జనన మరణాలు; -: సి.హెచ్. ప్రతాప్
 జనన మరణాలు మానవ జీవితంలో అత్యంత సహజ పరిణామాలన్న నగ్న సత్యాన్ని చక్కగా, సూటిగా మనస్సులకు హత్తుకుపోయేలా బోధించిన ఒక చక్కని సంఘటన గౌతమ బుద్ధుని జీవితంలో జరిగింది. ఇప్పుడు ఆ కధను స్మరించుకుందాం.
పాటలిపుత్రం లో ఒక మహిళ భర్త అర్ధాంతరంగా మరణించాడు. దానితో ఆ మహిళ దిక్కులేనిదై పోయింది. అయితే చుట్టుపక్కల వారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో ఆ మహిళ కాస్త ఒడ్డున పడింది.తనకు తెలిసిన ఇళ్లలో పనులు చేసుకుంటూ తన ఒకే కొడుకును చదివించు కో సాగింది.
ఒకరోజు ఆ పిల్లవాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ ఊరి వైద్యుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అ పిల్లవాడి జ్వరం తగ్గలేదు. చివరికి రెండు రోజుల తర్వాత ఆ పిల్లవాడు మరణించాడు.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి విలవిలలాడిపోయింది.నెత్తి నోరు బాదుకుంటూ విలపించసాగింది. భర్త మరణం నుండి అప్పుడే కోలుకొని జన జీవన స్రవంతిలో కలుస్తున్న ఆమెకు ఇప్పుడు కొడుకు మరణం భరించడం సాధ్యం కావడం లేదు.
అప్పుడే పక్కింటి వారు ఆ ఊరి చివర సత్రంలో గౌతమ బుద్ధుడు విడిది చేసి వున్నాడని, ఆయనను కలిసి ప్రార్ధిస్తే ఆ పిల్లవాడిని బ్రతికిస్తారని సలహా ఇచ్చారు.
వెంటనే ఆ తల్లి కొడుకు శవాన్ని తీసుకొని గౌతమ బుద్ధుని దర్శించుకొని వాడిని ఎలాగైనా తిరిగి బ్రతికించమని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించింది.
ఆ తల్లి శోకం చూసిన బుద్ధుడు " అలాగే, నీ కొడుకుని బ్రతికించి నీ శోకాన్ని తగ్గిస్తాను. అయితే నువ్వు ముందు ఈ ఊరిలో ఎవరి ఇంటిలో అయితే ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించి వుండదో, ఆ ఇంటి నుండి గుప్పెడు నూకలు తీసుకొని రా" అని అన్నారు.
అలాగేనని ఆ తల్లి ఆ గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి వాళ్ళింట్లో ఇప్పటివరకు ఏదైనా మరణం సంభవించిందా అని అడగసాగింది.
ఆవిడకు ఆశ్చర్యం కలిగే విధంగా ప్రతీ ఇంటిలో తల్లి,తండ్రి , తాతగారు, అమ్మగారు, నాయనమ్మ గారు, మావయ్య, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఇలా ఎవరో ఒక కుటుంబ సభ్యుల మరణం జరిగిందని చెప్పారు.
చివరకు ఒక్క మరణం కూడా సంభవించని ఇల్లు ఆమెకు ఆ గ్రామంలో  దొరకలేదు. అదే మాట ఆమె తిరిగి వచ్చి బుద్ధునితో విన్నవించుకుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ తల్లితో ఇలా అన్నారు.
“విచారకరమైన వాస్తవం ఏమిటంటే, జీవితంతో పాటు మరణం కూడా వస్తుంది. ఇది మనందరికీ జరుగుతుంది. కానీ దానితో వ్యవహరించడం లేదా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. స్నేహితులు, ప్రియమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మరణం వలన కలిగించే బాధ చాలా లోతైనది. మరియు మరణాలను ఎదుర్కోవడం కూడా బాధ కలిగిస్తుంది.
మీరు తీసుకునే ప్రతి శ్వాసతో, మీరు స్మశానానికి చేరువౌతున్నారు. కాని మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో మీరు మీ ముక్తికి కూడా చేరువ కావచ్చు. జీవం ఎంతో, మరణమూ అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మీరు జీవితాన్ని పూర్తిగా, శక్తివంతంగా జీవిస్తారు. ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండటానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియక పోవడమే. జనన మరణాలు అనేవి జీవం ఒక దశ నుండి మరొక దశలోకి వెళ్ళే మార్గాలు. జీవితం ఎప్పుడూ అనిశ్చితమైనదే. ఖచ్చితమైనది కేవలం మరణం మాత్రమే. మరణించడానికి సిద్ధంగా ఉన్న వారే సంపూర్ణంగా జీవించగలరు. మనం పుట్టుకని జరుపుకున్నట్టు, మరణాన్ని కూడా ఒక పండుగలా జరుపుకో లేకపోతే, మనం జీవితాన్ని తెలుసుకోలేము. కాబట్టి జనన మరణాలనేవి ఆ సృష్టిలో అత్యంత సహజమైన విషయాలని, అవి మన చేతులలో లేవని చక్కగా అర్ధం చేసుకుంటే మన జీవితం ప్రశాంతమౌతుంది."
బుద్ధుని బాధలు వంటబట్టించుకున్న ఆ తల్లి జరగాల్సిన కర్తవ్యం స్పురణకు తెచ్చుకొని, బుద్ధునికి పాదాభివందనం చేసి  కొడుకు శవానికి అంత్యక్రియలు జరిపించేందుకు వెళ్ళింది.

కామెంట్‌లు