కూరగాయల ధరలు శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098.,
 👌ఆకాశము నంటిన
కూరగాయల ధరలు!
     ప్రియముగా నున్నాయి!
ఆత్మబంధువు లార!
( ఆత్మబంధు పదాలు., శంకరప్రియ., )
👌"శాకము"లనగా కూరగాయలు! పచ్చగా నుండునవి! కనుక, "హరిత వర్ణములు"! అవి, అరుచిని చెరచునవి! కనుక "శిగ్రు" లని  పేరు! భోజనార్హము లైన.. ఆకులు, పువ్వులు, కాయలు, కాడలు, కొమ్మలు, వేళ్ళు.. మున్నగు వాటికి; "శాకము"లని పేరు!
     "శక్యతే భోక్తుమనేన ఇతి శాకము"! అని, అమరకోశము నిర్వచనము ప్రకారం; దీనిచేత భోజనము చేయుటకు శక్యమౌను! కనుక, "శాకము" లని, పేరు!
👌తోటకూర, గోంగూర, పొన్నగంటి కూర, బచ్చలికూర, కెబేజీ పువ్వు, అరటి పువ్వు.. మున్నగు నవి; "ఆకుకూరలు"!  కంద దుంప, చేమ దుంప, పెండలం దుంప, చిలగడ దుంప, ముల్లంగి, బీట్రూటు. మున్నగునవి "దుంపల రకములు!  
     వంకాయ, బీర కాయ, బెండ కాయ, దొండ కాయ, పొట్ల కాయ, కాకర కాయ, చిక్కుడు కాయ, అరటి కాయ, చింత కాయ, మామిడి కాయ, టమాటా, ములగ కాడ... మున్నగు నవి; "కాయ గూరలు"! అట్లే, ఆనబ కాయ, గుమ్మడి కాయ, పనస కాయ.. మున్నగునవి; కాయ గూరలలో.. "పెద్ద కాయలు"! 
👌శాకాహారులు.. భుజించే కూర గాయలకు.. గిరాకీ పెరిగింది! వాటి ధరలు.. విపరీతము గా పెరిగి, ఆకాశము నంటాయి! అందు వలన, కూరగాయలు... మధ్యతరగతి కుటుంబీకులకు; సామాన్యులకు అందుబాటులో లేకున్నాయి!
    ఈ నేపథ్యంలో.. దత్తాంశము:   
 “కోర మీసలు దువ్వె కూరగాయల ధర”! యనెడు దానికి పూరించిన పద్య రత్నము!
🚩సీస పద్యము🚩
         కోరమీసలు దువ్వె కూరగాయల ధర
…...”కూరగాయ”న బుసకొట్టు చుండె!
        వంగకాయల కొన బెంగపట్టున గద,
……బీరకాయలు కొను దారి లేదు!
         బెండకాయలు కొన తాండవించెను గాదె,
  …దొండకాయలు కొన పండబారె!
         పొట్లకాయలు గన మూరెడు ధర గన, 
……బారెడు జనులంత బావురనగ!
         కాకర వేసవి "కాకరు” డయ్యెను
……కంద, చేమయు, మన కందవాయె!
         ఆనప, సొరకాయ లంబర మంటగ,
……మునగ ముల్లంగియు మునుపె లేవు!
         దోస చేదెక్కెను, దుంప ధరలుజూడ,
…..దుంపతెంచుచు నుండి దొరకవాయె!
         గుమ్మడి చూడగ   గుండె గుభేలను
…..పుల్ల వంకాయలు పులుపు దేరె!
         చేతికి చిక్కవు చిక్కుడు నసపెట్టు,
…..పచ్చిమిర్చి, పనస రెచ్చిపోయె
        ఆకుకూరలు కొన  ఆకాశ మంటెను
…...శాకముల ధరలు చంపుచుండె!
     🚩తేటగీతి
       కార్తిక మ్ముపవాస దీక్షల సమయము,
       కోర నరులు శాకాహార కూరలంత!     
       ధరలు పెరిగె దారుణముగ ధరణిఁ జూడ
       విఫణి  యందున కొనలేని విధము గనుమ!
 (👌వివరణ: కు + ఉరగాయ = కూర గాయ, అనగా..దుష్టమైన సర్పము వలె; కాకర = సూర్యుడు;పుల్ల వంకాయలు= టమాటాలు.,)
( రచన: "సాహితీ బంధు" తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.,)

కామెంట్‌లు