*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 028*
 కందం:
*తల్లిని దండ్రిని సహజల*
*నల్లరి బెట్టినను వారలలుగుచు నీపై*
*నుల్లమున రోయు చుందురు*
*కల్లరి వీడనుచు ఁగీర్తి ఁగంద ఁగుమారా !*
తా:
కుమారా! తల్లిదండ్రుల ను, తోడబుట్టిన వారిని అల్లరి చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉండ కూడదు. అలా, అల్లరి, ఎగతాళి చేస్తూ ఉంటే, అటువంటి వారిని చూసిన వారు ఎవరైనా, వీళ్ళు మంచి వారు కారు అని మనసులోనే అసహ్యించు కుంటారు. అలా ఎవరైనా అసహ్యించుకోవడం నీ వంటి వారికి మంచిది కాదు ....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో, కన్నవారిని, తోడబుట్టిన వారిని తక్కువగా చూసే వారు కో కొల్లలుగా ఉన్నారు. ఇప్పటి యువత ఈ విధంగా పెడదారి పట్టడానికి, తమ పెద్దవారిని సరిగ్గా పట్టించుకోని ఇప్పటి పెద్దవారు ఒక కారణమైతే, మీడియాలో చూపించబడుతున్న విషయాల దుష్ప్రభావం ఇంకొక కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఒక్కటి మాత్రం నిజం. ఏమిటంటే, తన వారినే గౌరవించ‌లేని వాడు, తనను తాను ఎలాగూ గౌరవించుకోలేడు. అలాగే, సమాజంలో మిగిలిన గౌరవ భావంతో చూడలేడు. ఇక సమాజం కూడా ఇటువంటి వ్యక్తి కి గౌరవం ఇవ్వదు. అందువల్ల, మనల్ని మనం గౌరవించుకుంటూ, తోటివారిని, సమాజంలో మిగిలిన వారిని గౌరవంతో చూడ గలిగే మంచి మనసును, నడవడికను ఇవ్వమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు