గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (28)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదవడానికి వెళ్ళినప్పుడు  ఎవరు నాటకాలు వేసేవారు ఉన్నారా అని  వెతికితే  కడియాల జగన్నాథశర్మ దొరికాడు అతనికి నాటకాలంటే మక్కువ. ఇద్దరం కలిసి నాటక సమాజాన్ని స్థాపించి చాలా నాటకాలు వేసే వాళ్ళం. విజయవాడలో మొదట వాద్యబృందం కచేరీ ఏర్పాటు చేసింది మేమే గాత్ర సంగీతం లేకుండా వాద్యములతో చేసిన కార్యక్రమం అందరూ అభినందించారు. అక్కాజీ రావు గారు మా గురువు గారు. వారు వీణను నిలబెట్టి వాయిస్తారు. ఏమిటి గురువుగారు అంటే  ఇది సరస్వతీ దేవి కటాక్షం దీనిని పండుకో పెట్టడం నాకు ఇష్టం లేదు అనేవాడు. మా చదువు అయిపోయిన తర్వాత ఆకాశవాణిలో నేను చేరి నప్పుడు శర్మ కూడా క్యాజువల్గా వచ్చాడు. పీహెచ్డీ చేయాలన్న కోరిక వుంది తనకు నువ్వు భారతం అంతా చదివావు కదా దానిలో ఏ విషయం తీసుకోమంటావు  అని సంప్రదించి నాకు బాగా ఇష్టమైన వ్యాస మహర్షి వ్రాసిన స్త్రీ పాత్రలు. ఆ పాత్ర రెండు నిమిషాలైనా శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా నడిచిన తీరు చెప్పి ఆ విషయాన్ని తీసుకోమని చెప్పాను. దాదాపు రెండు సంవత్సరాలు ప్రయాసపడి  శ్రద్ధతో అధ్యయనం చేసి తనకు వచ్చిన సందేహాలన్నీ ఉషశ్రీ గారి వలన కృష్ణమాచార్యులు గారి ద్వారా తెలుసుకొని  చక్కటి గ్రంథాన్ని వెలువరించాడు. ఆ గ్రంథ ఆవిష్కరణ కోసం దానిని నాకు అంకితం చేసి మన స్నేహానికి గుర్తు అన్నాడు. కొంతమంది అడ్డుతగిలి ఖర్చు మేం పెట్టుకుంటాం మాకు  అంకితము ఇవ్వమని కోరినా  శర్మ ఒప్పుకోలేదు. పుస్తకావిష్కరణ రోజున  ప్రధాన వక్తగా వచ్చిన శివనాగిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ సందర్భం చూస్తూ ఉంటే పోతనామాత్యుడు గుర్తుకొస్తున్నారు  బాల రసాల  సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను... అన్న పద్యం చదివి ఆ రోజున రాజునే తిరస్కరించిన వాడు పోతన. ఈ రోజున  పెట్టుబడిదారినే తిరస్కరించిన వ్యక్తి శర్మ. ఆనంద్, శర్మల మైత్రి బంధం నాకెంతో నచ్చింది.  ఒకే కంచంలో చేయి ఒకే మంచం లో పండుకున్న వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో  అలా వీరిద్దరూ కలిసి పోయారు. నాటకాలాడడం లో కానీ,  రచయిత, నటీనటుల, సంగీత, నిర్వాహకుల,  దర్శకుల ఎన్నిక కానీ  ఇద్దరూ కలిసి చేస్తారు.  దర్శకుడుగా ఆనంద్ గారు  నిర్వాహకునిగా శర్మ గారు  బాధ్యతలను పంచుకున్నారు. వారిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. జీవితంలో ఇలాంటి తత్వాలు మనకు కావాలి తప్ప ధనధాన్యాలకు అమ్ముడుపోయే  తత్త్వాలు కాదు మనకు కావలసింది  అని మా ఇద్దరినీ అభినందిస్తూ  తన ప్రసంగాన్ని ముగించారు  అలాంటి వ్యక్తి శివనాగిరెడ్డి గారు.

కామెంట్‌లు