చూడలేకున్నా! ;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పంజరములోని పక్షులు
రెక్కలువిరిచిన చిలుకలు
కట్టిపడేసిన పశువులు
బాధతోమొరుగుతున్న కుక్కలు కనబడుతున్నాయి

చిల్లిగవ్వలేని జేబులు
పస్తులున్న ఖాళీకడుపులు
చినిగిపోయిన వస్త్రాలు
మాసిపోయిన గడ్డాలు కనబడుతున్నాయి

చేతులులేని అంగవిహీనులు
కళ్ళులేని కబోదులు
కాళ్ళులేని అవిటోల్లు
తెలివిలేని పిచ్చోల్లు కనబడుతున్నారు

వినపడని చెవిటోళ్ళు
మాట్లడని మూగవాళ్ళు
బావిలోని కప్పలు
ఎండినచెరువులోని చేపలు కనబడుతున్నాయి

పనులులేని నిరుద్యోగులు
పైసాలులేని పేదవారు
మూతబడ్డ కార్ఖానాలు
తాళాలేసిన కుటీరాలు కనబడుతున్నాయి

ప్రేమలేని జీవితాలు
సుఖంలేని కాపురాలు
శ్రామికుల చెమటలు
చెమటోడ్చే శ్రామికులు
ఉద్యోగుల కష్టాలు కనబడుతున్నాయి

కట్టేసిన చేతులు
బంధించిన కాళ్ళు
బక్కచిక్కిన శరీరాలు
సంస్కారంలేని శిరోజాలు కనబడుతున్నాయి

జేబులుకొడుతూ దొరికినదొంగలు
వళ్ళునమ్ముకుంటున్న వనితలు
లంచంతీసుకుంటు పట్టుబడ్డతిమింగిలాలు
కల్తీసరుకులమ్ముతున్న వ్యాపారులు కనబడతున్నారు

చాచే చేతులు
తెరుచుకున్న నోర్లు
ఏడుస్తున్న కళ్ళు
వంగిపోయిన నడుములు 
కనబడుతున్నాయి

కళ్ళెత్తలేకున్నా
ముందుచూడలేకున్నా
భరించలేకున్నా
బాధపడుతున్నా

కరుణచూపండి
కష్టపడేవారినిచూడండి 
తిప్పలుతీర్చండి
కన్నీరు తుడవండి


కామెంట్‌లు