నీవే నా వెన్నెల నక్షత్రం;-: ది పెన్.
 ఈరోజు ఎలాగైనా కలుద్దాం రా..చాలా రోజులైంది..చూడాలని ఉంది..సంతోష్ వాట్సప్ లో పంపిన ఈ మెసేజ్ చూడగానే స్వప్న ఆనందానికి అవధులు లేవు.‌.తప్పకుండా కలుద్దాం..నిజానికి నేనే అడుగుదామనుకుంటున్నా..ఈ లోగా నువ్వే అడిగేశావ్..ఎలా‌రా అసలు..నా మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టి, సరిగ్గా నేనేమనుకుంటానో అదే చెబుతావ్, అదే చేస్తావ్..అందుకేనేమో నువ్వంటే ఇంతలా పడిచస్తున్నారా బాబు..అంటూ సమాధానం ఇచ్చేసింది..సరే అయితే సాయంత్రం మనం‌ ఎప్పుడూ కలుసుకునే చోటుకి వెళదాం..సిద్ధంగా ఉండు..అని సంతోష్ చెప్పడంతో క్షణాలు యుగాలుగా ఆ సమయం కోసం ఎదురుచూస్తోంది స్వప్న..
సాయంత్రం అయ్యింది..ఇద్దరూ కలిసి చల్లగాలిని ఆస్వాదిస్తూ వాహనంపై ఊరు చివరకు సాగిపోతున్నారు..ఆ దారిలో అవకాశం వచ్చినప్పుడల్లా సంతోష్ చేసే చిలిపి పనులకు లోలోన తన్మయత్వం చెందుతున్నప్పటికీ పైకి మాత్రం "నీ చేతులస్సలు కుదురుండవా..ఎవరైనా చూస్తే పరువు పోతుంది..ఆ పని‌ మానేసి ముందు రోడ్డు చూసి నడుపవా ప్లీజ్" అంటూ సిగ్గుతో కూడిన భయాన్ని వ్యక్తం చేస్తోంది స్వప్న..
కాసేపటికి చీకటి‌పడిపోయింది..సరిగ్గా అప్పుడే వారూ గమ్యానికి చేరుకున్నారు..ఆ రోజు‌ మాత్రం ఆ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తోంది..చుట్టూ వెన్నెల పరుచుకుని ఉంది..చల్లగాలి హాయిగా ఒంటికి తగులుతోంది..అప్పుడు గుర్తొచ్చింది వారికి ఆ రోజు నిండు పౌర్ణమి అని..ఇద్దరూ ఒకేసారి ఆకాశంలోకి చూశారు..నక్షత్రమాల దగదగా మెరిసిపోతోంది..ఆ ప్రకాశంలో స్వప్న పాలరాతి శిల్పంలా కనిపిస్తోంది సంతోష్ కి..
ఎంత అందంగా ఉందో కదా ఈరోజు వాతావరణం..అంటూ సంతోష్ భుజాలపై తలవాల్చింది స్వప్న..ఆమె నుదురును ముద్దాడుతూ..నీ కన్నా కాదులే రా..అంటూ గట్టిగా హత్తుకున్నాడు సంతోష్..ఆకాశంలోకి చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరూ..ఆ‌ మాటల మధ్య స్వప్న కళ్లల్లో నుంచి వస్తున్న వేడి కన్నీరు సంతోష్ ని కలవరపాటుకు గురిచేసింది.. ఆమె కళ్లలోకి చూస్తూ ఏమైంది రా..ఏంటీ కన్నీరు..అని అడిగాడు.." ఏం లేదురా..ఆకాశంలో ఆ చందమామను చూడు..నక్షత్రాలను ఎప్పుడూ తన పక్కనే పెట్టుకుంటుంది..మనం కూడా ఎప్పటికీ అలానే ఉంటామంటావా..ఉండగలమంటావా..నాకైతే‌‌ నీతో ఇలా‌నే ఉండాలని ఉంది..ఈ క్షణం ఇలా‌ ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది"...అని స్వప్న అంటుంటే సంతోష్ కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి..
"నా గుండె ఆకాశంలో నీవే వెన్నెల నక్షత్రానివి..అమావాస్య చీకటిలోనైనా ఆ చంద్రుడు నక్షత్రాలను వదిలివెళతాడేమోగానీ..నా ఊపిరి ఉన్నంత వరకూ నీకు నేను దూరం‌ కాను..ఒకవేళ మన‌ తనువుల మధ్య ఎడబాటు వచ్చినా..మనసులు ఒకే చోట పెనవేసుకుని ఊసులాడుకుంటాయి.. కాలం..మనుషులు‌‌ మనల్ని వేరుచేసినా..నా హృదయం నీ చెంత..నీ హృదయం నా చెంత శాశ్వతంగా పెనవేసుకునుంటాయి..ఇది బ్రహ్మ రాయని రాత..మన ప్రేమ గీసిన గీత." అంటూ తన ఒడిలో తలవాల్చిన స్వప్నకు ఓదార్పునిస్తూ..ఆకారంలోకి  చూస్తూ ప్రాణాలొదిలేశాడు సంతోష్..అప్పటికే కన్నుమూసిన స్వప్నను నక్షత్ర మాలలో కలుసుకోవాలని.!

కామెంట్‌లు
THE PEN చెప్పారు…
మొలక..నిర్వాహకులకు కృతజ్ఞతలు.