తనదాకా వస్తే!అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలు చిలోపొలో అంటూ పార్కులో ఆడుతున్నారు. కొందరు గాలిపటాలు ఇంకొందరు తూనీగల వెంట పరుగులు తీస్తున్నారు. దూరం గా ఆమూల పడిపోయిన చెట్ల దగ్గరికి వెళ్ళారు రాము సోము.వారికి రెండు చిలకలు రెండు పావురాలు చేతికి చిక్కాయి.పూర్తిగా రెక్కలు రానిస్థితిలో ఉన్నాయి.వాటిపై జాలి ప్రేమ కలిగి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఓపదిరోజుల కల్లా అవన్నీ  బాగా కోలుకున్నాయి.పావురాల వల్ల శ్వాసకోశ రోగాలు వస్తాయి అని తెలుసు వారికి. అందుకే వాటిని స్వేచ్ఛగా విడిచి పెట్టారు. అందమైన రామచిలుకలను మాత్రం  పంజరంలో బంధించారు. తమకి టాటా బైబై చెప్పిన  పావురాలను చూస్తూ చిలుకలు ఏడవసాగాయి.రాము సోము వాటికి దోరజామపండు ముక్కలు దానిమ్మ గింజలు మంచి నీరు బుల్లి బుల్లిగిన్నెల్లో పోసి పంజరంలో పెట్టి "తినండి చిలుకలూ!చిట్టి రామచిలుకలు!పంచదార తీపి పలుకులు "అంటూ  రాగంతీసి పాడుతుంటే అవిమాత్రం ఓమూల ఒదిగి కూచున్నాయి."ఎందుకు తినటంలేదూ?" చాలా సేపు  బతిమాలాక అవి ఇలా అన్నాయి"పావురాలని విడిచి పెట్టి మమ్మల్ని బందీలుగా చేయటం న్యాయమా?""మీరు  అందంగా ముద్దు గా ఉన్నారు కనుకే మాదగ్గర ఉంచుకున్నాం.వేళకి కమ్మని ఆహారం పెడుతున్నాం! రెక్కలు నెప్పి పెట్టే దాకా ఎగిరే పనిలేదు. ఏగద్ద డేగ తన్నుకు పోతుంది అనే భయంలేదుకదా?ప్రాణహాని ఉండదుగా?" ఆపిల్లల మాటలకి చిలుకలు దీనంగా అన్నాయి."హూ!స్వేచ్ఛ లేని పంజరంలో పదేళ్లు ఉన్నాదండగ!ఆకాశంలో గిరికీలు కొడుతూ తోటి పక్షులతో కువకువలాడటం లో ఉన్న  ఆనందం మీకు ఏంతెలుసు"? ఇంతలో తాత ఊరినించి వచ్చాడు. సంబరంగా  తమచిలకలను రాము సోము చూపారు.ఓగంట తర్వాత  తాత వారిద్దరికీ రకరకాల పళ్ళు  స్వీట్స్  చక్కిలాలు బూందీ బొమ్మలు  ఇచ్చి  ఓగదిలో పెట్టి బైట తాళం వేశాడు. తాత వంక చిలుకలు ఆశగా దీనంగా చూడసాగాయి.ఓగంట తర్వాత  రాము సోము "తాతా!ఓతాతా! తలుపులు ఎందుకు వేశావు?తియ్యి" అరిచారు. "మీరు అసలే కోతి అల్లరి వెధవలు. ఆపక్కవీధి పెళ్ళికి వెళ్లారు మీఅమ్మ నాన్న!మీతో వేగటం చాలా కష్టం అని చెప్పారు. అందుకే తాళం వేశాను,తింటానికి అన్నీపెట్టానుగా?" ఓఅరగంట ఆగి రాము సోము ఆరున్నొక్క రాగం ఆలాపించారు."ప్లీజ్ తాత గారు!మేము అల్లరి చేయం!మాకు ఇవేవీ వద్దు. "ఓ గంట వారి ఏడ్పు పెడబొబ్బలు భరించి తాత  తాళం తీశాడు "మీరు చిలుకలను పంజరంలో బంధిస్తారా? ఇప్పుడు తెలిసిందా?స్వేచ్ఛ అంటే ఏమిటో?ముందు  ఆచిలుకలను పంజరంలోంచి విడిచి పెట్టండి.ఆపని నేనే చేయొచ్చు. కానీ తాత మీకు నచ్చనిపని చేశాడని మీరు గుర్రు మంటారని ఊరుకున్నా." అంతే "తాతా!మీరు చెప్పినట్లే చేస్తాం" అని చెంపలు వాయించుకుని పంజరంతలుపు తీశారు. తుర్రున చిలుకలు ఎగిరి పోతూ "ధన్యవాదములు తాతగారూ!" అన్నాయి🌹
కామెంట్‌లు