"నిగ్రహం";-ఎం బిందుమాధవి
 మళ్ళీరామాయణంలోదేమరొకకధచెప్పుకుందాం!
రామాయణం...మనిషి సమాజంలో నలుగురితో కలిసి ఎలా ధర్మ బద్ధంగా బతకాలో తెలియచెప్పే ఒక నిఘంటువు లాంటిది అని చెబుతారు పెద్దలు.
అది ఒక మనస్తత్వ శాస్త్రం...
ఒక ధర్మ శాస్త్రం...
నీతి శాస్త్రం..
శకున శాస్త్రం..
సాముద్రిక శాస్త్రం...
ఆయుర్వేద శాస్త్రం..
ఇలా....
ఇంతకు ముందు కధలో....కైకేయి తన దాసి 'మంధర' చెప్పుడు మాటలు విని తనకి ప్రియమైన రాముడిని పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యమని..భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరుతుంది.
అరణ్యవాసం అంటే..నార చీరలు ధరించాలని, అడవిలో దొరికే కంద మూలాలు, ఫలాలు భుజించాలని, బ్రహ్మ చర్య దీక్షతో భూశయనం చేస్తూ సన్యాసి జీవితం గడపాలని కఠినమైన నిబంధనలు పెట్టింది.
అంటే తన భార్య తనతోనే ఉన్నా..సాంసారిక జీవితం గడపకూడదనేది నియమం.
ఏ ఆకర్షణలకి లొంగకుండా నిగ్రహం పాటించటం అన్నమాట.
అంటే...అన్నీ మనకి అందుబాటులో ఉన్నప్పుడే అసలు మనం 'నిగ్రహం'అనేది పాటించగలమా అనేది ప్రస్తావనలోకి వస్తుంది.
ఏవీ లేనప్పుడు నిగ్రహం ఎందుకు? దేని నించి మన మనసుని కట్టడి చేసుకోవాలి? అనేది ప్రశ్న! అవునా?
రాముడు భుజించే ఆహారం ఎలా ఉండాలో చెప్పింది. రుచి పాకాలతో సంబంధం లేని కంద మూలాలు, పండ్లు... ఆ సమయానికి ఏవి లభ్యమయితే అవే భుజించాలి.
ఇక్కడ మనం తెలుసుకోవలసింది...మన మానసిక స్థితిని, శారీరక స్థితిని నిర్ణయించేది మనం తినే ఆహారం. మనం తినే ఆహారంలో మూడొ వంతు మన మనస్సుని ప్రభావితం చేస్తుంది.
త్రిగుణాలైన సత్వ, రజస్సతమస్సులు మనం తినేఆహారం ద్వారా మన ప్రవర్తనని నిర్దేశిస్తాయి.
స్త్రీ పట్ల ఆకర్షణ..సాంసారిక జీవితం పట్ల కోరిక...లైగిక వాంఛలు కలగకూడదనే ఉద్దేశ్యం తోనే కైకేయి రాముడిని అరణ్యవాసం చేసినంత కాలం కందమూలాలే భుజించాలనే నియమం పెట్టింది.
అసలు భోజనం చెయ్యటమనేది ప్రశాంతంగా చేసే ఒక యజ్ఞం వంటిదన్నారు పెద్దలు.
@@@@
ఇప్పుడు మనం ఆహారంలో రుచుల పట్ల విపరీతంగా ఆకర్షింపబడుతున్నాము.
తమో గుణాన్ని ప్రేరేపించే ఫాస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడందరికీ విపరీతమైన మోజు. స్వీట్స్ అని, మసాలా వంటలని ఎగబడి అక్కడపడితే అక్కడ నిలబడి తినేస్తున్నారు.
ఏ ఆహారం ఎలా...ఏ సమయంలో భుజించాలో మన సనాతన ధర్మం స్పష్టంగా చెప్పింది. కానీ మనం అవన్నీ వదిలేశాం.
దాని ఫలితమే.. ఉచ్ఛం నీచం లేని లైగిక ప్రవర్తన.
రాముడు తన స్వపత్ని పట్ల పాటించిన నియమాలు, నిగ్రహాలు పరాయి స్త్రీ/పురుషుల పట్ల పాటించలేకపోతున్నాము.
దీనివల్లే సమాజంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి.
స్త్రీలకి పర పురుషుల పట్ల వ్యామోహం, పురుషులకి పరస్త్రీల పట్ల ఆకర్షణ..కోరిక... వివాహేతర సంబంధాలకి దారి తీస్తున్నాయి.
అవి ఇంకొక అడుగు ముందుకేసి..తమ అవినీతి జీవితాలు బట్టబయలు చేస్తారనో...మరొక విధంగా అడ్డు వస్తారనో పిల్లలని హతమార్చటం..ప్రియులతో కలిసి జీవిత భాగస్వామిని అంతం చెయ్యటమో దాకా వెళుతున్నాయి.
ఇంతేనా..తండ్రి కూతురిపై..సోదరులు సోదరిపై..వయసు మళ్ళిన అమ్ముమ్మ, నాయనమ్మ లాంటి స్త్రీలపై... అత్యాచారం చెయ్యటం...ప్రతి రోజు వార్తాపత్రికల్లో చదువుతున్నాం...టీవీల్లో చూస్తున్నాం..
రామాయణం పుట్టిన దేశంలో ఆశ్చర్యం కలిగించే ఈ విచ్చలవిడి పోకడలు..మనం నీతి నియమాల నించి ఎలా దూరం జరిగిపోయామో తెలియజేస్తున్నాయి.
నీతి నియమాలు తప్పిన జీవితాలు ఎలా నశించిపోతాయో రావణాసురుడి, అతని సోదరి శూర్పణఖ చరిత్రలు తెలియ జేస్తాయి.


కామెంట్‌లు