క్రిస్మస్;-....జాధవ్ పుండలిక్ రావు పాటిల్,భైంసా, సెల్ నెంబర్ 9441333315

 ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలవారు వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు. ఎవరి పండుగ ప్రాధాన్యత వారిదే. పంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. క్రిస్మస్ పండుగ  క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్25వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగను 24వ తేదీన క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే అని మూడు రోజులు జరుపుకుంటారు.
క్రైస్తవుల సంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల శాలలో , పశువుల మధ్య జన్మించాడని తెలుస్తోంది. జీసస్ జన్మించగానే మేరీ మాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున కొట్టంలోనే వలసి వచ్చిందని పవిత్ర గ్రంథం బైబిలు చెబుతున్నది. జీసస్ పుట్టిన రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో అందరూ కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశము నుంచి గొర్రెల కాపర్ల ముందు దిగి వచ్చాడు. ఆ దేవదూత వెలుగులకు గొర్రెల కాపరులు భయపడ్డారు. అప్పుడు దేవదూత గొర్రెల కాపరులతో ఇదిగో భయపడకండి మీకు ఒక ఆనందకరమైన శుభవార్త చెబుతాను అన్నాడు. ఈరోజు బెత్లహేంలోని ఒక్క పశువుల కొట్టంలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయన అందరికీ ప్రభువు రక్షకుడు. ఒక్క పసికందు గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఉన్న దాన తొట్టెలో పడుకొని ఉన్నాడు. మీకు ప్రభువు ఆనవాలు. దేవదూత ఈ విధంగా చెబుతుండగా పొలం అంతా దేవదూతలతో నిండిపోయింది. దేవదూతలంతా జీసస్ను కీర్తిస్తూ గీతాలు ఆలపించి మాయ మయ్యారు. వెంటనే గొర్రెల కాపరులందరూ  దేవదూత పాకకు వెళ్ళినారు. తొట్టెలో ఉన్న పసికందును చూశారు. దేవదూత చెప్పిందంతా నిజమని నమ్మినారు.
ఈ విధంగా రెండు వేల సంవత్సరాల పూర్వం డిసెంబర్ 24వ తేదీ సగం రాత్రి ఏసుక్రీస్తు జన్మించాడు. అందువలన మరునాడైనా 25వ తేదీన క్రైస్తవులందరూ  క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇండ్లను, చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. క్రిస్మస్ కిందటి రోజు రాత్రి శాంతా క్లాజ్ గగనం నుండి ధ్రువపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు. పండుగ రోజు వెదురు బద్దలతో, రంగు రంగుల కాగితాలతో ఒక నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద అలంకరిస్తారు . ప్రతి ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. చర్చికి వెళ్లి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. గీతాలు ఆలపిస్తారు. బంధువుల, స్నేహితుల ఇండ్లకు వెళ్లి ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు చెబుతారు. పేదలకు వస్త్రాలు, బియ్యం, డబ్బులు దానం చేస్తారు.
ఇటువంటి ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగ ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పండుగను సంతోషంగా జరుపుకోవాలని రెండు రోజుల సెలవు మంజూరు చేసింది.

కామెంట్‌లు