మనకీర్తి శిఖరాలు .--త్రిపురనేని రామస్వామి చౌదరి . ;-- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై
 త్రిపురనేని రామస్వామి చౌదరి . (జనవరి 15, 1887 - జనవరి 16, 1943) న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు. కవి రాజు గా కీర్తించబడే త్రిపురనేనిని హేతువాదం, మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు.
త్రిపురనేని రామస్వామి చౌదరి 1887 జనవరి 15 న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించాడు. 1911లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కళాశాలలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును, అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
1914లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము, ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా అధ్యయనం చేసారు.
రామస్వామి భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, పాములపాటి వెంకట కృష్ణయ్య గారి ప్రొద్బలంతో తెనాలి వచ్చారు. కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవుర్తులను మార్చుకున్నారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలు, మత అరాచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు. రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు. రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.
1914లో డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీబీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేస్తూ కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాతంత్ర్య ఉద్యమ రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు.
1917లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు, వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922లో గుంటూరు జిల్లా, తెనాలిలో స్థిరపడ్డాడు.
1925లో తెనాలి పురపాలక సంఘ అధ్యక్షుడిగా జస్టిస్ పార్టీ తరపున ఎన్నికయ్యాడు. ఆ పదవిలో ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి అధ్యక్షుడయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు.
1941 లో మానవ వాదం ప్రవక్త ఎం.ఎన్,రాయ్ గారు వీరి గృహం 'సుతాశ్రమం' సందర్శించారు.
1898లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు. 1920లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నాడు. వీరి కుమారుడే గోకుల్ చందు. 1932లో ఆమె చనిపోగా, అన్నపూర్ణమ్మను పెళ్ళి చేసుకున్నాడు.
రామస్వామి పెద్దకుమారుడు త్రిపురనేని గోపీచందు తెలుగులో ప్రప్రథమ మనస్తత్వ నవల అసమర్థుని జీవయాత్ర రాసి తెలుగు సాహిత్యముపై చెరగని ముద్ర వేశాడు.
భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది. తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.
పెద్దకుమార్తె సరోజిని దేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కానుమిల్లి సుబ్బారావును వివాహమాడినది.
త్రిపురనేని గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో, 1950లలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.
రామస్వామి చిన్న కుమార్తె చౌదరాణి స్వాతంత్ర్య ఉద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన అట్లూరి పిచ్చేశ్వరరావుని పెళ్ళి చేసుకొన్నది. ఈమె తమిళనాడులో తొలి తెలుగు పుస్తకశాలను ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయింది.
ఈ తరానికి బాగా తెలిసిన, తెలుగు చలనచిత్ర నటుడైన త్రిపురనేని సాయిచంద్ సుప్రసిద్ద రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు, కవిరాజు త్రిపురనేని రామస్వామికి మనుమడు.
త్రిపురనేని రామస్వామి మనసా, వాచా, కర్మణా సంస్కర్తగా మెలిగాడు. తన పేరులో ఉన్న కుల చిహ్నం చౌదరిని తొలగించుకున్న ఆదర్శమూర్తి ఆయన. వారు 1943 జనవరి 16 న మరణించాడు.
ఆయన సాహిత్య కృషిని గుర్తించి, ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము చేసారు.
1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో భారతదేశ ప్రభుత్వము వారు ఆయన స్మారక చిహ్నముగా ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరి పేరుతో "కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి" పురస్కారం ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తుంది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొలువైన తెలుగు వెలుగులలో వీరి శిలా విగ్రహం ప్రతిష్ఠించారు.
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాధనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. సూతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
పురణాలు ఎంత వరుకు వేదములకు అనుకూలమూ, ప్రతికూలమో, ఎంత వరకు నీతి బాహ్యములో, ఎంతవరకు పక్షపాతములో లోకానికి తేటతెల్లం చేయటానికి వీరు 'సూత పురాణం' రాసారు.
జాగర్లమూడి కుప్పుస్వామి గారి మిత్రత్వంతో 'కుప్పు స్వామి శతకం' 1930లో రాసారు.
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్ళిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు
ఈయన చేసిన ముఖ్య రచనలు:
సూతపురాణము
శంబుకవధ
సూతాశ్రమ గీతాలు
ధూర్త మానవ శతకము
ఖూనీ
భగవద్గీత
రాణా ప్రతాప్
కొండవీటి పతనము
కుప్పుస్వామి శతకం
గోపాలరాయ శతకం
పల్నాటి పౌరుషం
వివాహవిధి

కామెంట్‌లు