"సుస్వర జ్ఞాని";-నలిగల రాధికా రత్న.
గలగలా ప్రవహించే నదిలా
అనురాగ రసంతో 
విరహ గీతాన్ని విరచించి...
చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా 
అద్వితీయమైన సంగీతాన్ని 
వినిపించి.....
అనేక సంగీత రీతుల్ని 
సమన్వయం చేసిన
పరిణితి చెందిన విద్వాంసుడు...!!

నాలుగేళ్ల వయసులోనే
పలు రాగాలను గుర్తించి
తండ్రి వద్ద సరిగమలు దిద్ది
తొలి చిత్రం లోనే 
గాన నటనా కౌశల్యాన్ని 
తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పి
అత్యంత 
యువ సంగీత దర్శకుడుగా 
చరిత్ర సృష్టించిన
జెమిని ఆస్థాన సంగీత దర్శకుడు....!!

లలిత సంగీతానికి మొదటిగా
తెలుగులో శ్రీకారం చుట్టి
సాహితీ ప్రస్థానంలో 
మల్లీశ్వరిని కలికితురాయిగా నిలిపి..
వీనుల విందు గొలుపుతున్న
సాహిత్య సంగీతాల మేళవింపుతో
ఒక కొత్త ఒరవడికి
నాంది పలికిన సృజనశీలుడు....!!

సాహిత్యాన్ని మింగి వేయని
సరస సంగీతానికి 
చిరునామాగా నిలిచి...
బాల సరస్వతి తో స్వరమైత్రి తెలుగునాట
మూగ గొంతులు సైతం 
మారుమ్రోగేలా చేసి...
ఎన్నో అజరామరమైన 
వెండితెర వెలుగులకు 
సంగీతపు మధురిమలు 
అందించిన అనుభవజ్ఞుడు....!!

ప్రతి పాటా...
స్వర కుసుమల తోటగా పరిమళింపచేసిన 
ఆపాత మధురమైన 
సంగీత సృష్టికర్త....!!

స్వరాలూరు రాజేశ్వరరావుగా...
యావత్ భారతదేశానికి 
సుపరిచితుడై నిలిచి
సుదూర  సంగీత యాత్ర
కొనసాగించిన "సుస్వర జ్ఞాని"...!!

(కళాప్రపూర్ణ ...
శ్రీ సాలూరు రాజేశ్వర రావుగారి
శత జయంతి సందర్భంగా 
అక్షర కుసుమాలతో నీరాజనాలు....)


కామెంట్‌లు