పాఠశాల పిల్లలకు ప్రశంసా పత్రాలు పంపిణీ


 కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో శనివారం సాయంత్రం పాఠశాల పిల్లలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల పిల్లలకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ప్రతిభ కనబరిచిన పాల అక్షిత, బండి స్వామి, తాండ్ర మోక్షశ్రీ, చిలువేరు సిద్దు, కొలగాని శశివర్ధన్ లను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసి) చైర్మన్, వైస్ చైర్మన్ లు చిలువేరు లావణ్య స్వామి, తూండ్ల రాజు, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమతలు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాల ప్రజలందరిదని, ప్రజాధనంతోనే దానిని నిర్వహిస్తున్నారనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలన్నారు. గ్రామంలో   ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ పాఠశాలలు అవసరంలేదని, గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి, ప్రైవేట్ పాఠశాలలను మూసి వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు చక్కని చదువుతోపాటు చిత్రలేఖనం, నృత్యం, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, కాలిగ్రఫీ(చేతిరాత), నవోదయ, రెసిడెన్షియల్, మోడల్, సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.
అనంతరం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు