అందరికీ అవసరమేమో?!;-- యామిజాల జగదీశ్
 అరవై దాటి డెబ్బైలోకి అడుగు పెట్టిన ఓ పెద్దాయన నాకు పరిచయస్తులే. ఆయనను కలిసి "మీరెలా ఉన్నారు? ఎలా కాలక్షేపం చేస్తున్నారు?" అని అడిగాను.
అందుకాయన "మీ ప్రశ్నలకు జవాబు ఇంటికెళ్ళి మీకు రాసి పంపుతాను" అన్నారు.
అన్నట్టుగానే ఆయన ఓ జాబితా రాసి పంపారు...
1) నా కన్నవాళ్ళపట్ల, నా తోబుట్టువుల పట్ల, నా బిడ్డల పట్ల, నా మిత్రుల పట్ల చూపిస్తూ వచ్చిన ప్రేమాభిమానాలను ఇప్పుడు నా పట్ల చూపించుకుంటున్నాను.
2) ఈ ప్రపంచాన్ని నేను నా భుజస్కంధాలపై మోయవలసిన అవసరమేమీ లేదని తెలుసుకున్నాను.
3) ఇప్పుడు కాయగూరలు కొనే చోట, తోపుడు బండ్లపై పళ్ళమ్మే వారి దగ్గర ఏవైనా కొనవలసి వస్తే బేరం చేయడం మానేశాను. బేరం చేయకుండా చూసీ చూడనట్లు ఇచ్చే డబ్బు వారి కుటుంబానికి ఏదో రూపంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
4) రోజంతా శ్రమించే టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం నిల్చోడం మానేశాను. ఇందుకు అతని పెదవులపై కనిపించే నవ్వులు నాకూ ఆనందంగా ఉంది.
5) నాకన్నా వయోపరంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఓ సంఘటనను మళ్ళీ మళ్ళీ చెప్తే "ఇది మీరంతకుముందే చెప్పారు" అని ముఖాన కొట్టినట్లు చెప్పక అప్పుడే మొదటిసారి చెప్పినట్లు వినడం మొదలుపెట్టాను.
6) మనకోసం శ్రమించే పనిమనుషులతో వాదించడమో లేక అరవడమో పూర్తిగా మానేశాను. ప్రశాంతతను మించింది లేదని తెలుసుకున్నాను.
7) ఒక్కొక్కరూ తాము చేసే పనులను మనసారా పొగడటం ఆనందంగా ఉంది.
8) నా చొక్కాలపై కన్పించే చిన్న చిన్న మరకలనూ నేను పట్టించుకోవడం లేదు. మన రూపం కన్నా మన వ్యక్తిత్వం బాగుండాలని భావిస్తున్నాను.
9) నన్ను పట్టించుకోని వారి నుంచి నేనే నా అంతట దూరంగా ఉంటున్నాను.
10) ఈ జీవితంలో నన్నెవరైనా దాటితే నేనందుకు ఏమాత్రం దిగులుపడటం లేదు. నేనసలు పందెంలో ఉన్నట్టే అనుకోవడం లేదు.
11) ఇప్పుడు నేను ఎటువంటి ఉద్వేగానుభూతులకు లోనవడంలేదు. వాటికసలు చోటివ్వడం లేదు.
12) బంధాలను తెంచుకోవడం కన్నా నా అహాన్ని వదులుకోవడమే మేలైనదనే నిర్ణయానికి వచ్చేసాను.
13) ఈరోజే జీవితంలో చివరి రోజు అన్నట్లుగా అనుకుని ప్రతి రోజునీ గడుపుతున్నాను.
14) నాకు సంతోషాన్నిచ్చే రీతిలోనూ ఇతరులను సంతోషంగా ఉంచే విధంగా వీలున్నంత వరకూ ప్రవర్తించాలనేదే నా నిర్ణయం.
15) ఇతరులపట్ల ఫిర్యాదులు చేయడం, వదంతులు పుట్టించడం మానేశాను.
16) నా వల్ల ఇతరులకు ఏ శ్రమా కలగకుండా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను.
17) ఇతరుల విషయాలలో అనవసర జోక్యాన్ని పూర్తిగా మానుకున్నాను.
18) ఎవరైనా వారంతట వారు నా దగ్గరకొచ్చి ఏదన్నా చెప్పి ఏదైనా అడిగితే నాకు తెలిసిందేదో చెప్తున్నాను. అంతకన్నా ఎక్కువ మాట్లాడను.
19) నా అవసరాలను, ఆశించడాలను వీలున్నంత వరకూ తగ్గించేసుకున్నాను.
20) రాజకీయం, ఆధ్యాత్మికం, మత సంబంధిత విషయాలపై ఎవరితోనూ వాదనకు దిగడం లేదు. ఆ చర్చలంటూ వస్తే నవ్వుతూ తప్పిస్తున్నాను.
అన్నట్టు ఆయన చెప్పినవన్నీ బాగున్నాయి. వీటిని ఆచరించడానికి వృద్ధాప్యం వచ్చే వరకూ ఆగడం ఎందుకు. ఆయన చెప్పిన వాటిని ఏ వయస్సు వారైనా పాటించడం మంచిదేమో...
నాకొక తమిళ మిత్రుడు పంపిన సమాచారమిది. బాగుందని రాసాను. ఎవరిష్టం వారిది. నేను మరో పదహారు నెలలకు డెబ్బైలో అడుగుపెట్టబోతున్నానని తెలిసి ఇది నాకు పంపాడా మిత్రుడు...? కావచ్చు. నేను పాటించవలసినవి ఇందులో చాలా ఉన్నాయి. 

కామెంట్‌లు