తే.గీ
పట్టెడన్నంబు లేనట్టి పాపడొకడు
పాల చెంబుకై జూసెను పసి వయసున
పైకములు లేని వానిగా ప్రజల ముందు
చులకనైపోయి కొనలేక కలతజెందె
తే.గీ
ధనము దండిదై పసివాని మనసువిరగ
లోచననురేపె నొక మూర్తి లోకవిధిని
కమ్మనైనట్టి యోచన కలత దీర్చ
నెమ్మదిగ సాగి చెఱువున నిలచి జూసె
తే.గీ
చెంగు చెంగున నెగిరడి చేపలెన్నొ
చూసి నాగక పట్టెను చొక్క విప్పి
సంబరంబెతొ హెచ్చగా సత్వరమున
పరులకమ్మగా దక్కెను పైకమింత
తే.గీ
పాలు కొని ద్రావి బుద్ధికి పనిని జెప్పి
గాలమేయుటన్ నేర్చెను గడుసువాడు
నిపుణుడై రొక్కమును కొంత నిలపసాగి
రాత్రి బడులందు చదువున రాటుదేలె
తే.గీ
వాణి శ్రీలక్ష్మి మెచ్చగా వదలకండ
చిన్ని వ్యాపారమును బెట్టె చిత్రముగను
చిక్కనైనట్టి పాలతో చక్కగాను
కూర్చి తేనీరు విందుల కొట్టు నడిపె
తే.గీ
కొట్టుతో లక్ష్మి జేరగా పట్టుబట్టి
చదువులమ్మను గొలిచెను చక్కగాను
యెదిగె మహరాజు విధముగా యింపుతోడ
పేద బ్రతుకులన్ దిద్దేడి పెన్నిధిగను
తే.గీ
అంతలో ముంచుకొచ్చిన యల్పు లతని
పుట్టు పూర్వోత్తరమ్ముల చిట్టవిప్పి
కలత బెంచగా చురుకైన గడుసువాడు
కొద్ది సమయంబు వారిపై శ్రద్ధ బెట్టెఁ
తే.గీ
నీతి వల్లించ వినరనే నిజము నెరిగి
వారి లోపాల ఘనతను వలచి జేయ
బేలలైపోయి స్నేహంగ పిలచిరపుడు
ముల్లు గుచ్చగన్ దీసెను ముల్లుతోడ
తే.గీ
ఎట్టి మనిషైన పుడమినగట్టితనము
కొద్ది పాటిగన్ నేర్చిన చెట్టు విధము
వేర్లతో ప్రాకి నిలబడి విరివిగాను
ఫలితములు పొంది పండ్లను పరులకిచ్చు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి