*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 082*
 *చంపకమాల:*
*హరిపద భక్తి నింద్రియజ | యాన్వితుఁడుత్తముఁడింద్రియంబులన్*
*మరుగక నిల్పనూదినను | మధ్యముఁడింద్రయ పారవశ్యుఁడై*
*పరగినచో నికృష్టుఁడని | పల్కఁగ దుర్మతినై నన్ను నా*
*దరమున నెట్లు కాచెదవొ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
విష్ణుమూర్తి పాదము లందు భక్తి కలిగి  ఇంద్రియములను జయించిన వాడు ఉత్తముడు అని, ఇంద్రియములు చూపే దారిలో పోకుండా నిగ్రహంతో ఉన్నవాడు మధ్యముడు అని, ఇంద్రియములు నడిపించె దారిలో నడిచేవాడు అధముడు అని చెప్తారు. కానీ, నేను బుద్ధి లేని వాడినై ఇంద్రియములు నడిపించే దారిలోనే నడస్తున్నాను. ఆదరించి నన్ను ఎలా కాపాడుతావో నీవే దిక్కు తండ్రి!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ దారిలో వెళితే ఇబ్బందులు కలుగుతాయి, అందువల్ల ఈ దారి గుండా కాక అవతలి దారిలో వెళ్ళండి, కొంచెము దూరమైనా. అని ఎవరైనా మనకు సలహా ఇస్తే, నాకు చెప్పేంత గొప్పవాడా అతడు. నేను ఈ దారిలోనే వెళతాను అని, ఆ దారిలోనే వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకునే లక్షణాలు మనలో చాలా మందివి. ఎదుటివారు చెప్పే దాంట్లో మంచిని చూసే కంటే ముందు, మనకు అలా చెప్పడం వల్ల వారికి ఏమి లాభముందో, అని ఆలోచిస్తారు చాలా మంది. ఇలా కాకుండా, ఎదుటి వారు చెప్పిన విషయంలో మంచిని గ్రహించి, ఆ మంచి నుండి వచ్చే ఉత్తమ ఫలితాలను తాను అనుభవించి, నలుగురికి పంచగలిగితే అంతకంటే, గొప్ప విజయం ఇంక ఎక్కడా దొరకదు.  ఇటువంటి మంచి లక్షణాలను అలవరచుకునే మంచి బుద్ధిని మనందరకు ఇచ్చి, మంచి మార్గంలో నడిపించమని ఆ వృషభారూఢుని ప్రార్థిస్తూ ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss


కామెంట్‌లు