పాటు ప్రదక్షిణాలు నుదుట విభూది పెట్టుకొని తీర్ధం ప్రసాదం తీసుకుని ఇంటికి వస్తాడు.బడి హడావిడి ఉన్న రోజు  పరీక్షలటైంలో వెళ్లడు.అమ్మ పిలిచినా "నేను చదువుకోవాలి.మాటీచరు చెప్పారు గాలిలో దీపంపెట్టి దేవుడూ నీమహిమ అనరాదు అని.బాగా చదివితే పరీక్షల టెన్షన్ పోగొట్టి అన్నీ గుర్తు కు వచ్చేలా చేస్తాడు ట."తల్లి చేసేదేమీ లేక ఒక్కతే వెళ్తుంది. సెలవు  ప్రత్యేక పూజలు జరగటంతో గుడిలో భజనలు  సత్సంగం అన్నీ జరుగుతున్నాయి. శివా అక్కడ అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. కొందరు సెల్ ఫోన్ లో మాట్లాడుతుంటే ఇంకొందరు పిచ్చాపాటి వెనకాల కూచుని గుసగులాడుతున్నారు.అంతా ఐనాక రెండు పెద్ద స్టీలు డబ్బాల నిండా పులిహోర  చక్కెరపొంగలి పెట్టుకొని తల్లి బైలుదేరింది.శివా నడుస్తూ అడిగాడు "అమ్మా!గుడిలో శ్రద్ధ సబూరీ అని చెప్పారు కదా!మరి భక్తి కన్నా కబుర్లు జోరుగా చెప్పుకుంటున్నారు కొందరు ఆంటీలు!కొందరు అన్నలు అంకుల్స్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. మాటీచర్లు పాఠం చెప్పేటప్పుడు తమకళ్లలోకి చూస్తూ వినమంటారు.మధ్యలో ఠక్కున ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పకపోతే నిలబెడతారు.దేవుడు కూడా చూస్తాడు అని చెప్పావుకదా?"
"అబ్బబ్బ!నీవెధవప్రశ్నలు నీవు!?పెద్ద వారి విషయాలు నీకెందుకురా?" ఇంతలో  వృద్ధ దివ్యాంగులు దీనంగా అమ్మా అని పిలుస్తున్నారు. "గబగబా నడవరా శివా!" తల్లి హడావుడిగా అడుగులేస్తోంది."అమ్మా!బాబా రోజూ భిక్షాటన కెళ్ళి  ఆవచ్చిన దానితో వండి బీదబిక్కీకి పంచేవాడు అని చెప్పావు.పాపం  ఆదివ్యాంగులకి పెట్టమ్మా!" వాడిగొంతులో వేడికోలు!అక్కడ అంతా కార్లలో పట్టుచీరల రెపరెపలతో ఉన్న వారే పళ్లాలు పట్టుకుని క్యూలో నిలబడ్డారు."మన అపార్ట్మెంట్ వారికీ పంచాలి కదా?"తల్లి జవాబు వాడికి తృప్తి గా లేదు. అందుకే "నేను నీతో రాను.ఆదివ్యాంగులకి ప్రసాదం కడుపు నిండేలా పెట్టు"అని రెండు పేపర్ ప్లేట్లు అమ్మ ముందు పెట్టాడు. ఇకచేసేదేమీ లేక అమ్మ అలాగే వారికి శివా చేత ప్రసాదం పంపింది."సల్లంగ ఉండు బిడ్డా!" వారి మాటలు అమ్మ మనసుకి తాకాయి.పెద్దలు నీతులు చెప్తూ అడ్డదారుల్లో పోతున్నారు. పిల్లలు ఇంకా మంచి దారిలో అడుగులేస్తూ ఉన్నారు. భక్తి-శ్రద్ధ తో పాటు ఆచరణలో ఆదర్శంగా ఉండాలి -అనుకుంటూ శివా వైపు గర్వంగా చూసింది.తన కొడుకు తనకు మార్గదర్శి ఐనందుకు ఆమె లో ఎంతో మార్పు చోటుచేసుకుంది. 🌹
కామెంట్‌లు