మామకు తగ్గ అల్లుడు(ఫోటో కథ;-సుమ కైకాల
 "ఆషాడం ఈ రోజుతో వెళ్ళిపోతుంది. శ్రావణం రాగానే అల్లుడి గారిని మన ఇంటికి పిలవాలి. ఆషాడపట్టీ ఇవ్వాలి. పెళ్లయినప్పటి  నుండి  అల్లుడు మన ఇంట్లో పట్టుమని పది రోజులు కూడా ఉండలేదు. అమ్మాయి గొడవ చేస్తుందని వారం రోజులు సెలవు పెట్టుకొని వస్తాను అన్నారట" అంది గోమతి.
"వారం రోజులే! అసలే సాఫ్టు వేర్ ఉద్యోగాలు... అలా సెలవులు పెడితే తీసెయ్యరూ! ఒక రోజు వచ్చి వెళ్తాడులే" అన్నాడు పిసినారి శీనయ్య.
"నాన్నారు! అలా కాదండీ, ఆయన మీ నాన్న గారు బాధ పడతారు ఆయన కోసమే సెలవు పెడుతున్నాను అన్నారు. మీరు ఫోన్ చేయడం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మీరు ఈ రోజు ఫోన్ చేసి మా అత్తారింట్లో చెప్పాలి . అప్పుడు ఆయన్ని పంపిస్తారంట" చీర చెంగుని చేతితో నలుపుతూ కాలి వేలుతో నేల మీద సున్నాలు చుడుతూ సిగ్గుల మొగ్గవుతుంది అలివేలు.
పీకల మీద భార్య, కూతురూ కూర్చున్నాక తప్పుతుందా? ఫోన్ చేసి అల్లుడిని ఇంటికి ఆహ్వానించాడు శీనయ్య.
పిలుపు కోసమే ఎదురు చూస్తున్న గోవిందు తెల్లారే పాటికి గుమ్మంలో వాలిపోయాడు.
"ఆగండాగండి అల్లుడుగారూ! గుమ్మానికి కొబ్బరికాయలు కొట్టాలి " అని అత్త గారు లోపలకు రాకుండా ఆపారు.
"అయితే ఇచ్చేయండి కొట్టేసి లోపలకు వచ్చేస్తా" అల్లుడి మర్యాదల కోసం ఆరాటపడుతన్నాడు గోవిందు.
"అవి మేము ఇవ్వకూడదు అల్లుడు గారూ! మీరే తెచ్చుకోవాలి " కొబ్బరికాయల ఖర్చయినా తప్పుతుంది మనసులో అనుకున్నాడు శీనయ్య.
"అయ్యో! నాకు తెలియదు మావయ్యగారు...ఈ ఊళ్ళో నాకు ఏ బజారులో ఏముంటాయో తెలియదు కదా" మీరు తెచ్చేయండి అని తాపీగా గడపకు ఇవతల కూచున్నాడు మామకు తగ్గ అల్లుడు గోవిందు.
"అబ్బే! శాస్త్రానికి వ్యతిరేకంగా నేనసలు చేయను అల్లుడు గారూ!  మీరే తెచ్చుకోవాలి...వీధి మలుపులో కిరాణా దుకాణం ఉంది" అని గడపకు అవతల  ధుమ ధుమ లాడుతున్న ముఖంతో అల్లుడు లోపలకు రాకుండా కూర్చున్నాడు శీనయ్య.
'ఇన్నాళ్లు ఈయన పీనాసితనం తోనే ఛస్తున్నాను... ఖర్మ కొద్దీ ఈ అల్లుడు కూడా అలాగే దొరికాడు ' మనసులో అనుకుంది గోమతి.
' హామ్మయ్యా! మా ఆయన ఎంత అందంగా నవ్వుతున్నారో ' గోవిందుని చూసి మురిసిపోతూ నేల మీద సున్నాలు చుడుతుంది అలివేలు.

కామెంట్‌లు