సాహిత్యంలో నోబుల్ - యామిజాల జగదీశ్
 సాహిత్యం కోసం 1996లో నోబుల్ పురస్కారం పొందిన పోలెండ్ రచయిత్రి విస్లావా జింబోర్స్కా wislawa szymborska. పూర్తి పేరు Maria Wislawa anna Szymborska. 

ఆమె  పోలెండ్ లోని ప్రొవెంట్ లో 1923 జూలై రెండో తేదీన పుట్టారు. క్రకోవ్ నగరంలో ఓ మూల ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. చాలాకాలంపాటు విస్లావా ఎవరికీ ఇంటర్వ్యూ ఇచ్చేవారు కాదు. తానున్న ఇంటి ఆడ్రెస్సూ చెప్పేవారు కాదు. టెలిఫోన్లో మాట్లాడేవారు కాదు. ఉత్తరాలు పేరుకుపోతుండేవి. కానీ వాటికి జవాబులూ రాసేవారు కాదు.
ఓ సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు "ఎందుకు మీరు ఎప్పుడూ శోకమైన కవితలే రాస్తారు? సరదాగా రాయరా? వినోదం పడదా?" అని అడిగారు. 
మరొక సమావేశంలో "ఎందుకు ఎప్పుడూ సరాదావే రాస్తారు? సీరియస్ అంశాల గురించి రాయవచ్చుగా? " అని అడిగారు.
అంటే మొత్తంమీద నేను రెండు రకాలూ రాయగలనని తెలిసిందనుకున్నారు ఆమె.
ఒకానొకప్పుడు స్టాలిన్ ఖ్యాతిని పొగుడుతూ రచనలు చేసిన ఈమె కొంతకాలం తర్వాత తనను కమ్మిన ఆ భ్రమల నుంచి బయటపడ్డాననుకున్నానని చెప్పిన సందర్భాలున్నాయి. 
నాతో కవితలు రాయించింది మా నాన్నే. అయిదో ఏట వచ్చీరాని విధంగా ఓ కవిత రాసినప్పుడు ఒక్కొక్క దానికీ నాన్న ఎంతో కొంత పారితోషికం ఇచ్చేవారు. కొన్నిసార్లు ఒకే కవితను రెండుసార్లు చూపించి పారితోషికం పొందానన్నారామె. 
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె అజ్ఞాతంలో చదువుకున్నారు. కొంత కాలం రైల్వే గుమాస్తాగా పని చేసిన ఆమె యుద్ధపు రోజులలో ఆమె ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలకు బొమ్మలు వేశారు. 
జగియలోనియన్ విశ్వవిద్యాలయంలో పోలిష్ సాహిత్యం, సోషియాలజీ చదివిన ఆమె తొలి కవిత 1945లో ఓ పత్రికలో అచ్చయింది. కవిత శీర్షిక జుకం స్లోవా. అంటే మాటలకోసం చూడటమని అర్థం. 
ఆర్థిక ఇబ్బందులతో 1948 లో విశ్వవిద్యాలయం నుంచి అనుకున్న చదువుని పూర్తి చేయకుండానే బయటకు వచ్చేసిన ఆమె 1949లో ఆమె తొలి పుస్తకం సెన్సార్ విభాగం వారివల్ల తిరస్కృతికి గురైంది.
తుదిశ్వాస విడిచే ముందు వరకూ ఆమె కొన్ని సాహిత్య పత్రికలకు సంపాదకురాలిగా పని చేశారు. ఓ మ్యాగజైన్లో పుస్తకసమీక్షలు రాస్తూ వచ్చిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ఎన్నో వ్యాసాలు రాశారు.
ఆమె చివరి కవిత 2012 లో అచ్చయ్యింది. ఆ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన  ఆమె తన ఎనభై ఎనిమిదో ఏట ఊపిరితిత్తుల క్యాన్సరుతో ఇంట్లోనే  మరణించారు. ఆమె రచనలు పన్నెండు భాషలలో అనువదించబడ్డాయి. ఇంగ్లీషులో వెలువడిన ఆమె పుస్తకాలు కొన్ని...సౌండ్స్, ఫీలింగ్స్, థాట్స్ (1981), పీపుల్ ఆన్ ఎ బ్రిడ్జ్ (1990), వ్యూ విత్ ఎ గ్రైన్ ఆఫ్ శాండ్ (1995), నథింగ్ ట్వైస్ (1997), మిరాకిల్ ఫెయిర్ (2001), మోనోలాగ్ ఆఫ్ ఎ డాగ్ (2005), హియర్ (2010). 
కామెంట్‌లు