చేసినపాపం చెపితే పోతుందట (గుర్తుకొస్తున్నాయి);- సత్యవాణి

  "అబ్బ ,ఎవరెత్తుకొంటారస్తమానూ!నేనెత్తుకోలేను బాబూ!"చంకదింపితే ఏడ్చే మా చెల్లెలు 'మణి'గురించిన నామాటలు.
         అవును నా మూడోచెల్లెలు (పేరు తర్వాత రాస్తాను) చెల్లెలిగురించే నేనుచెపుతున్నది.అది చిన్నప్పుడు అంటే మరీ ఏడాదీ,రెండేళ్ళవయసప్పుడన్నమాట ఎప్పుడూ ఈసురోమని వుంటూ,ఏడుస్తూవుండేది.ఎప్పుడూ ఎవరిదో ఒకచంకలో వుండాల్సిందే!దింపేమా ఆరునొక్కరాగమే!
        అది పుట్టినప్పుడు పదోరోజున చాలా జబ్బుచేసినప్పుడు ఇంక ఆశలేదని బయటపేట్టేసేరుట.
అలా ఇంటపెట్టా,బయటపెట్టాక్రింద  నెలా, రెండు నెలల తరువాత బతికి బట్టకట్టిందట.అంటే అంతదాకా 'జుబ్బా'కూడా వేయలేదన్నమాట. "ఏదైతే అదే అవుతుందని పాషాణం కూడా పడేసేకా దానిప్రాణం నిలబడింది ,అందుకనే మీ అందరికన్నా నల్లగా వుంటుంది.పుట్టినప్పుడు తెల్లగా మతాబాలాగ మెరిసిపోతూవుండేది " అంటూండేది అదినల్లగా వుండడానికి కారణం చెపుతూ అమ్మ.ఆతర్వాత కూడా కోరింతదగ్గూ, కామెర్లు, దగ్గూ ,ఆయాసం ఇలా చిన్నపిల్లలకు ఆరోజుల్లో ఏ ఏ రోగాలు వస్తుండేవో ఆ ఆ రోగాలన్నీ వచ్చి,ఎప్పటికప్పుడు చచ్చి బతికేది. అందుకనే అప్పట్లో దాని మెడలో, మెడ అంటే సన్నని సీసామూతిలాంటి పీకకి ,ఆంజనేయబిళ్ళా,కోరింతతాడూ, కాశీతాడూ, సాయిబాబా బిళ్ళా మొదలైన అనేక దేవీ దేవతల రూపాలతో తాళ్ళు వుండేవి.
  బక్కగా డొక్కులా వుంటుందని ,దానిని మాపాలాకాపులూ,పనిమనినషి పైడమ్మా,చాకలి మరిణమ్మా,అందరూ డొక్కుమ్మగారు అనే అనేవారు. అందరిమాటా ఎందుకు?మానాన్నా, మాపక్కింటి నల్లమావయ్యగారూ ,అన్నారండాక్టారూ  అందరూ దాన్ని డొక్కుమ్మా అనేవారు. అలాపిలిస్తెనే పలాకెదది అప్పట్లో.
        చెప్పేనుకదా ఎప్పుడూ ఏదోరోగంరావడం,బతికి జుబ్బాల్లోంచి గౌనులుతొడగడందాకా వచ్చిందికానీ ఎప్పుడూ ఈసురో మని ఏడుస్తూనేవుండేది. అన్నని జబ్బులు చేసి బతికిన పిల్లని దాన్ని మా అమ్మా ,నాన్నా కాస్త అపురూపంగానే చూసేవారు.అందులో భాగంగానే,చంక దింపకుండా ఎత్తుకోవడం.దింపితే అది పొలోమంటూ ఏడవడం,అమ్మ  దాన్ని ఏడిపించవద్దంటూ నన్ను తిట్టడం,"అబ్బా!అస్తమానూ ఎవరెత్తుకొంటారేంటి ?"అని నేను సణుక్కోవడం, "మరి ముందెందుకు పుట్టావు?" అని మా మూలపేటబామ్మగారు నాకు సర్థిచెప్పడం ఇలా వుండేది దాంతొ గొడవ.
      బడినుంచి వచ్చేకా కాసేపు ఆడుకోడానికెళదామనుకొంటే,"పిల్లా! ఠింగురంగామని గెంతుకొంటూ వెళ్ళాపోవడంకాదు,పిల్లని చంకనేసుకెళ్ళు "అని అమ్మ ఆజ్ఞాపించేది. చెప్పొద్దూ, నామీద నాకే  బలే చిరాకెసేది.
"ఛీ..ఛీ వెధవబతుకు "అంటూ నన్ను నేను వెయ్యిసార్లన్నా తిట్టేసుకొని, కాళ్ళు ఠపాఠపామని బాదుకొంటూ వెళ్ళి,  ఆ ఏడుపుగొట్టుపిల్లని ,అదే నా చెల్లెల్ని  చటుక్కున చంకనెత్తుకొని, విసురుగా నడుస్తూ,ఇంటినుంచి బయటపడడానికి అడ్డుగా ఎన్ని గుమ్మాలుంటాయో అన్ని గుమ్మాలకూ దానితలను, ఠపీ.. ఠపీ..మని తాటిస్తూంటే,అది కెవ్వు.. కెవ్వు..మని ఏడుస్తుంటే,
"ఓ పిల్లోయ్ !అది అన్నిగండాలూ దాటి బతికినా, నీచేతిలో దానిప్రాణం పోయేలావుంది" అని అమ్మ అరుస్తూంటే ,వినీ వినబడనట్టు వీధిలో పడేదాన్ని.
    ఆరోజుల్లో ఇళ్ళలోవుండే ఆడంగులు కరెంటుసదుపాయం లేని ఊర్లు కాబట్టి రాత్రైతే దీపంబుడ్డి వెలుగులో వంటలు చెేయడం కష్టం కనుకా, పొలాలకెళ్ళిన మగవారు అలసిపోయి వచ్చేసరికి,దేభ్యమొహాలతో కనపడకూడదనీ, చక్కగా ముస్తాబులై, అరుగులమీద చేరి  వీధిలో ఆటలాడుతున్న పిల్లల ఆటపాటలు చూసిఆనందించేవారు. ఎదురు అరుగుల మీద ఆడవాళ్ళతో, పక్క అరుగులమీద ఆడవాళ్ళతో మాటలో మాటకలిపి మంచీ చెడ్డా ఊసులాడుకొనేవారు ఆసాయంత్రంసమయాల్లో. మగవాళ్ళు ఇంటికొచ్చే సమయానికి  "ఎప్పుడన్నా వీధిమొఖం చూసేమా" అన్నట్లు గమ్మత్తుగా అరుగుల మీదినుండి అంతర్థానం అయిపోయేవారు. 
      అలా మాచెల్లిని చంకనేసుకెళ్ళి, సత్తెంమావయ్యగారి అరుగుమీదో, తాయారువదినగారి అరుగుమీదో, వీర్రాజుమావయ్యగారి అరుగుమీదో దాన్ని కుదేసేదాన్ని.ఎవరింటి అరుగుమీద ఎక్కువజనాలున్నారోచూసి మరీ వాళ్ళఅరుగుమీదన్నమాట.ఎందుకంటే నేనాటల్లోపడి దాన్ని పట్టించుకోకున్నా, వాళ్ళు దాన్ని పడిపోకుండా చూస్తారని నా ఐడియా అన్నమాట.
       సత్తెంమావయ్యగారింటిముందే ఎక్కువ ఖాళీస్థలం వుంటుంది కనుక అక్కడే ఆవీధిలోని పిల్లలం ఓపాతిక ,ముఫ్ఫైమందిదాకా అడా-మొగా  పోగయ్యేవారం. ఆటలాడేటప్పుడు ఆడామగా తేడాల్లేవు. మగపిల్లలు కూడా,మాతో కిరికీ,కుంటాటాలాంటి ఆటలు ఆడేవారు.మేంకూడా మగపిల్లలతో సమానంగా వాళ్ళఆటలు కబాడీలాంటివి ఆడెేవాళ్ళం.
       అలా ఏదోఒక ఆటమంచి రస పట్టులో వున్నప్పుడు "ఓ వాణోయ్ !మీచెల్లెలు అరుగు కొసకి వచ్చేస్తోంది ,పడిపోతుందనో, లేకపోతే ,మీచెల్లెలు ఇందాకటినుంచీ ఏడుస్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదని మీ అమ్మతో చెపుతానుండు" అంటూ, శేషమ్మబామ్మో,గంగరాజుదొడ్డమ్మో, లేకపొతే తాయారొదినో ఎవరో ఒకరు ఆటాపేసి వచ్చేదాకా కేకలేసెవారు."మీచెల్లాయి ఏడుస్తున్నా ,పిల్లని పట్టించుకోవేం"అంటూ కేకలేసేవారు. వాళ్ళను మింగెసేలా ఒకచూపుచూసి, 'ఏంకాసేపు దాన్ని ఊరుకోబెడితే వాళ్ళసొమ్మేంపోతుందో 'అంంటూ లోలోపల సణుక్కొంటూవుండెదాన్ని.
     "ఛీ..ఛీ.. ఇదెప్పీడూ ఇంతే"అని చిరాకేసేది దానిపై. చెప్పొద్దూ,ఆటమధ్యలో ఆపవలసి వచ్చి, దాన్ని ఎత్తుకోవలసి వచ్చినందుకు నాకు ఏడుపుతో కూడిన, కోపం,ఉక్రోషం వచ్చి ,'చేసినపాపాలు -చెపితే పోతాయాట' మాచెల్లి తొడమీద చిన్న 'పిక్కపాశం 'లాగేసి,అది ఘొల్లున ఎడుస్తుంటే తీసికెళ్ళి అమ్మ ఒడిలో కుదేసి,"బాబోయ్ దీన్ని నేనెత్తుకోలేను.అస్తమానూ ఎడుపే" అంటూ నేను విసవిసలాడుతుంటే,మళ్ళీ మా మూలపేటబామ్మగారు "మరి ముందెందుకు పుట్టేవు? అన్నప్పుడు 'అవును చండాలంగా నేను ముందెందుకు పుట్టేను?" అని నన్ను నేను అనేకవాధాలుగా ప్రశ్నించుకొని ,అలా పుట్టింనందుకు నన్నునేను తిట్టుకొంటూ, అంతులేకుండా చింతించేదాన్ని.
   అలా నన్ను ఆటలకు దూరంచేస్తోందని ,అస్తమానూ ఎత్తుకోవలసివస్తోందనీ ,చిరాకుపడిన  నా ముడో చెల్లెలు 'మణి',మాఅమ్మభయపడినట్లు, నావలన  అది ఆపదలు పాలవకుండా మొత్తానికి బతికి (పట్టుచీరలుకట్టుకొంటూ) బట్టకట్టి ,ఎన్నోచదువులను తలలోకెత్తుకొని ,పదిమందిలో ఔననిపించుకొంటూ, పేరుప్రఖ్యాతులు సంపాదించుకొంటూ ,'నువ్వానేనా' అన్నట్లు బ్రతుకుతూ, మరెందరి బ్రతుకులలో ఏర్పడిన చిక్కులనూ-చిక్కుల్లాంటి మూడుముళ్ళనూ, విప్పి కలుపుతూ,అత్యవసరం,అపాయంఅనుకొన్నప్పుడు చింతిస్తూ విడదీస్తూ,వారి వారి
చింతలు తీరుస్తూ, చుట్టాలలో ,స్నేహితులలో  'మణి'అంటే నిజంగా 'మణిపూస' అనిపించుకొంటూ, 'మీకు 'నేనున్నాను 'అని మా అక్కచెల్లెళ్ళకు ,(ముఖ్యంగా నాకు) భరోసాగా వున్నందుకు ఎల్లప్పుడూ సంతోషపడుతూ,
"తనకు నేను పెట్టిన గిల్లి,గిచ్చుడు ,పాశాలు పెట్టిన పాపం ఏదైనా వుందంటే అది మీఅందరిచేతా చదివించేసేసి తలకోకొంచం పంచేశాను కనుక, నెేను ఇక విమక్తురాలినైనట్లేనని భావిస్తూవున్నాను. ఎందుకవను? మరి నాపాపం చదివినవారికి కూడా తలోకాస్తా పంచెేశాను కనుక తప్పక పాప విముక్తురాలిని ఐయ్యేవుంటాను.
    
        
కామెంట్‌లు