కవితా కల్పవల్లి దేవులపల్లి;-పిల్లి హజరత్తయ్య, సింగరాయకొండ--ప్రకాశం జిల్లా,9848606573
ఆయన కవిత్వం
గుండెలోని ఆర్ద్రతను కదిలించేలా 
తన్మయత్వంలో మునిగి తేలేలా చేస్తుంది

ఆయన బావుకవిత్వం 
చల్లని గాలి తమ్మెరలా 
తనువును పులకరింపజేస్తుంది

ఆయన తెలుగు పదం 
అమ్మ చేతిలో నేతి నైవేధ్యములా 
కమ్మని రుచులను పంచుతుంది

ఆయన భావం
ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే విహాంగములా
రసజ్ఞుల ఎదన మీటుతుంది

ఆయన సంగీత మాధుర్యం 
మృదుమధుర గీతములా 
శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది

ఆయన సాహిత్య చాతుర్యం
ఆకాశమును పొడిచిన అరుణారుణ తారలా 
దేదేపమాన్యంగా వెలుగొందుతోంది

ఆయన ఆత్మానుభూతి
పూలు వాడని వసంతరామములా 
నిత్యతోరణమై కళకళలాడుతుంది

ఆయన పాటలోని సారళ్యం 
పట్టు పరికిణలోని సింగారములా
తెలుగునాట గోరింటై పూచింది

ఆయన పాటలోని లాలిత్యం 
పల్లి గూటికి వచ్చిన పండుగలా 
తెలుగులోకాన్ని ఓలలాడించింది

ఆయన పాటలోని ప్రకృతి సౌందర్యం 
చందమామలోని చల్లదనములా 
ఆకులో ఆకులా పువ్వులో పువ్వులా పూసింది

ఏ సుందర దృశ్యాన్ని చూసినా 
ఎలాంటి మనోహర కవితను చదివినా 
మనో వీధిలో ఆయన స్మృతి తళుక్కుమంటుంది

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నా 
నాకు గదులు లేవు, నాకు ఉషస్సులు లేవన్నా 
కవితా కల్పవల్లికే చెల్లింది

ఇది నా స్వీయ రచన అనువాదం కానీ అనుకరణ కానీ కాదు


కామెంట్‌లు