విందూ...మందూ!!;-- యామిజాల జగదీశ్
 ఎంత దగ్గరవారైనా మూడు రోజులు మించి ఒకరింట అతిథిగా ఉండకూడదు. ఇది ఓ మంచి మనిషికి అందం చందం. జబ్బుపడితే మూడు రోజులు మందులు వాడితే నయమవుతుందనేవాళ్ళు ఒకానొకప్పుడు. 
అది మంచి ఆరోగ్యవంతమైన ఒంటికి అందం. విందూ మందూ మూడు రోజులకే అని తమిళంలో ఓ నానుడి ఉంది. అటువంటప్పుడు నెలల తరబడి మందులు వాడితే సబబేనా??? 
ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా మా పక్కింటి బామ్మ నా చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తుకొచ్చింది.
ఒకడు తన తల్లితో "అమ్మా, నన్ను మా అత్తగారు విందుకి రమ్మంటున్నారు. వెళ్ళిరానా" అని అడిగాడు. తల్లి సరేననడంతో కొడుకు నేనెప్పుడు తిరిగిరావాలి అని అడుగుతాడు. అందుకు తల్లి "ఎప్పుడు నీ ముఖం నీకు కన్పిస్తుందో అప్పుడు వచ్చేసే. అంతకుమించి ఒక్క రోజుకూడా అక్కడ ఉండకు" అని చెప్పి పంపింది. 
తల్లి ఎందుకలా చెప్పిందో కొడుకుకి అర్థం కాలేదు కానీ భార్యతో కలిసి అత్తవారింటికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళడంతోనే ఒకటే హడావుడి. ఆర్భాటంగా విందు. వడ్డనలు. 
ఓ పెద్ద విస్తరాకు వేసి వడ్డన్లు మొదలు. ఆకులో వడ్డించడానికి చోటు లేనన్ని రకాలు....అంటే ఎన్ని రకాలు వడ్డించారో ఆలోచించుకోవచ్చు. అతనికెంతో సంతోషం వేసింది.
రెండు రోజులు బాగానే ఉంది. రెండోరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క రకం తగ్గుతూ వచ్చింది. ఆరవ రోజు వొట్టి సాంబారు, కూరతో సరి.
ఏడవ రోజు ఆకు వేయలేదు. ఓ చిన్న ప్లేటులో అన్నం, సాంబారు. ఎనిమిదో రోజు వొట్టి చప్పిడి వంట. అయినా అవేవీ పట్టించుకోక సరిపెట్టుకుంటూ వచ్చాడతను.
కారణం...ఆ రోజుల్లో చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేసే వారు. ఓ పరిపక్వతనేదో ఉండదు.
తొమ్మిదో రోజు అతను కంగుతిన్నాడు. పళ్ళెంలో నీళ్ళ మజ్జిగ అన్నం. నంచుకోవడానికి ఆవకాయతో సరి. ఆకలితో ఉన్నాడు కనుక పెద్దగా పట్టించుకోక తినడానికి తల వంచగా మజ్జిగ అన్నంలో అతని మొహం కనిపించింది.
అప్పుడతనికి అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. దాంతో ఇంకా ఇక్కడుంటే మర్యాద ఉండదనుకుని తన ఇంటికి బయలుదేరాడు.
ఎంతటి దగ్గరవారైనాసరే మూడు రోజులు మించి ఒకరింట ఉండకూడదనేందుకు ఈ కథను అప్పట్లో చెప్పేవారు. ఆదే ఎవరికైనా అందం. చుదం. అలాగే జబ్బుపడ్డప్పుడు మూడు రోజులు మందులు వాడితే నయమవుతుంది. అదే మంచి ఆరోగ్యవంతమైన శరీరానాకి అందం. చందం.
"విందూ మందూ" మూడు రోజుల తమిళ సామెతను వివరించేందుకే పక్కింటి బామ్మ చెప్పిన నాటి కథ చిన్న వయస్సులో విన్నది.
ఆ బామ్మ ఇప్పుడు లేకపోయినా ఆవిడ చెప్పిన కథ ఇప్పటికీ జ్ఞాపకముంది. ఆమెకు కృతజ్ఞతలు.

కామెంట్‌లు