'పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి' ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో రెండవ విడత ఎఫ్ఎల్ఎన్ (తొలి మెట్టు) ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో కనీస సామర్థ్యాలు, పాఠ్యాంశమాధారిత అభ్యసన ఫలితాల సాధన కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన శాస్త్రీయ విద్యా విధానం అమలు చేస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కోర్స్ కోఆర్డినేటర్ యర్రా రమేష్, పరిశీలకులు సుదర్శనం, కూకట్ల తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, అదంతా ప్రజల సొమ్ము అనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశేష బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రైవేట్ మోజులో పడి తమ కష్టార్జిత సొమ్మును వృధా చేసుకోకూడదని వారు పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం డీఆర్పీ ఈర్ల సమ్మయ్య 1నుండి 5తరగతుల తెలుగు భాషా సామర్ధ్యాల సాధన, వార్షిక, వారాంతపు, పీరియడ్ ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీలు ఈర్ల సమ్మయ్య, కె. స్వప్న, గుంటి వేణుగోపాల్, కె. దేవేందర్, సీఆర్పీ కుంట కుమార స్వామి, మండలంలోని ఉపాధ్యాయుని,  ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు