భక్త మార్కండేయ; - సి.హెచ్.ప్రతాప్

 మృకండు మహర్షి గొప్ప శివభక్తుడు. ఆయన తపస్సులో లీనమై ఉన్నప్పుడు మృగాలు వచ్చి తమ దురదలు పోవడానికి తమ శరీరాలను ఆయన శరీరానికి రాపిడి చేసినా అయన చలించే వారు కాదు. అంతటి గొప్ప తప సంపన్నుడికి పిల్లలు లేరన్న కొరత తీవ్రంగా బాధిస్తుండేది.ఒకరోజు భార్య మరుద్వతి సమేతంగా తపస్సు కోసం కాశీ పట్టణానికి బయలుదేరారు.అక్కడ వారు రెండు శివలింగాలు ప్రతిష్టించి, మహాదేవుని గూర్చి ఘోర తపస్సు చేసారు.అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై వారి భక్తిని పరీక్షించేందుకు సద్గుణుడు అల్పాయిష్కుడు కావాలా లేక దుర్గుణాలు గలవాడై దీర్ఘాయువు ఉన్న వారు కావాలా అని అడిగాడు. అందుకు మృకండు మహర్షి అల్పాయుష్కుదైన పుత్రుడే కావాలని ప్రార్ధించాడు.
శివుని వర ప్రభావం చేత మరుద్వతి తొమ్మిది నెలలు నిండాక ఒక పుత్రుడిని ప్రసవించింది. వాడికి మార్కండేయుడు అంటే మృకండుని కొడుకు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.ఏడవ ఏట ఉపనయనాది క్రతువులు నిర్వహించి వేదాధ్యయనం ప్రారంభింపజేసారు. ఒకరోజు సప్తర్షులు మృకండును ఆశ్రమానికి వచ్చి మార్కండేయుని వినయ విధేయతలకు సంతోషించి చిరంజీవ అని దీవించారు. వారికి మృకండుడు జరిగిన సంగతి చెప్పగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహించారు.. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొని పోయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింప చేసి మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెయ్యమని సలహా ఇచ్చారు.
16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరులను   మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరారు. అప్పుడు  మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివా మహాదేవా కాపాడు ఎంతో ఆర్తితో ప్రార్ధించాడు.
వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి  వచ్చాడు. దీన్ని చూసి యముడు ఆయన రుద్రరూపం చూసి యమధర్మరాజు భీతావహ డై మహాదేవా, శరణు శరణు అని ప్రార్ధించాడు. అతనికి అభయం ఇచ్చిన శివుడు  మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవడివి. నిరంతరం అకుంటిత దీక్షతో నా ఆరాధన చేస్తూ , ధర్మకార్యాలు ఒనరిస్తూ ఈ భూమిపై ధర్మ సంస్థాపన కోసం కృషి చెయ్యి అని చిరంజీవిత్వం ప్రసాదించి అంతర్ధాన మయ్యాడు. ఆ వరం ప్రభావంతో నేటికీ మార్కండేయుడు అదృశ్యరూపంలో  చిరంజీవిగా వున్నాడు
కామెంట్‌లు