అదృష్టం-దురదృష్టం;-: సి.హెచ్.ప్రతాప్
 రెండు కుక్కలు ఒక రోజు కలిసి ఆహారం వేటలో పడ్డాయి. రోడ్డు మీద నడుస్తూ కనిపించిన చెత్త కుండీలలో ఏదైనా ఆహారం దొరికితే వాటితో కడుపు నింపుకుంటూ నడుస్తున్నాయి.
ఇంతలో రోడ్డు పక్కన ఒక చిన్న కోడి పిల్ల కనిపించింది. అది బహుశా తన తల్లి నుండి నుండి విడిపోయి ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా చూస్తూ వుంది.
దానిని చూడగానే మొదటి కుక్క  " ఆహా!ఈ రోజుకు విందు భోజనం దొరికింది, ఏమి నా అదృష్టం" అంటూ ఆనందంతో మొరిగి ఆ కోడిపిల్లను గబుక్కున నోట కరుచుకొని పరుగులు తీసింది. దాని వెనకాలే రెండో కుక్క కూడా ఆశగా పరుగులు తీసింది.
ఒక ఖాళీ ప్రదేశంలో రెండు కుక్కలు ఆగాయి. "ఇప్పుడు ప్రశాంతంగా ఈ కోడి పిల్లను తిని నా కడుపు నింపుకుంటాను" అంది మొదటి కుక్క.
" నేనూ నీతోపాటే ఆకలితో వున్నాను.నాకు కొంచెం భాగం ఇవ్వవా" ప్రాధేయ పడింది రెండో కుక్క.
"అదెలా కుదురుతుంది. దానిని మొదట చూసింది నేను. కష్టపడి పట్టుకుంది నేను. కాబట్టి మొత్తం నాకే చెందాలి. ఇందులో నీకు భాగం ఇచ్చే ప్రసక్తి లేదు" ఖచ్చితంగా అంది మొదటి కుక్క. అంతేకాకుండా ఎంతో ఆబగా ఆ కోడిపిల్ల మాంసాన్ని పీక్కు తినడం ప్రారంభించింది.
ఇంతలో " పాడు కుక్కలు ఇక్కడే వున్నాయి. పట్టుకొని చంపండి" అంటూ అరుపులు వినిపించగా రెండు కుక్కలు వెనక్కి తిరిగి చేసాయి.
 
కొందరు మనుష్యులు కర్రలు, కట్టెలు చేత్తో పట్టుకొని  కోపంగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు.
" మనల్ని చూస్తే వాళ్ళు చంపేస్తారు.త్వరగా పరిగెత్తు" అంది మొదటి కుక్క.
" కోడిపిల్లను పట్టుకుంది నువ్వు, తింటోంది నువ్వు, కాబట్టి శిక్ష కూడా నువ్వే అనుభవించు. అదృష్టంలో పాలు పంచుకోనప్పుడు దురదృష్టంలో నేను ఎందుకు తోడు రావాలి?"  అని రెండో కుక్క అక్కడినుండి పారిపోయింది.
మొదటి కుక్క పరిగెత్తే లోపల ఆ మనుష్యులు కర్రలతో కుక్కను చావబాదారు.సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు