మనకీర్తి శిఖరాలు ;-నూతక్కి భానుప్రసాద్ . . . .;- డాక్టర్ బెల్లంకొండ నాయీశ్వర రావు , చెన్నై
 నూతక్కి భానుప్రసాద్ . .(1928 - 2013) భారతీయ సాంకేతిక నిపుణుడు, బ్యూరోక్రాట్. ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒ.ఎన్.జి.సి) కు మాజీ చైర్మన్. ఆయన 1994 లో భారతదేశంలో మొదటి మాగ్నీషియం ప్లాంట్ రూపకల్పన చేయుటలో ప్రసిద్ధి చెందారు. ఆయన అప్సరా రీసెర్చే రియాక్టరు తయారీ బృందంలో ఉన్నారు. ఇది భారతదేశంలోని మొదటి అణు రియాక్టరు. భారత ప్రభుత్వం 1960లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం యిచ్చింది.
నూతక్కి భానుప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఫిబ్రవరి 21 1928 న కమ్మ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పున్నమ్మ, నూతక్కి రామశేషయ్య గార్లు. ఆయన తండ్రి ఒడిశా ప్రభుత్వంలో వైద్య మంత్రిగానూ, భారత పార్లమెంటు సభ్యునిగానూ యున్నారు.
నూతక్కి భానుప్రసాద్ ప్రారంభవిద్యను పార్వతీపురంలో ఉన్నత విద్యను విశాఖపట్టణం లోనూ చేసారు. ఆయన 1947లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీని అందుకున్నారు. ఆయన పూణె విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ లో ఎం.ఎస్. డిగ్రీని పొందారు. ఆయన పరిశోధనల నిమిత్తం 1953లో కేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి అదేసంవత్సరం భారతదేశానికి తిరిగివచ్చి అల్యూమినియం కంపెనీ ఆఫ్ కెనడాలో చేరారు.
ఆయన 1954 లో డిపార్టుమెంటు ఆఫ్ అటామిక్ ఎనర్జీలో రియాక్టరు గ్రూపు అధిపతిగా చేరి 1961 వరకు పనిచేసారు. ఈ కాలంలో ఆయన 1958 నుండి 1961 వరకు "సిరస్ రియాక్టరు"కు మానేజింగు డైరక్టరుగా సేవలనందించాడు. 1962 నుండి 1974 ల మధ్య ఆయన వివిధ ప్రైవేటు కంపెనీలైన AFM, SEL, OXEECO, PIPL వంటి వాటికి డైరక్టరు లేదా మేనేజింగు డైరక్టరుగా పనిచేసారు.1974 లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్కు చైర్మన్ గా నియమితులై 1978 వరకు కొనసాగారు. 1978 నుండి 1980 లమధ్య ఆయన భారత అణుశక్తి మత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి సెక్రటరీగా కూడా పనిచేసారు.ఆయన 1992 వరకు వరల్డ్ బ్యాకుకు కన్సల్టెంట్ గా కూడా పనిచేసారు. అదే విధంగా 1986 నుడి 1988 వరకు ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూ చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తించారు. ఆయన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు (1965-79) , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూ (1969-78) బోర్డు మెంబరు గా కూడా వ్యవహరించారు.
నూతక్కి భాను ప్రసాద్ భారతదేశం లోని మూడు ప్రసిద్ధ ప్రాజెక్టులలో పాలుపంచుకుని ప్రముఖులైనారు.
అవి మొదటి అణు రియాక్టరు (ట్రాంబే), బొంబాయి హై ఆయిల్ ఫీల్డ్స్ అభివృద్ధి , మొదటి మాగ్నీషియం ప్లాంటు నెలకొల్పడం. 
ఆయన పెండ్యాల అనంతలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు కుమారులు. ఆయన 2013 ఏప్రిల్ 29 న హైదరాబాదులో తన 85వ యేట మరణించారు.
అవార్డులు,గౌరవ సత్కారాలు.
ఆయనకు 1975లో హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం , 1978 లో ఆంధ్ర విశ్వవిద్యాలయాలు డాక్టర్ ఆఫ్ సైన్స్ యొక్క "హోనోరిస్ కాసా" డిగ్రీలను ప్రదానం చేసాయి.
ఆయన ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు సభ్యునిగా ఎంపిక అయ్యారు. ఆయన హైదరాబాదు మానేజిమెంటు అసోసియేషన్ కు వ్యవస్థాపక సభ్యులుగా యున్నారు. ఆయన ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ లకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. 
1960లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. 
2003లో పెట్రోటెక్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు అవార్డు వచ్చింది.

కామెంట్‌లు