సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 విలంబము...విలంభము
    ****
"ఆలస్యం అమృతం విషం "అన్నారు పెద్దలు. ఒకటి రెండు నిముషాల విలంబం  జీవితాన్ని తల్లక్రిందులు చేయడం,అనుకున్నవి చేయి జారిపోవడం చూస్తూ ఉంటాం.
సోమరిని చేసే లక్షణాల్లో విలంబము ఒకటి.దానితో సహవాసం చేస్తే అనుకున్నవి ఏవీ సాధించలేము.
విలంబము వల్ల ఒక్కోసారి జీవితాంతం బాధ పడే సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి.
అంతటి ఇబ్బంది కలిగించే విలంబము అంటే ఏమిటో చూద్దాం...ఆలస్యము,కాలహరణము,జాగు,జాప్యము,తడవు,స్త్యారము,తేమాసము, జాలము లాంటి అర్థాలు ఉన్నాయి.
అలాంటి విలంబము వలన ఉదాత్తముగా వ్యవహరించే అవకాశము పోగొట్టుకుంటాము..
కాబట్టి విలంబమును వీడాలి. విలంభము అనే మంచి బుద్ధి కలిగి జీవించాలి.
ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, వీరులు, మహనీయులు  చేసిన ప్రాణ విలంభము వల్ల ఈ నాటికీ ప్రాతఃస్మరణీయులయ్యారు.మనకు ఆదర్శప్రాయులుగా నిలిచారు.
అంతటి ప్రాణ త్యాగము చేయకపోయినా మనకు ఉన్న దాంట్లో కొంతైనా విలంభము చేసి మానవతా హృదయం కలిగిన వ్యక్తులుగా జీవించుదాం.
మరి విలంభమునకు గల అర్థాలను పరిశీలిద్దాం...త్యాగము,ఉదాత్తము,చాగము,తేగము,పరిత్యాగము,వితరణము,ఉజ్జగింపు,ఉత్సర్గము,త్యజనము,విసర్గము నిర్యాతనము మొదలైన అర్థాలు ఉన్నాయి.
విలంబమును ఎల్లప్పుడూ దరిచేరనీయక పోవడం  చైతన్య శీలి లక్షణం.
అవకాశము వచ్చినప్పుడు ఎలాంటి విలంభమునైనా  చేయడానికి సిద్ధపడటమే మనసున్న మనిషి లక్షణం.

ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు