లక్ష్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా ప్రోగ్రెస్ కార్డు చూస్తూనే  తల్లి శివాలెత్తుతూ రంకెలేయసాగింది"ఏంటిరా !అన్నింటిలో బొటాబొటీగా పాస్ మార్కులు వచ్చాయి.కనీసం 50-60మధ్య కూడా రాలేదు.వచ్చే ఏడాది ఆ పెద్ద స్కూల్ లో పడేస్తాను.ఇలాంటి మార్కులు వస్తే వారు కూడా తీసుకోరు." ఆమె గంతులు చిందులు వింటూ తాత అన్నాడు "చూడుతల్లీ!ఏడాదికో బడి మారుస్తూ పోతే పిల్లలు మానసికంగా కాస్త క్రుంగిపోతారు.అలవాటైన బడి పిల్లలు  టీచర్సు ని వదిలి కొత్త వాతావరణంలో నిలదొక్కుకోవాలంటే టైంపడుతుంది.నీవు దగ్గర ఉండి చదివించాలి.పరీక్షలముందు టైంటేబుల్ చూసి చావబాదుతూ చదివించటం తప్పు " "చాల్లే నాన్న! నేను ఊరికే కూచోటం లేదుగా? " "అదికాదు అమ్మా!రెండు రోజులు సెలవువస్తే చాలు రిసార్ట్  హోటల్ అని తీసుకుని వెళ్తారు.కనీసం మన అన్నయ్య ఇంటికి తీసుకుని వెళ్తానంటే వద్దు అంటావు.వాళ్ళు వస్తే విసుక్కుంటావు.పోనీ నేను గుడికి తీసుకుని వెళ్తానన్నా చదువు పేరుతో పంపవు" అక్కసుగా అన్నాడు తాత.
 "పైగా  మూడు నెలలకోసారి ట్యూషన్ టీచర్ని మారుస్తావు తల్లీ!" ఇక శివా తల్లి కి కోపం వచ్చింది "నాన్న!నీవు రోజూ వాకింగ్ పేరుతో ఒక్కోప్రాంతంలో తిరిగి వస్తావు." "అవును అమ్మా! నాల్గు దిక్కులు తిరిగితే విషయాలు తెలుస్తాయి.కానీ బడి ట్యూషన్ మార్చటంవల్ల లాభం ఏంటి? అలవాటు ఐన వ్యక్తులు ఐతే వారి సైకాలజీ అర్థం అవుతుంది. టీచర్ క్లాస్ లో 50మంది పిల్లల బుర్రలోకి పాఠం పోయేలా చూడాలి. 6పీరియడ్స్ టీచింగ్ క్లాసులు నోట్సులు దిద్దటంలో ఆమె టైం సరిపోదు. పైగా తన సంసారం పిల్లల బాగోగులు చూసుకోవాలి కదా?నీ ఒక్క పిల్లాడి చదువు రోజూ  ఓగంట చూడలేవు.అంతా బడి టీచర్ల దే బాధ్యత అంటావు.కనీసం వాడిని  తిట్టడం ఆపి ఇప్పుడైనా  చదువు సంగతి చూడు.నాకు చదువు లేకపోయినా  నిన్ను అన్నని చదివించాను.మీఅమ్మ దగ్గరకూచుని చదివించేదికదూ?" తండ్రి మాటలు విని ఆలోచన లో పడింది శివా అమ్మ. అవును  తనదే తప్పు!"ఉండరా కాస్త టి.వి.సీరియల్ చూసి చెప్తాను.హోంవర్క్ పూర్తిచేయి" అని టి.వి.లో మునగటం తనుచేసే పెద్ద తప్పు! శివా చదువు పట్టించుకోకుండా ప్రోగ్రెస్ కార్డు చూస్తూనే వాడి ని తిట్టడం కూడా తప్పే! తొలి సారి  ఆమె తండ్రి మాటల్లోని నిజం గ్రహించింది🌹
కామెంట్‌లు