శ్మశాన వైరాగ్యం / ప్రసూతి వైరాగ్యం (జాతీయం వివరణ);-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 శ్మశాన వైరాగ్యం అంటే తాత్కాలికంగా కొంచెం సేపు ఈ జీవితం మీద , తాము బతుకుతున్న విధానం మీద విరక్తి కలగడం. మన దగ్గరి బంధువులు గానీ, స్నేహితులుగానీ చనిపోయినప్పుడు చివరిచూపు చూడడానికి వెళతాం. మనిషి చనిపోయాక రాజయినా, బంటయినా ఒకటే. చేరవలసింది అరడుగుల గుంతలోకే. బతికున్నప్పుడు ఎంతో వైభవంగా బతికిన మనిషి చనిపోయిన మరుక్షణం శవంగా మారతాడు. శవాన్ని అతను ఎంతో ప్రేమగా కట్టుకున్న సొంత ఇంటిలో గూడా వుంచరు. వీధిలోకి తెచ్చేస్తారు. శవం నిమిష నిమిషానికి కుళ్ళిపోతుంటాది. అనేక మంది అక్కడికి చేరి వారి గురించి తలచుకొంటూ బాధపడుతుంటారు. దగ్గరి వాళ్ళు, అయినవాళ్ళు పెద్ద ఎత్తున ఏడుస్తుంటారు. ఇదంతా చూసినపుడు మనకు ఒక్కసారిగా విషాదం కమ్మివేస్తాది.
ఎప్పుడయినా మనమూ చావవలసిందే గదా... ఒకరు ముందు, ఒకరు తర్వాత. ఆ మాత్రం దానికి ఇలా వస్తువుల మీద, ధనం మీద, కుటుంబంమీద వ్యామోహం ఎందుకు. అందరినీ దూరం చేసుకుంటూ ఆశతో మరింత సంపాదిస్తూ బతకడం ఎందుకు. ఇకపై ఇవన్నీ ఆపేయాలి. దానధర్మాలు చేయాలి. ప్రశాంతంగా జీవించాలి. సాటి మనిషికి సాయపడుతూ మంచివానిగా పేరు తెచ్చుకోవాలి. డబ్బు వెంట పరుగెత్తకూడదు... ఇలా ఆలోచనలు సాగుతాయి. మనసంతా వైరాగ్యంతో నిండిపోతుంది.
కానీ ఇదంతా ఎంతసేపంటే... శ్మశానం దాటేంత వరకే. ఇంటికి తిరిగి రాగానే మరలా అదంతా మరచిపోయి ఎప్పటిలాగే ధనం వెంట, తీరని కోరికల వెంట పరుగులెత్తడం మొదలు పెడతాం అందుకే ఈ తాత్కాలిక వైరాగ్యాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే ఇదంతా కొద్దిసేపే, ఎక్కువ సేపు నిలబడదు అని అర్థం.
ప్రసూతి వైరాగ్యం కూడా ఇటువంటిదే. స్త్రీ ప్రసవవేదన సమయంలో విపరీతమైన బాధను అనుభవిస్తుంది. ఇక జన్మలో పురుషునితో సాన్నిహిత్యం వద్దనుకుంటుంది. కానీ బిడ్డ పుట్టిన మరుక్షణం ఆ చిరునవ్వులను చూడగానే అన్నీ మరచిపోతుంది. ఆ బాధవల్ల వచ్చిన వైరాగ్యం ఎంతో కాలం వుండదు. మరలా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, కలయిక సాగుతూనే వుంటాయి. అందుకే ఈ తాత్కాలిక వైరాగ్యాన్ని ప్రసూతి వైరాగ్యం అని కూడా అంటారు.
**********

కామెంట్‌లు