అగ్రగణ్యుడు;- సుమ కైకాల.
 వక్రతుండ మహాకాయ 
సూర్య కోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా 
సర్వకార్యేశు సర్వదా
శ్రావ్యంగా పూజ మందిరం నుండి జానకమ్మ స్వరం వినిపిస్తుంది.
"తొందరగా కానివ్వండి వర్జ్యం వచ్చేస్తుంది. పదకొండు గంటల కల్లా వాళ్ళింట్లో ఉండాలని రామయ్య పంతులు చెప్పారు. వీడు రెడీ అయ్యాడా?" శంకర్ మాటలలో టైం అయిపోతుంది అనే కంగారు ధ్వనిస్తుంది.
"నేను రెడీగానే ఉన్నానండి. బాబూ కిరీటి,అయిందా? డాడీ కంగారు పడుతున్నారు. తొందరగా రా" అని పిలిచింది అహల్య.
"అయిపోయిందమ్మా!...వస్తున్నాను అంటూ రూంలో నుండి బయటకు వచ్చాడు కిరీటి.
"అహల్యా, ఒకసారి దేవుడి మందిరం దగ్గరకు రా" అని పిలిచింది జానకమ్మ.
"అసలే టైం అయిపోతుందంటే ఈవిడ ఎందుకు పిలుస్తుంది ఇప్పుడు?" విసుక్కుంటూ వెళ్ళింది అహల్య.
"ఇప్పటికి ఇరవై నాలుగు పెళ్లి చూపులకు వెళ్లి వచ్చారు. ఫోనుల్లో మాట్లాడుతున్నారు. ఒక్కటీ కుదరలేదు. అమ్మాయి బాగుంటే జాతకం కలవడం లేదు. జాతకం బాగుంటే అమ్మాయి బాగుండదు. రెండూ చూసుకొని పెళ్లి చూపులకు వెళ్తే ఫోటోలో అమ్మాయికి బయట చూపించిన అమ్మాయికి రంగు,రూపం తేడా ఉండి నచ్చడం లేదు అంటున్నారు. నిన్నే వినాయక చవితి చేసుకున్నాము. అన్నీ బాగుండి ఈ సంబంధం కుదిరితే స్వామికి కుడుములు పోస్తాను అని ముడుపు కట్టి వెళ్ళండి. విఘ్నాలను అరికట్టే గణపయ్య మనవాడి పెళ్లి కుదిరేలా చేస్తాడు. అసలే వాడు ఇదే చివరి పెళ్ళిచూపులు అంటున్నాడు" అంది జానకమ్మ.
"ఇప్పుడా? ఇప్పుడు ముడుపు కట్టే సమయం ఎక్కడది? సంబంధం కుదిరితే పెళ్లికి కడతాను లెండి" అంది అహల్య.
"క్షణాల్లో అన్నీ నేను సిద్ధం చేస్తాను అహల్యా...వినాయకుడు అల్పసంతోషి. రవిక గుడ్డలో శేరుoపావు  బియ్యం పోసి రెండు వక్కలు, రెండు ఎండు ఖర్జురాలు వేసి కట్టడమే" అంటూ సిద్ధం చేయబోయిన జానకమ్మను వారించింది అహల్య.
"అబ్బే! వర్జ్యం వచ్చేస్తుంది అత్తయ్యగారు...అంటూ పదండి వెళ్దాం" అని శంకర్ దగ్గరకు వెళ్ళి అంది అహల్య.
జానకమ్మ నిస్సహాయంగా చూస్తుండిపోయింది.
అది చూసిన కిరీటి "నానమ్మ ఏదో చెప్తుంది కదమ్మా! వినకుండా వచ్చేస్తున్నావు" అన్నాడు.
"ఆవిడకి చాదస్తం ఎక్కువైంది. అవన్నీ చేస్తూ కూర్చుంటే రాహు కాలం వచ్చేస్తుంది. అప్పుడు పిల్లను ఎలా చూడటం?" విసుగ్గా అంది అహల్య.
"మీరు పదండి...నేను వస్తాను" అని నానమ్మ దగ్గరకు వెళ్ళాడు కిరీటి.
కొడుకు వైపు కోపంగా చూసింది అహల్య.
కిరీటి అహల్య శంకర్ ల ఏకైక పుత్రుడు. అందం, ఆస్తి, ఉద్యోగం అన్నీ ఉన్నా సంబంధాలు కుదరడం లేదు. ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. కిరీటికి పెళ్లి మీదే విరక్తి వచ్చేసింది. అందుకే ఇక నేను పెళ్లి చూపులకు రాను ఇదే చివరసారి అని గట్టిగా చెప్పాడు.
శంకర్ జరిగినదoతా చూసాడు కానీ తల్లికి, భార్యకి పొంతన పొసగదని తెలుసు కాబట్టి మౌనం వహించాడు.
తల్లికి దైవభక్తి ఎక్కువ భార్యకి తక్కువ అలాంటప్పుడు ఎవరి ఇష్టానికి వాళ్ళను వదిలేయడం మంచిది అని అతని అభిప్రాయం.
అహల్యా అనుకున్న సమయానికి చేరుకోవాలి అని కిరీటిని తొందర పెట్టింది.
కారు స్పీడు పెంచాడు కిరీటి. వాళ్ళు విజయవాడ నుండి గుంటూరు వెళ్తున్నారు. 
గుంటూరు ఊరులోకి ప్రవేశించారు. అడ్రస్ లొకేషన్ మ్యాప్ ఆన్ చేసాడు కిరీటి. 
దారి పొడవునా వినాయకుడి పందిళ్లు ఉన్నాయి. సందులు ఇరుకుగా ఉండి దారి కాస్త ఇబ్బంది పెడుతుంది. మ్యాప్ లో చూపించిన దారిలో వెళ్లడం కుదరడం లేదు.
"ఈ వినాయకుడి పందిళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా అయితే మనం వెళ్లే సరికి దుర్ముహూర్తం వచ్చేస్తుంది ఒకసారి అమ్మాయి తండ్రితో మాట్లాడండి ఎలా రావాలో చెప్తారు" అంది అహల్య.
శంకర్ ఆయనకి కాల్ చేసాడు. ఆయన " మీరు ముందుకు వస్తుండoడి నేను మీకు ఎదురు వస్తాను" అన్నారు.
"సరేనండి" అని శంకర్ అదే మాట కొడుకుతో చెప్పాడు.
కొంత దూరం ముందుకు వెళ్ళారు. అక్కడ దగ్గర దగ్గర లోనే పందిళ్ళు ఉన్నాయి. కారు వెళ్లే దారి కూడా లేదు. మళ్ళీ వెనక్కు వచ్చి పక్క సందులోకి తిప్పబోయాడు కిరీటి.
సరిగ్గా అదే సమయంలో మలుపు తిరగబోతున్న ఒక ఆక్టివాని కారు గుద్దేసింది. బండి మీద ఉన్న వ్యక్తితో సహా బండి పడిపోయింది.
కిరీటి స్టీరింగ్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. అతని తల స్టీరింగ్ కి కొట్టుకుంది. వెనుక కూర్చున్న అహల్య, శంకర్ లు సీట్ కి బలంగా కొట్టుకున్నారు.
అక్కడ చుట్టూ జనం గుమిగూడారు.
కిరీటి కొన్ని నిముషాలు షాక్ కి గురయినా తేరుకున్నాడు. గబుక్కున కిందకు దిగాడు. అక్కడున్న కొందరు బండిని లేపారు. బండి క్రింద ఉన్న ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఎవరో  అంబులెన్స్ కి కాల్ చేసారు. క్రింద పడిపోయిన ఆయన మొబైల్ నుండి ఎవరో ఆయన ఇంటికి కాల్ చేసి సమాచారం అందించారు. 
"అలా ఎలా గుద్దావు? కారులో వెళ్తుంటే బండి మీద వెళ్లే వాళ్ళు కనబడరా? " అంటూ కిరీటి చుట్టూ జనం తిట్ల వర్షం కురిపించారు.
రాంగ్ రూట్ లో వచ్చింది ఆయనే నేను కాదు అని కిరీటి ఎంత చెప్పినా అరణ్యరోదనే అయింది. 
అంతలో అంబులెన్స్ వచ్చి ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. 
"మీరు తప్పించుకుంటే మేము ఊరుకోము. పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. మీరూ హాస్పిటల్ కి వెళ్లాల్సిందే" అని అక్కడున్న వాళ్ళలో కొందరు హెచ్చరించారు.
" మీరు వెళ్ళమని అన్నా కూడా నేను తప్పించుకొని వెళ్ళను. ఆయన కోలుకున్నాకే వెళ్తాను. మీరు కంగారు పడకండి" అని అంబులెన్స్ వెనుకే వెళ్ళాడు కిరీటి.
 అహల్యా,శంకర్ లు జరిగిన సంఘటనతో మాటా పలుకు లేకుండా తల పట్టుకొని కూర్చున్నారు.
గాయపడ్డ వ్యక్తిని ఐసీయూ లోకి తీసుకెళ్ళారు. 
"ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు షాక్ కి గురి అయ్యారు. గాయాలు అయ్యాయి" అని డాక్టర్ చెప్పారు.
ట్రీట్మెంట్ కు డబ్బులు అన్నీ కిరీటి కట్టాడు. 
ఆయన బంధువులు అందరూ అక్కడకు వచ్చారు. కిరీటిని, అతని తల్లిదండ్రులనీ చూస్తూ ఈయనే ఏక్సిడెంట్ చేసింది అని చూపులతో మాటలతో తూట్లు పొడిచారు.
అన్నింటికీ ఓర్పుగా సమాధానం ఇచ్చాడు కిరీటి. 
డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకొని వెళ్లిపోదాము అని శంకర్ కిరీటితో అన్నా కూడా అతను ఒప్పుకోలేదు.
ఆయనకి స్పృహ రావాల్సిందే అని గట్టిగా చెప్పాడు.
దాదాపు గంట తరువాత ఆయన కళ్ళు తెరిచి మాట్లాడారు. కారు నడిపే వ్యక్తి తప్పు ఏమీ లేదు వినాయకుడి పందిళ్ళు ఉండడంతో నేనే రాంగ్ రూట్ లో వెళ్ళాను అని చెప్పారు.
దానితో ఆయన బంధువులందరూ కిరీటికి క్షమాపణ చెప్పారు. అతను అందరికీ చిరునవ్వుతో జవాబిచ్చాడు.
"ఆయనకి బండి మీద పడటం వల్ల గాయాలు అయ్యాయి కానీ ఫ్రాక్చర్ కాలేదు. ఒక రోజు అబ్జర్వేషన్ లో ఉంచండి"  అని డాక్టర్ చెప్పడంతో  అక్కడ నుండి బయలుదేరబోయాడు.
అంతలో శంకర్ ఫోన్ రింగ్ అయింది. పెళ్లి కూతురు అన్నయ్య చేసాడు.
"మా నాన్న గారికి ఏక్సిడెంట్ అయిందండి. మీ కోసం వస్తుంటే కారు గుద్దుకుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు మీకు ఈ విషయం చెప్పమన్నారు" అన్నాడు.
"ఆ గుద్దుకున్న కారు మాదేనండి" అని శంకర్ అన్నాడు.
అక్కడే ఉన్న అందరూ అనందాశ్చర్యాయాలతో ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు.
పెళ్ళికూతురు కూడా అక్కడే ఉంది. బాధ్యతగా తండ్రికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరు ఏమన్నా కోపగించుకోకుండా శాంతంగా సమాధానం ఇచ్చిన కిరీటి వైపు ఇష్టంగా చూసింది. అది అతను గమనించి తను కూడా ప్రేమగా చూసాడు.
ఫోటోలు చూసుకున్నా వాళ్లున్న టెన్షన్ లో  అప్పటి వరకు ఒకరిని ఒకరు గుర్తు పట్టలేదు. 
అలా వాళ్ల పెళ్ళిచూపులు అయిపోయాయి.
శంకర్ వాళ్ళు "మళ్ళీ వస్తాము"అని వాళ్లకు చెప్పి అక్కడ నుండి సంతోషంగా బయలుదేరారు.
ఇంటికి వెళ్ళాక అహల్య " అత్తయ్యా, మీరు చెప్పినా వినకుండా వినాయకుడి ముడుపు కట్టకుండా వెళ్లినందుకు చాలా ప్రమాదం ఎదుర్కొన్నాము. కానీ కథ సుఖాంతం అయింది. ఇప్పుడు ముడుపు కడతాను" అంది పశ్చాత్తాపంతో.
"ఇదుగో, నువ్వు కట్టాల్సిన ముడుపు నేను కట్టేసాను. కిరీటి నన్ను కట్టమన్నాడు" అని చూపించింది ఆవిడ.
అక్కడున్న వినాయకుడి బొమ్మ చేతి లోకి తీసుకొని "అంతా నీ దయే స్వామీ! ఇరవై అయిదవ సంబధంతో నీ ముడుపు చెల్లించుకుంటున్నావా!" అన్నాడు కిరీటి ఆనందంగా.
***

కామెంట్‌లు