"ఆత్మీయ ఆలింగనం";-నలిగల రాధికా రత్న.
కాలమనే చెట్టు నీడలో.. .
స్వచ్ఛమైన బాల్యపు ఊహలతో....
చిగురులు తొడిగిన
కృష్ణ కుచేల స్నేహం
ఆనందాల లోగిలికి మధుర జ్ఞాపకం..!!

అరమరికలు ,అపార్ధాలు ఎరుగని
తైలధార లాంటి
కృష్ణ కుచేల స్నేహం
జీవితానికే నిండుతనం...!!

ఒక కంట కన్నీరు 
మరో కంట పన్నీరుతో భ్రమిస్తూ....
పరిభ్రమిస్తూ వుంటే ఆలోచనలలో....
మల్లె పొదలపై 
ఆరబెట్టిన వస్త్రంలాంటి 
కృష్ణ కుచేల స్నేహం
వికసిత జీవనానికి  ఆరోగ్యకరం..!!

ఏ అమృతమూ
తీర్చలేని దాహంగా .....
ఆత్మకు మాత్రమే 
అర్థమయ్యే మోహంగా 
సమయం చూసి దగ్గర చేరే..
స్మృతి పరిమళమైన
కృష్ణ కుచేల స్నేహం
మనో ఉల్లాసానికి  ఉత్ప్రేరకం...!!

తెలుగు వాచకంలో
దాచిపెట్టిన నెమలీకలా.
గురుకులంలో మొదలైన.....
కృష్ణ కుచేల చెలిమి కలిమి
అటుకుల మూటలో దాగిన
మేలిమి అనుభూతులను 
స్మృశిస్తూ...
తీపి జ్ఞాపకాలను స్మరిస్తూ.
మనసులను పిల్లిమొగ్గలు వేయిస్తూ..
"ఆత్మీయ ఆలింగనంతో"....
అజరామరం... అద్భుతం...!!


కామెంట్‌లు