అరవైలో నలభై- హారతి కర్పూరం;- - దోర్బల బాలశేఖర శర్మ
 

నలభై సంవత్సరాల (1981- 2021) నా సుదీర్ఘకాల ఫుల్ టైం పాత్రికేయ జీవితానికి అతి త్వరలో ఒక అధికారిక 'విశ్రాంతి' లభించ బోతున్నది. 20 ఏళ్ల వయసులో, తెలిసీ తెలియని పద్ధతిలో, కనీస శిక్షణ అంటూ ఏదీ లేకుండానే 'ఈనాడు'లో స్ట్రింగర్ (స్థానిక విలేకరి: కరెస్పాండెంట్)గా ఐదేళ్లు, ఆ తర్వాత 'ఉదయం', 'వార్త', ప్రస్తుత 'నమస్తే తెలంగాణ' వరకు.. (నాలుగు దశాబ్దాలు- నాలుగు పత్రికలు) సాగిన అక్షరయానం ఇది.
అసలేం జరిగింది? ఎందుకు, ఎలా నేను ఈ పత్రిక రచనా రంగంలోకి వచ్చాను? వచ్చానా లేక, నెట్టి వేయబడ్డానా?ఎలాగోలా వచ్చి, ఏం సాధించాను? విలువైన, విలువలతో కూడిన తెలుగు జర్నలిజానికి ఏమిచ్చాను? మరేం కోల్పోయాను? ఈ జర్నలిజం నాకేం నేర్పింది? నా ఊరు ప్రజలు, పాఠకుల కోసం ఏం చేశాను? ఏమేం విఫలమయ్యాను? ఇంతేనా, వ్యక్తిగతంగా నేను, నా తల్లితండ్రులు, అన్నా వదినలు, ఆత్మీయలు, మిత్రులు అందరూ నా కోసం, నేను నా వృత్తి ధర్మం కోసం పడ్డ కష్టాలు, కార్చిన కన్నీళ్లు, పోయిన ప్రాణాలు, పొందిన నష్టాలు ఎన్ని, అవి ఏవి? ఎక్కడినుంచి ఇక్కడిదాకా ఎలాయెలా రాగలిగాను? నన్నొక ఆత్మీయునివలె ఆదుకొని, ఆదరించిన పుణ్యాత్ములు ఎవరు? నాకు కొండంత అండగా నిలిచిన 'అన్న'లెవరు? ఇదంతా సరే, మరి ముందు ముందు నా ప్రయాణం ఎలా వుండబోతున్నది?
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రాతినిధ్యం వహించిన ఒకప్పటి అసెంబ్లీ నియోజక వర్గమైన రామాయంపేట నుంచి హైదరాబాద్ మహానగరానికి ఎలా రాగలిగాను? మారుమూల మన మంథని నుంచి ఢిల్లీ, భువనేశ్వర్, గోవా, శబరిమల, అమర్ నాథ్, కోయంబత్తూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి నావైన ప్రత్యేక విశేష వార్త, వ్యాఖ్యా, యాత్రా కథనాలను ఎలా ప్రచురించ గలిగాను? 
రామోజీరావు, దాసరి నారాయణరావు, గిరీష్ సంఘీ, లక్ష్మీరాజం, అల్లం నారాయణ, శేఖర్ రెడ్డి, రామానుజన్, ఏలూరు వెంకటేశ్వరరావు, కె ఎన్ వై పతంజలి, శాతవాహన, దాట్ల నారాయణ మూర్తిరాజు, దేవిప్రియ, కె.రామచంద్రమూర్తి, టంకశాల అశోక్ వంటి ఎందరో ఎడిటర్లు, ఇంకా తాళ్ళూరి యదగిరిస్వామి, నాగేంద్ర దేవ్, లక్ష్మణరావు, వేదాంత సూరి, గుడిపాటి, కందుకూరి రమేష్ బాబు వంటి ఎందరో నా సహచర పాత్రికేయులు... అందరూ, అన్ని అనుభవాలూ, మరిచిపోలేని, మరచి పోకూడని జ్ఞాపకాలుగా ఈ సమయంలో తలపుకు  వస్తున్నాయి. వాటిని 'ఉన్నవి ఉన్నట్లు'గా అక్షరబద్ధం చేయవలసిన బాధ్యత, కృతజ్ఞతా పూర్వక ఋణగ్రస్తత నాపై ఉన్నాయి


కామెంట్‌లు