కలలు కనకు - వలలో పడకు (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  ఒక ఊరిలో ఒక పాప వుండేది. ఆ పాప చూడ్డానికి చక్కని చుక్కలెక్క ముచ్చటగా వుండేది. కానీ ఆ పాప తనను చూసి ఏ రాకుమారుడో సంబరపడి పెళ్ళి చేసుకుంటాడని, తాను ఆ దేశానికి రాణిని అవుతానని ఎప్పుడూ కలలు కంటా వుండేది. కానీ రాణి కావాలంటే ఈ అందం సరిపోదు. ఏడేడు పదునాలుగు లోకాల్లోనూ తనంత అందగత్తె ఎవరూ వుండగూడదు అనుకునేది. దాంతో ఒకటే దిగులు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో మూలికలు, మందులూ తీసుకోనొచ్చి వంటికి పూసుకునేది. అందంగా మెరిసిపోతావంటే ఎవరు ఏమి చెయ్యమన్నా చేసేది. అది చూసి వాళ్ళ అమ్మానాన్నా ''పాపా... మనమెక్కడ, రాజకుటుంబం ఎక్కడ. కనీసం కన్నెత్తి చూడటానికి గూడా వీలు కాదు. అనవసరంగా కలలు కనడం మానేసి వచ్చిన సంబంధాల్లో మంచిది చూసి పెళ్ళి చేసుకో'' అని నెత్తీనోరు కొట్టుకోని చెప్పినారు. కానీ ఆ పాప వాళ్ళ మాటలు కొంచంగూడా చెవికి ఎక్కించుకునేది కాదు. అమ్మా నాన్నలకు గూడా తెలీకుండా మంది మాటలు వినిఏవేవో తెచ్చుకోని పూసుకునేది.
ఒకరోజు ఆ వూరికి ఒక మోసగత్తె వచ్చింది. ఆమె ఎవరికి ఏ బాధ వున్నా తన దగ్గరున్న మాయలతో పోగొడతానని కనిపించిన వారందరికీ పదే పదే చెప్పసాగింది. ఎప్పుడూ ఒక గదిలో కూచోని, పెద్ద కుంకుమబొట్టు పెట్టుకోని, మొగమంతా పసుపు పూసుకోని ఏవేవో పూజలు, యాగాలు చేసి అందరినీ పిలిచి మీకు ఎటువంటి బాధలు వున్నా తొలగిపోతాయి, తీసుకోండి అంటా చేతిలో విబూది పెడతా వుండేది. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం ఆ పాపకు తెలిసింది. దాంతో కిందామీదా పడతా వురుక్కుంటా ఆ మోసగత్తె దగ్గరకు వచ్చింది. ఆమె కాళ్ళమీద పడి ''నేను పాలరాయిలెక్క నిగనిగా మెరిసిపోవాల, చందమామలెక్క ధగధగా వెలిగిపోవాల. ఈ భూమ్మీద నా అంత అందగత్తె ఎక్కడ వెదికినా కనబడగూడదు. అలా చేయగలవా'' అని అడిగింది.
దానికి ఆమె కాసేపు ఆలోచించినట్టు నటించి ''ఆ... చేయగలను, కానీ ఈ విషయం చానా గుట్టుగా వుంచాలి. ఎంతగా అంటే నువ్వు ఈ పది రోజులు ఎక్కడికిపోతావున్నావో నీ కాలికి వేసుకున్న చెప్పుకూ తెలియగూడదు. నువ్వు ఏం పూజలు చేశావో నుదుటన వున్న బొట్టుకూ తెలియగూడదు. అలాగే దీనికి బాగా డబ్బు కావాలి. ఏం సరేనా'' అనింది.
దానికా పాప ''ఓ.... దానికేం.... ఎంత కావాలంటే అంత తీసుకో... ఎన్ని పూజలైనా చేసుకో. కానీ నిలువెత్తు బంగారాన్ని నన్నూ పక్కనపక్కన నిలబెట్టి నీకేది కావాలో కోరుకో అంటే... ఈ భూమ్మీద పుట్టిన ఎవరైనా సరే నేనే కావాలి అంటా నా చేయి అందుకోవాలి. అలా తయారు చేయాలి సరేనా'' అనింది.
సరే అని ఆరోజునుంచీ రోజూ ఆ పూజలని, ఈ పూజలనీ రోజుకో పదివేల వరహాలు గుంజసాగింది. ఆ పాప వాళ్ళ అమ్మానాన్నకి తెలీకుండా తనకు చిన్నప్పటి నుంచీ అమ్మా నాన్నలు కొనిపెట్టిన ఒకొక్క నగా అమ్మేసి ఆమె చేతిలో డబ్బు పెట్టసాగింది.
ఆ పాపకు వరుసకు బావ అయ్యే ఒక పొట్టెగాడు వాళ్ళింటికి దగ్గరలోనే అదే సందులో వుంటాడు. వానికి ఆ పాపను చేసుకోవాలని ఒకటే కోరిక. పెద్దవాళ్ళతో గూడా అడిగించినాడు. కానీ ఆ పాప 'చేసుకుంటే ఈ దేశంలో వున్న ఏదో ఒక యువరాజునో, పెద్ద జమీందారునో చేసుకుంటా గానీ అందరిలాగా అల్లాటప్పా సంబంధాలు చేసుకోనని' మొగం మీదే కొట్టినట్టు చెప్పేసింది. కానీ ఆ పొట్టెగాడు ఏమీ బాధపడలేదు. 'కలలకేం కలకాలం వుంటాయా... ఏదో ఒక రోజు నేల మీదకి దిగవలసిందే గదా' అనుకుంటా ఎదురు చూడసాగినాడు.
ఆ పొట్టెగాడు ఒకరోజు ఈ పాప దొంగచాటుగా పోతా వుంటే చూసినాడు. 'ఇదేందబ్బా.... ఒక్కతే ఇన్ని నగలు వేసుకోని పోతా వుంది అనుకోని చప్పుడు కాకుండా ఆ పాప వెనుకెనుకే దాక్కుంటా దాక్కుంటా పోయినాడు. అది ఆఖరి రోజు. ఆ మోసగత్తె ఆ పాపతో ''చూడు పాపా... నీ ఒళ్ళు బంగారంలా మెరవాలంటే నువ్వు చివరిరోజు వంటి మీదంతా బంగారం వేసుకోని రావాల. పూలదండ కట్టినప్పుడు పూలవాసన దారానికి గూడా సోకినట్టు ఆ బంగారం రంగు కొంచం కొంచం ఈ పూజలో నీలోకి చేరడం మొదలు పెడుతుంది. పూజంతా అయిపోయేసరికి నిన్ను చూసి నువ్వే నమ్మలేవు. మెరుపుతీగలెక్క మారిపోతావు'' అంటా వూరించి... వూరించి చెప్పింది. దాంతో ఆ పాప ఆమె నగలే గాక, వాళ్ళ అమ్మ నగలు గూడా వేసుకోని బైలుదేరింది.
ఆ మోసగత్తె పక్క వూరిలో నున్న ఒక పెద్ద దొంగతో ''నా దగ్గర ఒక పాప వుంది. చూడ్డానికి చక్కని చుక్కలాగుంటాది. నువ్వు గనుక ఒక లక్ష వరహాలు నా చేతిలో పెడితే ఆ పిల్లను నీ చేతిలో పెడతా... ఏం సరేనా'' అనింది. వాడు సరేనని ఆ పిల్లను ఎత్తుకుపోడానికి గుర్రంబండి తీసుకోని అక్కడికి వచ్చేసినాడు.
పాపం... ఆపిల్లకు అదంతా తెలీదు గదా... దాంతో అమాయకంగా ఇంటిలోనికి అడుగుపెట్టింది. ఆ మోసగత్తె ఆపాప నగలన్నీ తీపిచ్చి దేవుని పటం ముందు పెట్టి పూజ మొదలుపెట్టింది. అంతలో వెనుకనుంచి దొంగ వచ్చి ఆ పాప మీద మత్తుమందు చల్లినాడు. అంతే... ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఆ పాప వెనకాలే వాళ్ళ బావ వచ్చినాడు గదా... ఇదంతా కిటికీలోంచి చూసి అదిరిపన్నాడు. ''అమ్మో... ఇంకాసేపు ఆగితే ఈ పిల్ల ఎవరికీ దక్కదు'' అనుకోని వురుక్కుంటా వూరిలోనికి పోయి కనబన్నవాళ్ళకంతా జరిగింది చెప్పినాడు. అంతే... జనాలంతా తలా ఒక కట్టె తీసుకోని వురుక్కుంటా వచ్చినారు. అప్పటికే ఆ దొంగ ఆ పాపను ఎత్తుకోని పోయి గుర్రం బండిలో పెట్టినాడు. అది చూసి జనాలు కోపం పట్టలేక ఇద్దరినీ పట్టుకోని కిందామీదా యేసి చావగొట్టినారు. నున్నగా గుండు గీసి గాడిదల మీద ఎక్కించి వూరు వూరంతా తిప్పి రాజభటులకు అప్పగించినారు.
అందరూ ఆ పాపను పట్టుకోని ''మాయలు లేవు, గీయలు లేవు. అన్నీ వుత్తుత్తివే. నీలాంటి అమాయకులు వున్నంత కాలం ఇలాంటోళ్ళ ఆటలు సాగుతానే వుంటాయి. ఇలా తిక్క తిక్క ఆలోచనలతో కలలు కనడం మాని ఈ లోకంలోనికిరా. నిన్ను గనుక ఆ దొంగసచ్చినోడు ఎత్తుకోని పోయింటే ఇప్పటికల్లా నీ బతుకు నాశనమయ్యేది. నువ్వు కాదన్నోడే మనసులో పెట్టుకోకుండా నిన్ను కాపాడినాడు'' అంటా బాగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినారు. దానితో ఆ పాప సిగ్గుపడి ''ఇంగో సారి ఇలాంటి పొరపాటు చేయను. వుత్తుత్త కలలు కంటా బతుకు నాశనం చేసుకోను. ఐనా కళ్ళల్లో పెట్టుకోని కాపాడే నా బావ నాకు తోడున్నంతకాలం ఇంక నన్నెవరూ ఏమీ చేయలేరు'' అంటా వాళ్ళ బావనే పెళ్ళి చేసుకోనింది.
**********

కామెంట్‌లు