మా మధ్య పరిచయానికి ఆ మాటలే పునాది!!;-- యామిజాల జగదీశ్
 అన్ని పరిచయాలూ ఒక్కలా ఉండవు. 
ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమంలో ఏర్పడే పరిచయాలన్నీ ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేం. నేను ఫేస్ బుక్ లో అప్పుడప్పుడు పోస్ట్ చేసే కొన్ని చిన్న మాటలు సూక్తులు కావు. "విశ్వదాభిరామ వినరవేమ" వంటివసలే కావు. ఎందుకంటే నాకొచ్చిన భాష అంతంత మాత్రం. నా రాతకోతల్లో రాతకన్నా కోతలే ఎక్కకువ. పెద్ద పెద్దవి రాయడం తెలీక చిన్న చిన్నవి రాస్తే ఓ పనైపోతుందని రాయడమే హాయని రాస్తుంటాను. అవైనా ఎందుకు రాయాలి? ఎవరికోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? అనే ప్రశ్నలను పక్కనపెడితే నన్ను నేను సమీక్షించుకోవడానికేగా అని అనుకుంటాను. ఒక్కొక్కప్పుడు ఎవరో ఎక్కడో చెప్పిన మాటలు నాకిష్టమై గుర్తుండటానికి రాసుకుంటాను. కానీ నాకు జ్ఞాపకశక్తి తక్కువే. అందుకే ఎవరైనా ఫలానాది రాశావు అన్నప్పుడు ఏం రాసానో గుర్తుకు రాక ఆలోచనలో పడతాను. తప్పు రాశానా ఒప్పు రాసానా అని.  కాలక్షేపం కోసమేనని సమర్థించుకుంటాను. అయితే ఆ మాటలూ ఒకరిద్దర్ని చదివింపచేస్తాయని తెలుసుకున్నాను ఎన్.వి. ప్రసాద్ రావుగారివల్ల.
మా మధ్య పరిచయానికి పునాది ఫేస్ బుక్ లో పోస్టులే...వాటి ద్వారానే అరుదుగా మాటలు ఫోన్లో...వాట్సప్ లో ఒకటిరెండు మాటలు. ఆయన హైదరాబాద్ వచ్చిపోయినప్పుడు రెండు మూడు సార్లు కలవాలనుకున్నాంగానీ కలవలేదు. అయితే సెప్టెంబర్ 17వతేదీ ఉదయం ఫోన్ చేసిన కొన్ని గంటలలోపే ఆయనను కలిశాను. ఎప్పటికీ గుర్తుండిపోయే కలయిక అది.
వస్తారా అనడంతోనే అప్పటికప్పుడు బయలుదేరి ఆయన బస చేసిన ప్రకాశ్ నగర్ (హైదరాబాద్)కి వెళ్ళి కలిసినప్పటి నుంచి తిరిగీ నేను బస్సెక్కి ఇంటికి వచ్చేవరకూ వారితో గడిపిన క్షణాలన్నీ అపూర్వం. ఆయన నుంచి, ఆయన కుటుంబసభ్యుల నుంచి పొందిన ఆప్యాయతానురాగాలు ఎంత సహజంగా ఉండిపోయాయో మాటల్లో చెప్పలేను. ఐనా సహజత్వానికేగా అందమెక్కువ! అవన్నీ ఆస్వాదిస్తుంటే నేనింత భాగ్యవంతుడినా అనే ఆనందం అనంతం. పైగా ఈ కలయికకు నిలయం "ఈటీవీ ఫేం" రాంబాబుగారిది కావడం ఆశ్చర్యం. 
నాలో లేని, నాకు తెలీని ఆదరణను రాంబాబుగారితోసహా అందరిలోనూ చూసాను. 
నిజానికి నాకెవరితో ఎలా ఉండాలో 
ఎలా మాట్లాడాలో తెలీదు. అందువల్లే మాట్లాడటానికి ఒకింత తడబడతాను. అవతలివాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతాను. అలాంటి నేను ప్రసాద్ గారి బృందంతో నాకిష్టమైన, నేను ప్రత్యక్షంగా చూసిన చలంగారి గురించి, నేను ప్రేమించాననుకుని ఫీలైన వాటి గురించి, నా పెళ్ళి గురించి, నా ప్రేమలేఖల గురించి ఉన్న కాసేపట్లో వారందరితో పంచుకున్నాను. వాళ్ళ మాటలూ విన్నాను. ప్రసాద్ గారు తమ జీవితపయనాన్నీ తమ పిల్లలెదిగిన తీరుని చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ప్రసాద్ గారితో మాట్లాడుతున్న సమయంలోనే వైజాగు నుంచి డాక్టర్ వాణిగారు కాల్ చేయడం, ఆవిడను పలకరించే అవకాశమిచ్చిన ప్రసాద్ గారి సుమనసుకి నమస్సులు. హెర్బల్ టీ, పెరుగన్నం, స్వీట్లు, అరటిపళ్ళు, సమోసా, మరొక్కసారి టీ, ...చాలు చాలు అన్నంతగా పెట్టారు తృప్తిగా....
ఇక రాంబాబుగారితో ముచ్చట్లు ... సిరిధాన్యాలతో చేసి తినిపించిన పరమాన్నమంత మధురంగా ఉన్నాయి. పందిరమంచంతోపాటు పాతకాలం వస్తువుల సేకరణ గురించి ఆయన చెప్తుంటే ఎంతందంగా ఉందో. ఆయన ఇంట్లో గోడలపై ఆణిముత్యాల్లాంటి మాటలు, బొమ్మలు, ఫోటో ఫ్రేములు, బుట్టలు, రకరకాల మొక్కలు, రెండు చిన్నపాటి కొలనులో  కలువ మొక్కలు, బాల్కనీ అంతటా ఎటు చూసినా పచ్చగా చల్లగా తీర్చిదిద్దడం హృద్యంగా ఉన్నాయి. ఈటీవిలో ఆయన చేసి చూపించే వంటల చిత్రీకరణ తీరుతెన్నులతోపాటు ఆయన రుచులూ అభిరుచులూ వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో మనసుకి. రాంబాబుగారింటి పందిర మంచం చూస్తుంటే నా చిన్నప్పుడు రెల్లివలస (విజయనగరం)లో మా మేనమామ ఇంట పడుకున్న పందిరిమంచం గుర్తుకొచ్చింది 
ఇవన్నీ ఒక ఎత్తయితే బయలుదేరబోయే ముందు ఫోటోలు తీయించుకున్నాను. తొమ్మిది పుస్తకాలతో (లోపలి దారి, ఆత్మదర్శనం, సోక్రటీస్, కృష్ణమూర్తిత్వం, లమణ సూక్తులు, కర్ణాటక దాస భక్త చరితామృతము, జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర, ముల్లా నసీరుద్దీన్ కథలు, ప్రముఖుల చమత్కారాలు)పాటు జీడిపప్పులు దక్షిణగా ప్రసాద్ రావుగారి నుంచి అందుకున్నాను.  ఈ పుస్తకాలు ఒక్కొక్కటి ఒక్కో తీరు. వాటిలో కాంత్ రీసాగారి "ఆత్మదర్శనం" మరీ మరీ ప్రత్యేకం. దీని గురించి విడిగా రాస్తేనే బాగుంటుంది. వినూత్న పంధాలో రూపొందిన పుస్తకం. ఈ పుస్తకం వెనుక అట్టపై ఉన్న మాటలు...
"రాయును రీసా రాయుట వ్యర్థమని తెలిసి
పాడును గీయును అరచును వ్యర్థమని తెలిసి
తెలిసి చేయును పరిపూర్ణముగ పనికిరాని పనులు
అతను అకారణజన్ముడు రీసా రసోవైసః"
రీసాగారినోమారు కచ్చితంగా కలవాల నుంది. 
ఏమీ ఆశించక చూసొద్దామని వెళ్ళిన నేను
ప్రసాద్ కుటుంబ సభ్యుల  ప్రేమానురాగాలను, రాంబాబుగారి సహృదయాన్ని నిండుగా ఆస్వాదించి, ఎదలో పొదుగుకుని ఇంటికి చేరిన ఈ కలయిక కలకాలం గుర్తుంటుంది. 
కామెంట్‌లు