తెలంగాణ సాయుధ పోరాటం;-డా.తెలుగు తిరుమలేష్--తెరసం జిల్లా అధ్యక్షులు-- అమరచింత మండలం9908910398
 నాటి భూస్వాముల అరాచకత్వం నైజాము రాజు నిరంకుశత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కమ్యూనిస్టుల ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం.
      భూమికోసం ,భుక్తి కోసం సాగించిన పోరాటం నాటి హైదరాబాద్ సంస్థానంకు ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన ప్రజాపోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు శ్రమ దోపిడీకి నిరసనగా చేసిన ఉద్యమం తెలంగాణ విమోచనోద్యమం.
     భారతదేశం అంతటా సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు పాల నుండి 1947 ఆగస్టు 15న భారతదేశం అంతటా స్వాతంత్ర్యం పొందినది. స్వేచ్ఛా గాలులు పిలుస్తున్న సందర్భంలో ఒక్క హైదరాబాద్ సంస్థానం నవాబుగా ఉన్న ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం స్వాతంత్రాన్ని ప్రకటించలేదు దానికి వ్యతిరేకంగా ప్రజలలో  ఒక భయాందోళన మొదలైంది దానిలో భాగంగానే తెలంగాణ స్వాతంత్రంకై నిజాం నవాబును వ్యతిరేకించుటకై చేసిన పోరాటమే తెలంగాణ విమోచనోద్యమం.
      తెలంగాణ విమోచనోద్యమానికై నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్రానికై 1946 నుండి 1948 వరకు సాగిన ప్రజా ఉద్యమమే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాటం
      క్రూరత్వం కలిగిన నిజాం రాజును ఓడించుటకు తన నుండి రాజ్యాన్ని మన స్వాధీనం చేసుకొనుట జరిగినటువంటి ప్రజా ఉద్యమం ఈ పోరాటం.
      దోపిడీ పీడన బానిస బ్రతుకుల విముక్తికై మరియు తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాటం చేశారు. ఈ పోరాటంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క క్రూరమైన సైన్యం రజాకార్లు.వీరికి సైన్యాధిపతిగా ఖాసీం రజ్వీ.వీరి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలపై క్రూరత్వం చూపడం జరిగింది.
     అలాంటి క్రూరమైన రజాకార్లను మరియు నిజాం కింద ఉన్న జాగీర్దార్  , దేశ్ ముఖ్, పటేల్ పట్వారీ వారు చేస్తున్న దౌర్జన్యాలను అక్రమాలను వ్యతిరేకించటకు సాగిన నిరంతర పోరాటం ఈ సాయుధ పోరాటం. బ్రిటిష్ వారికి సామంతులుగా ఉన్న నవాబు రజాకార్లను ఆసరాగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని మహిళలపై పసిపిల్లలపై యువకులపై చేస్తున్న అకృత్యాలను చూసి మరియు భూస్వాములు చేస్తున్న దోపిడిని సహించలేక తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు అందరూ ఏకమై పిడికిలి బిగించిన ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రజా ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం.
      ఈ పోరాటంలో దాదాపుగ నాలుగున్నర వేల ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు.
     నిజాం రాజు సంరక్షకులుగా ఉన్న రజాకార్లు మహిళలపై చేస్తున్న అకృత్యాలు మరియు దోపిడీ మరియు ధన మాన ప్రాణాలను రాక్షస రజాకార్లకు వ్యతిరేకంగా చేసిన ప్రజా పోరాటం అలాగే మహిళలను నగ్నంగా చేసి బతుకమ్మను ఆడించిన నీచ రజాకార్లను ఎదిరించి అందరూ ఐక్యమైన సందర్భం తెలంగాణ సాయుధ పోరాటం.
      ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేదా తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల ఉద్యమం కీలకమైన పాత్ర వహించి అనేక అవమానాలను అన్యాయాలను అక్రమాలను భరించి పోరాటం చేసిన గొప్ప శక్తివంతులు ఈ ఉద్యమంలో మహిళలు.
     భారతదేశం అంతటా స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మరి తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వం వల్ల స్వాతంత్రం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఆక్రోశం ఆవేదన ఆందోళన చెందిన సందర్భంలో ఈ ఉద్యమానికి వివిధ సంఘాలు,పార్టీలు,ప్రజాస్వామికవాదులు,రచయితలు ,కవులు,కళాకారులు ప్రజలందరూ సంఘటితమై పోరాడిన పోరాటం ఇది.   
       ఈ ప్రాంతం దాదాపుగా 200 సంవత్సరాల దోపిడి అణిచివేతకు గురైనప్పటికీ ఇక్కడ చేసిన 47 సంవత్సరాల తిరుగుబాటు అందులో సాయుధపోరాటం ఒక దశ మాత్రమే అని మనం గుర్తించాలి. దాదాపుగా 1724 నుండి 1948 వరకు అసఫ్ జాహి వంశస్థులు దాదాపుగా రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
      హైదరాబాద్ సంస్థాన స్వాతంత్రానికై ఎందరో వీరులు ప్రాణత్యాగం చేశారు పెట్టుబడిదారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ కలిగిన ఈ ప్రాంతంలో నిజాం రాజు చేస్తున్న నీచ కృత్యాలను ఎదిరించుటకు అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 16 జిల్లాలు అందులో మన తెలంగాణ ప్రాంతం నుండి 8 జిల్లాలో కన్నడ మహారాష్ట్ర నుండి 8 జిల్లాలు మొత్తం 16 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి.ఇక్కడ బహుభాషా ప్రాంతం అయినప్పటికీ నిజాం రాజుకు భాషపై ఉన్న మక్కువతో ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం వెనకాల నష్టాన్ని ప్రజలు గుర్తించి ఆక్రోశం చెందారు.కులం, ప్రాంతం,భాష మరియు ఆర్థికంగా ప్రజలకు ఇబ్బందులు పెడుతూ రజాకార్లు చేస్తున్నా దోపిడీకి ప్రజలు తిరగబడ్డారు. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎనిమిది జిల్లాల నుండి ప్రజలందరూ వీర తెలంగాణ సాయుధ పోరాటంగా మార్చి పిడికిలి బిగించి నిజాం రాజు పీడను వదిలించుటకు ప్రజలందరూ ఏకమయ్యారు ఉద్యమాలు సాగించారు. 
     రజాకార్లకు సైన్యాధిపతిగా ఉన్న ఖాసీం రజ్వీ నీచ బుద్ధులకు ఈ ప్రాంత ప్రజలు స్వస్తి పలికారు.రజాకార్లు అప్పట్లో తెలంగాణ ప్రజల ఆస్తులు దోచుకోవడం, పంట పొలాలు తగలబెట్టడం ,లూటీలు చేయడం హత్యలు,ఆత్మహత్యలు చేయడం ఇలాంటి ఎన్నో గాయాలకు పాల్పడిన అటువంటి రాక్షస దళం రజాకార్లును ఎదిరించుటకు నాడు మొదటిసారిగా బీజం వేసిన ప్రాంతం నల్లగొండ ప్రాంతం అలా మొదలైన ఈ ఉద్యమం బైరాన్ పల్లి,బీబీనగర్ జనగామ ,పరకాల వంటి ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి నిజాం రాజుకు నిద్రలేకుండా చేసిన సందర్భాలు.
       అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం జరిగింది.హైదరాబాదు సంస్థానంలో మరాటి వారు మరియు తమిళ్ లు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలలో అణచివేసే ప్రయత్నం చేయడం వల్ల ప్రజలలో ఉద్యమం మొదలైంది. 
       మరోపక్క ఎక్కువ భూములు ఉన్న భూస్వాములు వారి వద్ద భూములు ఉండడం వల్ల సామాన్య రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్ల భూమికోసం భుక్తి కోసం చేసిన సామాన్యుల తిరుగుబాటు తెలంగాణ సాయుధ పోరాటం.
       నీ బాంచెన్ కాల్మొక్త దొరా అంటూ బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్న పెత్తందార్ల దోపిడి దారుల కాలం నాటిది . అలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా రాక్షస రజాకారు దళాల దురాగతాలకు స్వస్తి పలికుటకు చేసిన పోరాటం.
       తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలను రజాకార్లు మానభంగాలకు గురిచేయడం.మరియు అనేకమందిని రజాకార్లు క్రూరంగా చంపడం వంటివి జరిగేవి. వీటన్నిటినీ పసిగట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని తుపాకులను చేత బట్టి రజాకార్లను మహిళలు తరిమికొట్టారు. అలా తరిమికొట్టిన అటువంటి వాటిలో అనేక జిల్లాలోని ప్రజలు కరీంనగర్ నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలలో ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు.అలాంటి సందర్భంలోనే ప్రజలు దాడులకు ప్రతి దాడులుగా చేయడం జరిగింది. వంటింటికే పరిమితమైన మహిళలు ,గాజులు వేసుకున్న స్త్రీలను గండ్రగొడ్డలిని పట్టుకోవడం చేసింది రజాకార్ల ఆక్రోశం.అలాంటి పోరాటం తిరుగుబాటు నిజాం ప్రభుత్వ నిరంకుశతను ఎదిరించి చేసిన పోరాటంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.షోయబుల్లాఖాన్,ముగ్దు మోహయుద్దీన్ మరియు రావినారాయణరెడ్డి ,చండ్ర రాజేశ్వరరావు మల్లు స్వరాజ్యం ,చాకలి ఐలమ్మ ,దాశరధి , కాళోజి నారాయణరావు ,సురవరం ప్రతాపరెడ్డి ,ఆరుట్ల కమలాదేవి ,మాడపాటి హనుమంతరావు వంటి ఎంతోమంది వీరుల  ఉద్యమం అందరికి స్ఫూర్తిగా నిలిచింది.
      నిజాం వ్యతిరేక ఉద్యమంలో కవులు రచయితలు ప్రముఖ పాత్రను పోషించి దాశరథి వంటి వారు జైలు గోడలపై బొగ్గుతో కవితలు రాశారు.మానవత్వానికి రాక్షసత్వానికి మధ్య జరిగే సంఘర్షణ నిజాం పరిపాలన ఒక కవితా వస్తువుగా మారింది దాశరథి వంటి కవులకు.నిజాం వ్యతిరేక ఉద్యమం అని చెప్పగానే ఈ కవిత్వం వెంటనే గుర్తుకు వస్తుంది.ఈ పద్యం అగ్నిని కురిపిస్తోంది
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
అనే పద్యం ద్వారా నిజాం రాజు అకృత్యాలకు అంతం లేదు అని చాటాడు.ఆ రోజుల్లో నిజాం నవాబును పిశాచం ,ముసలి నక్క, మా నిజాము నవాబు జన్మజన్మల బూజు అని చాటాడు. ఇలా అనడానికి ఎంతో దైర్యం ఉండాలి. మరి దానికి దాశరథికి పడినటువంటి ఇబ్బందులు ఆయనను జైలు వరించాయి.జైలు నివాసస్థలమైన ఆయనకు దీనిలో భాగంగా దాశరథి వంటి కవులులో నిరసన మరింత తీవ్రమైంది.
ప్రజాకవి కాళోజీ లాంటివారు తమ కవితల ద్వారా ఉద్యమాన్ని జనంలోకి తీసుకువెళ్ళారు.
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా…….
నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ……
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. ....(కాళోజి)
మరియు ఉద్యమ పాటలు
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
ఏ బండ్ల పోతవు కొడుకో నైజాము సర్కరోడా...
వంటి ఉద్యమ పాటలతో ఉద్యమం ఉధృతమైంది...
       ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మన ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి రజాకార్లను మనపై ఉసిగొల్పాడు. ఈ రజాకార్లు దోపిడీ చేయడం ,ఇళ్లను తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు.దీనితో ప్రజల ఇబ్బందిని గుర్తించి రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు,కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమై నిజాం రాజు మెడలు వంచి నియంత నిజాం రాజును ఎదిరించి ఎంతోమంది వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమం ఉధృతం చేశారు.నిజాం పాలనపై ప్రజలు తిరగబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని రజాకార్లను ఎదిరించారు. కర్రలు,బరిసెలు ,కారం, వడిసెలు,గోత్పలు, ముంతలు వంటి వాటిని ఆయుధాలుగా చేసుకుని తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగంలోకి వెళ్లి రజాకార్లను ఎదిరించారు. ఇలాంటి సందర్భంలోనే భారత ప్రధానిగా ఉన్న నెహ్రూ గారిని ఒప్పించి హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ప్రభుత్వ సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో విలీనం చేసింది.దీనితో నిజాం రాజు లొంగిపోయి మన తెలంగాణకు  మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది.
       దీన్ని నేడు మనము విలీనం అందామా,విమోచనం అందామా,విద్రోహదినం అందామా ఎందుకంటే స్వాతంత్రం రోజు అనగా సంబరాలు జరుపుకోవాలి. మరి అలాంటి సందర్భం లేని ఈ యొక్క రోజును మరి మనమేమందాం. భోగ విలాసం, క్రూరత్వం మతతత్వం మరియు నియంతలా వ్యవహరించిన నిజాం రాజును ఎదిరించుటకు చేసిన పోరాటంలో పార్టీలు ,సంఘాలు, ప్రజలు సంఘటితమై చేసిన పోరాటం వల్ల తెలంగాణ స్వేచ్ఛను దక్కించుకోవడంలో పడ్డ ఇబ్బందులు నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కంటే క్రూరంగా జరిగిన ఉద్యమం  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.దీనిలో  అనేక అవమానాలు ,త్యాగాలు మరి నేడు ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఉద్యమం గా కీర్తి పొందిన ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రత్యేకతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని గుర్తించుకోవడం ఎంతైనా అవసరం.
         నాడు 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ అప్పుడు ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని ఎక్కడ గుర్తించలేదు దానికి కారణాలు  తెలియలేదు.కావున నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ దినోత్సవానికి ఓ ప్రాముఖ్యతగా,చరిత్రగా గుర్తించి రైతాంగ పోరాటంను,ఈ సాయుధ పోరాటంను, తెలంగాణ స్వాతంత్రోద్యమ పోరాటంను ఒక పండుగల జరుపుకోవాలని,ఎంతో మంది తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తూ..

కామెంట్‌లు