విశ్వాసం(ఆధ్యాత్మిక కధ ): సి.హెచ్.ప్రతాప్

 మహరాష్ట్రలో సాకోరి గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు వున్నాడు. అతనికి గంపెడంత సంసారం . ఆదాయం అణాలలో వుండగా వ్యయం మాత్రం రూపాయల్లో వుంది.వేదం కూడా సరిగ్గా అబ్బకపోవడం వలన ఆ గ్రామంలో ఎవరూ అతడిని ఎలాంటి శుభకార్యాలకు పౌరోహిత్యానికి పిలిచేవారు కాదు. తనకు వున్న మిడి మిడి జ్ఞానంతో ఇంటింటికీ తిరిగి చిన్నపాటి ఆశీర్వచనాలు చేస్తూ వారి ఇచ్చిన తృణమో, పణమో తీసుకొని కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అతని భార్య నాలుగు ఇళ్ళలో వంట పని చేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణలో సహాయకారిగా వుంటోంది.
ఒకరోజు తోటి గ్రామస్థులు శిరిడీ మశీదులో వున్న శ్రీ శిరిడీ సాయిబాబా అనే ఫకీరు గొప్ప దయామయుడని, తన వద్దకు విశ్వాసంతో వచ్చిన వారి కష్టాలు తీర్చి సుఖ శాంతులు ప్రసాదిస్తారని చెప్పడంతో తాను కూడా వెళ్ళి ఆయనను దర్శించి తన కష్టాలు  పోగొట్టమని ప్రార్ధించాలని నిర్ణయించుకున్నాడు.
 కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు శిరిడీ వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించుకున్నాడు. దూరం నుండి శ్రీ సాయిని చూడగానే అతని మదిలో ఎన్నో శంకలు మొదలయ్యాయి. ఆయన వస్త్ర ధారణ ముస్లిం వలే వుంది. నివాసం మశీదులో. కాని అక్కడ తులసి కోట వుంది. హిందువుల ఆచారాల ప్రకారం సమస్త పూజలు జరుగుతున్నాయి. వచ్చే భక్తులలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు , పార్శీలు ఇలా ఎందరో వున్నారు. మశీదు చాలా పాడుబడి వుంది. సాయి వస్త్రాలు కూడా పాతబడి చిరిగిపోయి వున్నాయి. ఒక పుణ్య పురుషుడి వస్త్ర ధారణ, ప్రవర్తన ఇలా వుందకూడదేమో అనుకున్నాడు. అట్లే అన్ని మతాచారాలను కలగాపులగం చేయడం వలన ఎందరి భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయో కదా అనుకున్నాడు.
ఏమైతే అయ్యిందిలే, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని ఆ బ్రాహ్మణుడు శ్రీ సాయిబాబా కాళ్ళకు నమస్కరించి తన సమస్యలు చెప్పుకొని తన కష్టాలు దూరం అయ్యేలా దీవించమని ప్రార్ధించాడు.
శ్రీ సాయి ఆ బ్రాహ్మణుడి తలపై చెయ్యి పెట్టి " అల్లా అచ్చా కరేగా" అని దీవించి ఒక పొట్లం అతనికి ఇచ్చి" దీనిని ఇంటికి తీసుకెళ్ళి ఇంటిల్లి పాదీ తినండి. కాని మధ్యలో తెరిచి చూడవద్దు" అని హెచ్చరించారు.
ఆ బ్రాహ్మణుడు  ఆ పొట్లం తీసుకొని సంతోషంగా ఇంటి దారి పట్టాడు. అయితే అందులో ఏముందో నన్న ఆతృత అతడిలో బయలుదేరింది. అంతేకాకుండా తినే పదార్థం అన్నారు కాబట్టి ప్రసాదం అయ్యే వుంటుంది. అయితే అది హిందువుల ప్రసాదమా లేక ముస్లింల ప్రసాదమా ? ఒకవేళ హిందూయేతర ప్రసాదం అయి వుంటే తాము తినచ్చునా? హిందువుల ప్రసాదమే అయినా అది బ్రాహ్మణులు తినదగిన ప్రసాదమేనా? ఇలాంటి వందలాది ఆలోచనలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేసాయి.
ఇక వాటి ఉధృతిని తట్టుకోలేక ఒక కాలువ గట్టు వద్ద సేద తీరి ఆ పొట్లాన్ని విప్పి చూసాడు. అందులో వున్న మాంసం ముద్ద చూడగానే అతనిలో జుగుప్స, అసహ్యం కలిగాయి.ఏదో తాకరాని పధార్ధాన్ని తాకి మైల పడిపోయినట్లు భావిస్తూ వెంతనే అసహ్యంతో ఆ మాంసం ముద్దను నీట్లోకి విసిరేసాడు.
చిత్రంగా నీరు తగలగానే ఆ మాంసం ముద్ద బంగారం గా మారిపోయి నీట్లో మునిగిపోయింది.దానిని చూసిన ఆ బ్రాహ్మణుడి నోట మాట పెగల్లేదు. కరుణామయుడు, భక్తుల పాలిట కల్పవృక్షము అయినా శ్రీ సాయి మాటలను పెడ చెవిన పెట్టినందుకు తనకు తగిన సాస్తే జరిగిందనుకున్నాడు. అయినా  భక్తులను కాపాడి రక్షించాల్సిన సద్గురువు నిషిధ ఆహారం తిని చెడిపొమ్మని భక్తులకు ఎందుకు చెబుతారు ? సద్గురువు వేష భాషలను చూసి ఆయనపై అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడం సరి కాదు. తనపై భక్తుల విశ్వాసం ఎంతటిదో నిరూపించేందుకు సద్గురువు భక్తులను అలాంటి పరీక్షలకు గురు చేస్తుంటారు. కొండంత నమ్మకం కొండంత పలితాలను , రవ్వంత నమ్మకం రవ్వంత ఫలితాలను ఇస్తుంది.
ఆ బ్రాహ్మణుడికి జ్ఞానోదయం అయ్యింది. తన తప్పిదానికి క్షమించమని సాయిని మనస్పూర్తిగా ప్రార్ధించి తన పై పంచను నిరాశగా కాలువ నీటిలో పిండుకున్నాడు. ఆశ్చర్యంగా అందులో ఒక బంగారు పోగు కనిపించింది.దానిని తీసుకొని,  శ్రీ సాయి దివ్య లీలలకు ముదమొందుతూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ఇంటికి  పయనమయ్యాడు ఆ బ్రాహ్మణుడు. శ్రీ శాయి ఆదేశించినట్లు ఆ పొట్లాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటే అతనికి ఇంకెంతగా ఐశ్వర్యం లభించేది కదా ?
కామెంట్‌లు