అభ్యుదయకవి, కాలజ్ఞాన ప్రవక్త బ్రహ్మంగారి;- ....డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు.)-మాచర్ల పల్నాడు జిల్లా. ఆం.ప్ర.9848562627.

   ఎవరీ బ్రహ్మంగారు?ఎప్పటి వారు?ఏమి ఆయన ఘనత?ఎందుకు ఊరూర దేవాలయాలు వెలిశాయి?ఏ వింత జరిగిన ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు అని ప్రజలెందుకు అనుకుంటున్నారు. ఆయన బోధనలేమిటి?ఎందుకు ప్రజలు ఇంతగా కలవరిస్తున్నారు,పూజిస్తున్నారు?ఆయనలోని గొప్పతనమేమిటి?ప్రజల మనసులో ఆయనెందుకు  పెద్ద పీట వేసుకొని కూర్చున్నారు,ఇంచుక పరిశీలిద్దాం
         "భగవద్గీత లో చెప్పినట్లు సమాజం ఎప్పుడు ధర్మానికి బాధ కలుగుతుందో అప్పుడు భగవంతుడు
తనకు తానుగా పుడుతూ ఉంటాడని " చెప్పినట్లుగా
సమాజంలో మతద్వేషాలు కులవైషమ్యాలు మూఢా చారాలు పెచ్చుమీరి పోతున్న సమయములో భగదవతారంగా మహనీయులు జన్మించిన దాఖలా
లు కనపడుతున్నాయి.ప్రజలకు సద్భోధ చేయటానికి
ఎందరో ఉద్భవించారు.వారికంటే ఒక విభిన్నమార్గములో తనదైన ముద్ర వేసుకున్నవారు
బ్రహ్మంగారు అనుట అక్షరసత్యం.
          ముందుగా తనను తాను ఉద్ధరించుకుంటూ,
తానెవరో తెలుసుకుంటూ పరమాత్మ తత్వాన్ని ఎరిగినవాడే సంస్కారవంతుడు.తానప్పుడు సమాజో
ద్ధరణకు పాటుపడిన తానొక ఆదర్శమూర్తి యౌతాడు
అనుట నిజముగదా. దానికి ఉదాహరణ గా నిత్యం మన ఇండ్లలో జరిగే సంఘటన పరిశీలిద్దాం."  స్త్రీలు నిత్యం చేసే పనిని పరిశీలిద్దాం". ఉదయాన్నె నిన్నటి వాడిన గిన్నెలన్ని కాలిన వరిపొట్టు కొబ్బరి పీచుతో 
గట్టిగా తోమి పక్కన పెట్టి అన్నీ తోమిన తర్వాత
చేతులు మో చేతిదాక శుభ్రంగా కడుగుకొని తోమిన పాత్రలను నీటితో కడుగుతారు. అప్పుడు పాత్రలు
శుభ్రంగా మెరుస్తూవుంటాయి వాటిని బొర్లించి నులక మంచాలమీద ఆరబెట్టి తర్వాత ఇంట్లో సద్దుకుంటారు. ఇది పల్లెవాసుల నేటికి జరుగుతున్న నిత్యకృత్యాలు.ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే
తోమిన మనచేతులు మురికిగా ఉంటే కడిగే పాత్రలు
శుభ్రంగా ఉంటాయా?చేతులమురికి పాత్రలకు అంటుకుంది. అందుకే చేతులు కడుగుకున్నాక తోమి
న గిన్నేలు కడుగుతారు.అలాగే గురువులైన వారు ఆత్మజ్ఞానులై ఇతరులకు బోధ చెయ్యాలి మనో మాలిన్యంతో బోద చేస్తే ఫలితముండదు.అది గ్రహించిన  బ్రహ్మంగారు కూడా తానెవరో తన జన్మము ఏమిటో తెలుసుకున్నారు.బాల్యంలోనే తల్లి అనుమతి తీసుకొని తీర్ధయాత్రలు చేశారు. తపస్సు చేశారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు. ఆవుల కాపరిగా ఉంటూ సమాజాన్ని చదివారు. ఆదశలో నే
సమాజానికి ఎంచెప్పాలో తెలుసుకున్నారు. ఆవుల కాపరిగా సామాజిక జీవనం చేస్తూ ఆవులను మేతకు తోలుకొనిపోయి ఊరవతల కొండల సమీపంలో వాటన్నింటినీ గిరిగీసి గీతలో నిలిపి వాటి ఆలన పాలనకు ఆటంకము కలుగకుండా మహిమాన్వతమైన వృత్తబంధములో ఉంచి తాను "రవ్వల కొండ"  గుహలోకి తాటియాకులు తీసుకొని వెళ్ళి "కాలజ్ఞానం" రచించారు. "నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే"భవిష్యత్ దర్శనం చేశారు. రాబోవు గడ్డుకాలాన్ని గమనించారు.జరుగబోయే సాంఘి సామాజిక మార్పులను మన మనోనేత్రంతో యోగముద్రలో దర్శించారు. వాటిని తాళపత్రాలపై రాసి భద్రపరిచారు.
ఆ విషయాలనే ప్రజలకు భోధించాలనుకున్నారు.ఒక ప్రణాళిక బద్ధ రచన చేసుకున్నారు.తానను తానెరింగినారు.అప్పుడు ప్రజలకు బోధలు చేయ తలపెట్టినారు.ఇదిలా ఉండగా...
             "నరుల నోట్లో నల్లపూస దాగదు "అన్నట్లుగా
ఆవులముంద గీసిన గీతలోనే ఉంటూ ఎటూ చెదిరి పోకుండా అక్కడే ఏం మేత మేస్తున్నాయి ,అనే విషయం అటుగా రోజూ వెళ్ళే జనాలకు అర్ధంకావటం లేదు.ఆ విషయం "గరిమిరెడ్డి అచ్చమ్మగారికీ"అందిం
చారు.ఆమెకు ఏమీ అర్ధంకాలేదు ఆవులు పుష్టిగా ఉంటున్నాయి రోజూ పాలిస్తున్నాయి ఇంకెందుకు అనుమానం ఆమె పట్టించుకో లేదు.రోజూ అదే పనిగా 
చూచిన వాళ్ళందరూ చెపుతూవుంటే ఆమెకు మానవ సహజమైన అనుమానం కలిగింది ఒకరోజు 
బాలుడైన బ్రహ్మంగారు ఆవులు తోలుకు పోతుంటే వెనకాలే వెళ్ళి గమనించింది జనం చెప్పింది నిజమైంది గుహలో ఏమిచేస్తున్నారో చూడాలని వెళ్ళింది చూచి ఆశ్చర్య పోయింది. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ బాలుని గమనించింది కాలజ్ఞానం వ్రాయటం గమనించి పాదాలపైపడి వేడుకుంది శిష్యురాలైంది .బనగానపల్లె లో "లోమఠం"కట్టించింది గరిమిరెడ్డి అచ్చమ్మ.అట కొంతకాలం తపస్సు చేసుకొని కాలజ్ఞానం రచించి వాటిని ఒక పాతరలో భద్రపరచినారు.అచ్చమ్మకోరగా ఆమె కుమారుడు బ్రహ్మారెడ్డి అంధత్వమును తొలగించినారు.అది చూచిన ప్రజలు ఆశ్చర్యపడి వారి శిష్యులైనారు వారి మహిమలెరిగిన బనగానపల్లె నవాబు పరీక్షింపదలచి ఆహ్వానించగా దర్భారుకు వెళ్ళి వారి ఆతిధ్యం స్వీకరించారు. అప్పుడు  నవావాబుగారు భోజనము నకు ఆహ్వానించగా అంగీకరించారు. వారు బంగారు పళ్ళెంలో మాంసాహారం పెట్టి పట్టు పుట్టంకట్టి ముందిడగా గ్రహించిన స్వామి ఔపోసన జలంచల్లి వస్త్రం తొలగించగా ఆ ఆహారం ఫలపుష్పాలు గా మారగా నవాబుగారు పాదాక్రాంతులైనారు. వారికి కాలజ్ఞానం బోధించారు.
          ఇది బ్రహ్మంగారు ప్రజలకు మంచిని బోధించి జ్ఞానబోధ చేయటానికి బయలుదేరే ముందు వారి
నేపధ్యగాధ. నవయవ్వనం లోనే జన్మసిద్ధమైన యవ్వన సుఖాలకు లోనుకాకుండా ఆత్మసంయమనముతో  తనను తాను తెలుసుకొని 
పరమాత్మత్వాన్ని ఆకళింపు చేసుకొనిబయలు దేరారు.గృహస్తుగా సమాజంలో తానొక్కడై జీవిస్తూ గృహస్తులకు బోధ చేసి మార్పుకు తనవంతు కృషిచేశారు.
        ఆనాటి సమాజ కట్టుబాట్లు తెలుసుకుందాం. స్త్రీలు,శూద్రులు వేదాలు చదువరాదు వినరాదు, ఆడపిల్లలకుబాల్యవివాహాలు చేస్తారు.మూఢ నమ్మకాలు,జాతరలు జంతుబలి కులమత వైషమ్యాలు పెచ్చుగా ఉన్న రోజులవి.  
      ప్రధానంగా స్త్రీలకు సమానగౌరవం కల్పించాలని
ఆదినుండి బ్రహ్మంగారి అభిమతం. అమ్మ అనుమతితోనే తీర్ధయాత్రలకు బయలుదేరినారు, గరిమరెడ్డి అచ్చమ్మకు జ్ఞానమార్గం కాలజ్ఞానం బోధించారు. ఆతర్వాత ముక్కు పచ్చలారని ఆడపిల్ల
కు పెండ్లి తగదని పుష్పవతి అయిన గోవిందమ్మను వివాహం చేసుకున్నారు. తాను జీవసమాధిలోకి వెళుతూ భార్యగోవిందమ్మన్ను పుసుపు కుంకుమలతోనే జీవించమన్నారు. ఆనాడే స్త్రీ జనోద్ధరణకు బీజంవేశారు.
       ఇక పోతే దేశంలో బోధ గురువులు,బాధ గురువులే ఉన్నారు.వారు ఉపన్యాసాలు చెప్పేవారే గాని ఆచరించేవారు కాదు. పాదపూజకు ధనం పట్టువస్త్రాలు ఆశిస్తారు.శిష్యుల విత్తందోచుకుంటారు
ఆ కోవకు చెందినవారు కాదు బ్రహ్మంగారు. జీవనోపాది కొరకు కులవృత్తులైన వడ్రంగం,కమ్మరం,
చేసుకుంటూ సంఘజీవనంచేస్తూ సంఘంలో ఒకడుగా ప్రజలతో మమేకమైపోతూ గృహస్తజీవనం చేస్తూ జ్ఞానమార్గలో పయనించారు. వేదాంతబోధ చేశారు.
జంతుబలులను నిరసించారు.ముందు ముందు జరగబోయే వింతలు విశేషాలు చెప్పారు.
        ఆచరణశీలి బ్రహ్మంగారు ఏది చెపుతారో అది ఆచరిస్తారు కులమత వైషమ్యం వలదన్నారు. అందుకు నిదర్శనంగా హరిజన కక్కయ్యను దూదేకుల సిద్దయ్యను గరిమిరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడు అన్నాజయ్యను సమానంగా అక్కున జేర్చుకొని ఆదరించి జ్ఞానులను చేసి చూపిన ఆచరణశీలి బ్రహ్మంగారు.
      ఆనాడే నాలుగు వందల సంవత్సరాల క్రితమే
అభ్యదయభావాలతో కవిత్వం వ్రాసిన తొలి అభ్యదయకవి బ్రహ్మంగారు.ప్రజలకొరకు,ప్రజలలో పుట్టి ప్రజలు మాట్లాడే వాడుక భాషలో కవిత్వం
రాశారు. తత్వాలు, గేయాలు ,పద్యాలు, సులభశైలిలో
అందించారు. 
"నందామయా గురుడ నందామయా
ఆనంద దేవికి నందామయా"
వారు వీరవుతారు వీరు వారవుతారు
మెట్ట పల్లాల లాగ ఏక మయ్యెరయా"
 అత్తలకు పీటలు కోడళ్ళకు మంచాలు
వచ్చేనయా...
"నందామయా గురుడనందామయా"అనే పల్లవితో చెప్పిన కవిత్వం ఆధునిక కవిత్వంకాక ఏమౌతుంది.
ఆనాడు వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిరూపింపబడుట అందరికీ తెలిసిన విషయమే.
      అంతేగాక ఆధ్యాత్మిక భక్తి తత్వాలు ఎందరికో జీవనోపాదికి ఉపయోగ పడుతున్నాయి. దేవాలయాలలో జరిగే భజన కార్యక్రమాలలో పాడుకుంటున్నారు.
       సామాన్య జనులను బోధపడే రీతిలో "ఆట వెలది "పద్యాలలో "కాళికాంబ హంస కాళికాంబ"అనే
మకుటంతో సప్తశతి (ఏడు వందల పద్యాలు)రాశారు
కాళియ మకుట కందాలు రాశారు.కవిగా తత్వ వేత్తగా
ఆ నాడే తన ప్రతిభ ను చూపించారు. కాని సమాజం వారిని దైవాన్ని చేసి ఆరాధిస్తూ కవుల జాబితాలోకి రానివ్వలేదు.దైవత్వం గల వారనుట లో సందేహములేదు అజ్ఞానులలో ఉన్న అంధకారాన్ని 
తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించిన మహనీయులు బ్రహ్మంగారు. తన శిష్యులైన కక్కయ్యను,సిద్దయ్యను
ఈ నాటికీ జనులు తలుచుకుంటున్నారంటే సామాన్య
మా.
       కాలజ్ఞానం లో చెప్పిన అంశాలు అక్షరసత్యాలై నిరూపింపబడినాయి.మచ్చుకు కొన్ని.
1.భారత భూమిని పాలనచేయ పరదేశ వాసులు వచ్చేరయా.
2.ఉత్తరదేశాన వైశ్యకులమందు గాందియను వాడొకడు పుట్టేనయా.
3."ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
    లక్షలాది ప్రజలు సచ్చేరయా
    కోరంకి యను జబ్బు కోటిమందికిసోకి
    కోడి లాగా తూలి సచ్చేరయా"
ఇటీవల సంభవించిన కరోనా మహమ్మారి కాదనగలమా? 
ఏనాడో చెప్పారుబ్రహ్మంగారు తిరపతి దేవాలయం మూతపడుతుందని.మనందరికీ తెలిసిన విషయమే.
వేప చెట్టుకు పాలు కారటం ఎన్నోచోట్ల జరిగిన మాట 
నిజమేకదా. అలాగే పంది కడుపున నంది పుట్టటం యదార్ధమే గదా. 
ఇక పోతే వింతగ ఈత చెట్టు రాత్రిపూట పడుకొని ఉదయం లేచి నిలబడటం నేనూ కళ్ళారా చూశాను.. రేపల్లే పట్టణంలో ముమ్మలనేని వారి పాలెంలో మంచినీళ్ళ బావి దాపున జరిగింది. 1970వ దశకంలో.ఆనాడు పత్రికలలో నూ వచ్చింది ఈ వార్త.
యాగంటి బసవన్న అంత కంతకు పెరిగి పోతున్న అంశమూ కాలజ్ఞానంలో చెప్పబడినదే. మనం చూస్తూనే ఉన్నాం
"కాళికాంబ శతకము"లో వారి భావాలను చూద్దాం.
స్త్రీలనుగౌరవించినతీరు అద్భుతం:----
"మాతృపూజ చేయు మగవారికెల్లను
అన్యకాంత తల్లియట్లు తోచు
ఎఱుక మరచువాడు నరకమ్ము పాలౌను
కాళికాంబ హంస కాళికాంబ"   
          తల్లిని దేవతా భావించేవారికి పరకాంతయు తల్లిగానే కనపడుతుంది. ఆ జ్ఞానం లేనివాడు నరకానికెళతాడు. అని హెచ్చరించారు.
"మూడు యుగములందు ముదితలు ముగ్ధలు
పురుష దౌష్ట్యమునకు పొగిలినారు
కలియుగాన కాంత లిలనేలగలరయా...
కాళికాంబ.......199వ పద్యం.
       ఎంతటి ముందుచూపో చూడండి గడచిన మూడు యుగాలలో ఆడవారు ముగ్ధలు కాని కలియుగంలో కాంతలు దేశాన్ని పరిపాలిస్తారు తస్మాత్ జాగ్రత్త ఆడవారిని అబలులగాచూడకండి
 అన్నారు
"స్త్రీ నిజముగాను సృష్టికి మూలము"అమ్మయన్న పదము అమృతధారను మించు"కుంటి గ్రుడ్డియైన కొడుకుల విడనాడ,బోవదెపుడు మాతృమూర్తి మహిని" అంటూ తల్లిని ఘనంగా చూపించారు.
      ఉత్తమైన గురువుల లక్షణాలు చెపుతున్నారు...
"తలను తడిమి గురుడు తగుమంత్రముంజెప్పు
 ఆత్మలోని మురికి నంత గడుగు
జనన మరణ దుఃఖ సముదాయముంద్రుంచు"
అంతేగాదు "హరిహరులకు మిన్న గురుపరబ్రహ్మము"
అంటారు,"గురుని తెలియకున్న గుణము చెడును "అంటూ ఉత్తమ గురువుల లక్షణం చెప్పారు.
అంతేగాక దొంగ గురువు ఉన్నారని చెపుతున్నారు.
"వేన వేలు శిష్య విత్తాపహారకుల్
 కలరు గురులు భరతఖండమందు
ఎంచ లేరు శిష్య హృత్తాపహారకుల్"
     వేలకు వేలు శిష్యుల ధనం దోచే గురువులు ఎంతోమంది భరతభూమిమీద నున్నారు.కాని శిష్యుల మనస్తాపాన్ని సందేహాలను తీర్చే గురువులు  లేరంటారు బ్రహ్మంగారు.
మానవీయకోణం:-----
"వన్నెలైదు గల్గు ప్రతిమలకై గుళ్ళు
 గోపురాలు కూడు గుడ్డలిచ్చి
ప్రాణమున్న వారి పట్టించుకోరేమి
కాళికాంబ హంస కాళికాంబ."...113వ పద్యం
     ప్రాణం లేని విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టించి ధూపదీప నైవేద్యాలకుఇచ్చి ప్రాణమున్న కూడుులేని
నరులను పట్టించుకోరేమయా?అంటూ మనోవ్యధను వ్యక్తపరిచారు."పరులకొరకు పాటుపడువాడు ధన్యుండు" అంటూ పరోపకారులను యోగి కంటే ఉత్తములని మెచ్చుకున్నారు. ఒక అద్భుతమైన సందేశం చూడండి..
"అష్ట మదములున్న అధమాధముండగు
  కష్టపడెడి వాడు ఘనుడు జగతి
  పరులకూటి కాసపడును ధౌర్భాగ్యుండు
   కాళికాంబ హంసకాళికాంబ"
         మదమెక్కినవాడు అధమాధముండు వాడు,కష్టపడి పనిచేసేవాడే గొప్పవాడు,పరుల సంపాదన కాశపడేవాడు పనికిరాని ధౌర్భాగ్యుడు అంటూ కష్టజీవిని మెచ్చుకున్నారు.
,"సర్వమానవులను సమముగా ప్రేమించు
కులమతాల నెంచి కోపపడకు
కాపుజాతినెల్ల కరుణించు మనె శ్రుతుల్"---
"పరులహింసపెట్టు పాపి యాతనలందు."
సమస్తమానవులను సమదృష్టితో ప్రేమించాలని ఉద్భోదించారు.
"చచ్చు పుచ్చుకైత పచ్చిశృంగారాన
చెప్పి కవులుమున్ను మెప్పుగ
నీతినిష్ట లెల్ల నిప్పుల పాలాయె
కాళికాంబ హంస కాళికాంబ"
     పుక్కిటి పురాణములవలన సమాజంలో నీతినియమాలు మంటగలిశాయని ఆ కవిత్వంరాసిన కవులను దుయ్యబట్టినారు. 
కుహనా భక్తులను దుయ్యబట్టారు.
"వట్టి మాటచేత వైష్ణవుండుగాడు
 భూతిపూయ శైవనేతగాడు
మనసు నిలుపువాడె మాన్యుండు ధన్యుండు."
"బ్రహ్మసూత్రభాష్యపంక్తులు వల్లించి
 ఆచరింపకున్న అధముడగును
భేదబుద్ధి విడువ వేదాంతవేత్తయౌ."
"బుజముపైని ముద్ర బుద్ధిపై పడబోదు"
     ఈ పద్యాల్లో బోధ గురువులను తూలనాడినారు.
వేదాంత సూత్రాలు ధర్మాలు వల్లేవేయటంగాదు వేదిక లెక్కి చెప్పటంగాదు అవి ఆచరించకపోతె వాడు అధముడైపోతాడు. అంతేగాదు శంఖ చక్రాలు భుజాలమీద ముద్దించుకున్నంత మాత్రాన బుద్ధి మారదు. కనక బోధల బుద్ధి మారాలి అంటారు.
బ్రహ్మంగారు ఆవిషయాలలో బ్రహ్మంగారు ఏది చెప్పారో అది చేశారు.కులమతబేధం లేకుండా అందరినీ చేరదీసి వేదాంతబోధ చేశారు. ఆత్మశుద్ధితో ఆచరించి చూపారు. అందుకే ఆయన ప్రజలహృదయాలలో చిరస్ధాయిగా నిలిచిపోయారు.
కులనిర్మూలన చూద్దాం:-----
"కులమనేటి తెగులు కొంపలగూల్చును"..76 ప
"కులము గోత్రమంచు కూసెడి మలపలు"...101.ప
"ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు"
"జన్మకాలమందు సర్వులు శూద్రులు"...213 ప
   ఈ విధంగా కులాల కుటిలవ్యవస్ధను విడనాడమన్నారు.
మనిషి ముక్తినొందే విధానం తెలిరజేశారు:-----
"జన్మజన్మములను సముపార్జితమైన
 పుణ్యలవము వలన ముక్తి గలుగు
భుక్తిగోరు వారు మోక్షమ్ముగనలేరు"---303
     ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం ఎ కొంచమో ఉండటం వలన ముక్తి కలుగుతుంది కాని,కేవలం
తిండికై పాకులాడువారు ముక్తి పొందలేరు అంటున్నారు.మనసులోని భేద భావాన్ని విడిచిన వాడే వేదాంత వేత్తయౌతాడు. ఆచరించని బోధనలు ఎన్ని చెప్పినా వ్యర్ధము అంటారు.
    "తన్ను తా గ్రహింప తారక యోగమౌ"అంతేగాని
"రాయి కొయ్య గొలువ రాదు ముక్తి"అంటారు. అలాటి పూజలు చేసి బాధలు పడనేల అంటారు బ్రహ్మంగారు.
"స్నానమందులేదు పానమందును లేదు
 మంత్ర తంత్రములను మహిమలేదు
 గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను"..139 ప.
ఇటువంటి భక్తి భక్తి కాదంటారు.మనిషిలో గుణం కదరాలి అప్పుడే ముక్తి అంటారు."
"మాన్యమైన కందిమల్లయ్యపల్లెలో
 స్ధిరనివాస మేరు పరచు కొంటి
 కూడియుంటి సాధ్విగోవిందమాంబతో
కాళికాంబ హంస కాళికాంబ"
   పుణ్యస్ధలమైన కందిమల్లయ్యపల్లెలో సాధ్విగోవిందమాంబతో నివాసముంటున్నాను అని తన భార్యగురించి అమె పాతివ్రత్యాన్ని కొనియాడినారు.ఉత్తమోత్తములెవరూ అర్ధాంగి గొప్పతనమును చెప్పరు.భార్యకు సమానగౌరవం ఇచ్చారు.
"కలమతాల జాఢ్యములలోన తపియించు
దీనజనులసేద తీర్చువాడ
మానవుండె ధరను మాధవుండను వాడ"
"మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు
 హితము గూర్పవలయు నెల్లరకును
 హితము గూర్పగలేని మతము మానగవలె
 కాళికాంబ హంస కాళికాంబ"
           ఎది మతమో వివరించారు.హితముగూర్చేదేమతము హింసను గుర్చేది మతము కాదంటారు నిర్మొహమాటంగా.
       బ్రహ్మంగారి కవిత్వం ఈ రీతిగా సాగింది కనుకనే
బ్రహ్మంగారి కవిత్వం"గండ్రగొడ్డలి కవిత"అంటరు డాక్టర్ సి నారాయణరెడ్డి గారు.ఇంకనూ "మానవ మనో మర్మజ్ఞులైన బ్రహ్మంగారు కళ్ళముందు కదలాడే రకరకాల మనుషులను మనస్తత్వాలనూ తూర్పారబట్టి చూపారు. సంకుచిత కులమత దృక్పధాలను చావుదెబ్బకొట్టారంటారు."...
డాక్టర్ టి.గౌరీశంకర్ తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్. వారిమాటలు చూద్దాం...
       "బ్రహ్మంగారు క్రియాశీలి చెప్పిందే చేసేవారు,చేసిందే చెప్పేవారు.ఆ చెప్పేవిషయం ఎవరికి చెప్పదలచుకున్నారో వారికి చెరడానికి తమ రచనను ఒక సాధనంగా వినియోగించు కొన్నారు.అందుకే బ్రహ్మంగారు మొదట కార్యకర్త అ తర్వాతే కవి. కవిగా ఆయన దేశికవితామార్గాన్ని ఎన్నుకొని జనపదుల నాలుక కొసలపై నటింపజేయడానికి అనువైన గేయప్రక్రియనే ఆశ్రయించారు..... తన రచనల్లో భావతీవ్రతపదజాలంతో సాంఘీక ోద్యమాన్ని కదం తొక్కించారు.అని అన్నారు.
"కొండవీటి వేంకట కవిగారి"మాటలు చూద్దాం....
    "పూర్వకవు లెవ్వరూ భార్య పేరు చెప్పలేదు.ఈ స్వామి"కూడియుంటి సాధ్విగోవిందమాంబతో" ఇంతేగాదు ఈమె పేరుతో గోవింద వాక్యములు చెప్పుట గమనార్హం..........'కులమతాల జాడ్యములలోన తపియించు'దీన జనుల సేద దేర్చువాడ ' అని ముగించడంలో గలప్రత్యేకత పాఠకులు గ్రహించాలి.అని అన్నారు.
     కారణ జన్ముడు కలియుగోద్ధారకుడైన బ్రహ్మంగారు.
శ్రీ కాలజ్ఞాన ద్రష్ట,స్రష్ట,అభ్యుదయకవి,కులమత రాహిత్య సమసమాజవాది.ఆచరణశీలి,భోధగురువు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 414 వ జయంతి మహోత్స
వాలు ౦5.11-2022 .కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లె లో త్రయాహ్నిక
కార్యక్రమాలు నిర్వహించనున్నారు.భక్తులు పాల్గొని చూచి తరించి తీర్ధ ప్రసాదాలుగొని స్వామి వారి కృపకు పాత్రులగుదురుగాక. శుభంభూయాత్.
            క్రీ.శ1608 సం కీలక నామసంవత్సరం కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు జన్మించారని పరిశోధకులు చరిత్రకారులు నిర్ణయించారు.పలువురు పలు అభిప్రాయలను వెవిబుచ్చినారు. ప్రముఖ పరిశోధకులు కొడాలి లక్ష్మీ నారాయణ గారు నాటి చారిత్రకాంశాలను కాలజ్ఞానం లో చెప్పిన అంశాలను పరిశీలించి క్రీ.శ.1608సం గా నిర్ధారించారు. అదే ప్రామాణికంగా కందిమల్లాయపల్లె పీఠాధిపతులు ప్రాతిపదికగా తీసుకుని అనుసరిస్తున్నారు.
(ఈరోజు బ్రహ్మంగారి414వ ఆవిర్భావ దినోత్సవం.

కామెంట్‌లు