భయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 భయం అనేది బాల్యం లో పెద్ద లు పసివారి మెదడులో వేసే అనుమానపు పురుగు.జాగ్రత్తలు చెప్పాలి.వారికి దాని వల్ల కష్ట నష్టాలు తెలియజెప్పాలి.అంతేగానీ బడిలో చేర్చకముందే ఇంట్లో అల్లరి చేసే మూడేళ్ళ పిల్లలతో"ఉండు!బడిలో వేస్తే నీతిక్క కుదురుతుంది. టీచర్ బొమ్మలాగా కూచోబెట్టి తంతుంది"అని పదే పదే అంటూ ఉంటే నిజంగానే ఆచిన్నారులు బడికి పోవటానికి మారాంచేస్తారు.
ఒకప్పుడు ఆఊరినిండా పుక్కిటి పుకార్లు షికార్లు కొట్టాయి.సాయంత్రం ఏడుఅయ్యేప్పటికి జనం తలుపులు బిడాయించేవారు.సూర్యుడు చురుకుచురుకు అన్పించిన తర్వాత లేచేవారు. ఆఊరు ఏకోపాధ్యాయ మాష్టారు కి ఓగది ఫ్రీ గా ఇచ్చి గ్రామ పెద్ద ఇలాచెప్పాడు" పంతులూ! ఆచింత చెట్టుపై దెయ్యం ఉంది. దాని చుట్టుపక్కల కోడి ఈకలు జంతువుల ఎముకలు పడి ఉంటాయి.మాఊళ్లో అవి రోజు కొకటి మాయం అవుతున్నాయి. ఏడు అయ్యేటప్పటికి నీగది తలుపులు బిడాయించి పడుకో".: ఆరాత్రి ఆయువ మాష్టారికి నిద్రపట్టలేదు.అర్ధరాత్రి దాటగానే కిటికీ పక్కనించి సన్నగా మాటలు వినపడసాగాయి."అరె!ఈరోజు  ఆచివరి సత్తిగాడి ఇంటి బైట ఉన్న ఆచిన్న గంగాళం తీసుకుని వెళ్లి ఆచింతచెట్టుకింద పెట్టి దాన్నిండా ఎర్రరంగు నీరు పోసి పెడదాం. ఆచుట్టూ ఎర్రని రంగు పులుముదాం!రేపు పట్నంలో అమ్మి డబ్బు ఇద్దరం పంచుకుందాం!!" అంతే మాష్టారికి కిటుకు తెలిసిపోయింది. ఆమర్నాడు బడికి  వెళ్లాకపిల్లలతో ఇలా అన్నాడు "దెయ్యాలు భూతాలు  నిజంగా లేవు.మనం చెడుపనులు చేస్తే దెయ్యం భూతాలం!" అని వారిలో ధైర్యం నూరిపోశాడు.ఆరోజు తన ఇంటి యజమాని గ్రామపెద్దతో అన్నాడు "అయ్యా! మాస్నేహితులు ఇద్దరు పోలీసులు! రెండు రోజులు నాదగ్గర ఉండాలని వస్తున్నారు. మేము మీఇంటి వరండాలో పడుకుంటాం". "వద్దయ్యా!ఊరికి కొత్తగావచ్చావు.పిల్లలు సంతోషంగా ఉన్నారు. నీవంటే ఇష్టంగా ఉన్నారు. దెయ్యం వస్తే?" "మీరు  మీ ఇంటి కిటికీలు తెరచి రాత్రి  కాసేపు  పొంచి చూడండి "అని మాష్టారు  నచ్చచెప్పాడు."సరే"
ఆరోజు పొద్దుట మాష్టారు ఇద్దరు ఆఊరి యువకులకు ఆవిషయం చెప్పి సత్తిగాడి ఇంటికి వెళ్లి  గంగాళం నిండా నీరు పోయించాడు.సత్తి ఇంటి వెనక నల్ల ముసుగు లో  చేతిలో కర్రలు తాళ్లతో సిద్ధంగా ఉన్నారు. ఆదొంగలు వచ్చారు. గంగాళం లో నీరు పారబోసే యత్నం లో ఉండగా యువకులు హఠాత్తుగా వారిపై పెద్ద దుప్పటి కప్పేసి తాళ్లతో కట్టేసి ఉంచారు. "బాబోయ్!దెయ్యం  మనల్ని  పట్టుకుందిరా" కుయ్యో మొర్రో అంటున్న వారిని అక్కడే చెట్టుకి కట్టేసి దుప్పటి తీశారు. లాంతరు టార్చి వెలుగులో గ్రామ పెద్ద నౌకర్లని చూసి అంతా తెల్లబోయారు.మాష్టారి కబురందుకున్న పెద్దాయన కూడా  అక్కడికి  వచ్చి మాష్టారిని అభినందించాడు.తెల్లారినాక ఊరంతా టముకు ఐంది ఆవార్త! అంతే ఇన్నాళ్లు  తాము ఎంత గుడ్డిగా పుకార్లు నమ్మారో తల్చుకుని జనం సిగ్గు పడ్డారు.🌹
కామెంట్‌లు