పేపర్ బాయ్ (కథ) --సరికొండ శ్రీనివాసరాజు
    జయేంద్ర 10వ తరగతి చదువుతున్నాడు. జయేంద్ర ఇంటికి రోజూ న్యూస్ పేపర్ వస్తుంది. జయేంద్ర పేపర్ వేసే అబ్బాయితో దురుసుగా ప్రవర్తించేవాడు. "పేపర్ వేసేటప్పుడు చూసుకోవద్దా. నిన్న వర్షం వచ్చి పేపర్ అంతా తడిసిపోయింది." అన్నాడు జయేంద్ర. "క్షమించు మిత్రమా! నేను పేపర్ వేసేటప్పుడు వర్షం లేదు. ఆ తరువాతే ఈ కురిసి తడిసిందేమో!" అన్నాడు పేపర్ బాయ్ అమరేంద్ర. "మిత్రమా ఏమిటి? నేను ధనవంతుల అబ్బాయిని. నువ్వు పూర్ పేపర్ అబ్బాయివి. నీకు నాకు స్నేహమా? ఇంకోసారి అలా అన్నావో మర్యాద దక్కదు." అన్నాడు జయేంద్ర. ప్రతి చిన్న పొరపాటుకు గొడవ పెట్టుకోవడం మామూలు అయింది జయేంద్రకు.
       మరోసారి పేపర్ బిల్ జయేంద్ర తండ్రి మహేంద్ర కడుతున్నాడు. "నాన్నా ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను. నేను లెక్క చేశానులే!" అన్నాడు జయేంద్ర. "పోనీ లేరా! పేదవాళ్ళకు ఉడతా భక్తిగా కొంచెం ఎక్కువ ఇస్తే నష్టం ఏమీ లేథురా!" అన్నాడు అమరేంద్ర. " అన్యాయాన్ని సహించను నేను. తే ఆ ఐదు రూపాయల చిల్లర ఇవ్వు." అని వసూలు చేసుకున్నాడు జయేంద్ర. ఒకరోజు అమరేంద్ర జయేంద్రతో "10వ తరగతి స్టడీ మెటీరియల్స్ వార్తా పత్రికలో ఇస్తున్నారు. రోజూ చదివితే స్కూల్ ఫస్ట్ వస్తావు.: అన్నాడు జయేంద్ర. " నా చదువు సంగతి నీకు ఎందుకు? నేను తరగతిలో ఫస్ట్ ర్యాంకర్." అని పొగరుగా సమాధానం ఇచ్చాడు జయేంద్ర.
       కాలం గడుస్తుంది. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జయేంద్రకు ఆశించిన దాని కంటే చాలా తక్కువ గ్రేడ్ వచ్చింది. ఆరోజు తండ్రితో చివాట్లు తప్పలేదు. మరునాటి నుంచి పేపర్ బాయ్ మారిపోయాడు. "నిన్నటి దాకా పేపర్ వేసిన అబ్బాయి ఏడీ." అడిగాడు జయేంద్ర. అని అడిగాడు "అతని గురించి నీకు తెలియదా? అతను పొరుగూరు అబ్బాయి. పదవ తరగతి పరీక్షల్లో అతనికి 10కి 10 జ.పి.ఎ. పాయింట్లు వచ్చాయి. చాలా తెలివైన విద్యార్థి." అన్నాడు కొత్త పేపర్ బాయ్. జయేంద్ర చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో! ఇంత తెలివైన విద్యార్థినా తాను అవమానించింది. అతడు ఏం చదువుకున్నాడో తెలుసుకొని, స్నేహం చేసి, తెలియని, అర్థం కాని విషయాలు చెప్పించుకుంటే ఎంత బాగుండేది. ఎలాగైనా అతనిని కలిసి క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడు జయేంద్ర.

కామెంట్‌లు