సునంద భాషితం ;--వురిమళ్ల సునంద, ఖమ్మం
 నికరము...నికారము 
   *****
నికరముగా ఉన్న మనసే  గొప్ప మందిరం. అందరితో గౌరవం పొందే శ్రేష్ఠమైన హృదయ సంస్కారం.
మాటల్లో,చేతల్లో  నికరముగా ఉండే వ్యక్తి ఎక్కడైనా సరే మంచి పేరు తెచ్చుకోగలడు.
నికరము వ్యక్తి యొక్క ప్రవృత్తిని ప్రవర్తనను పూవుకు అబ్బిన తావిలా గుబాళింపజేస్తుంది.
 ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క సుగుణాల రాశిగా చెప్పుకోవచ్చు.
మామూలుగా అయితే ఈ పదాన్ని కుదురుగా ఉండటాన్ని, ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది కానీ నిఘంటువు ప్రకారం నికరము అంటే శ్రేష్ఠము, ఉత్తమము, వరము, నాణ్యము,యోగ్యము,వాసి, పేరు, ప్రశస్తము, ఉత్కృష్టము, మిక్కిలి, శస్తము, మిన్న,శ్రేయము లాంటి అర్థాలతో పాటు రాశి,కుప్ప,పుంజము, మొత్తము మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి.
మనిషిగా  ఎప్పుడూ నికరము అయిన వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
కొందరికి నికరము కలిగిన వ్యక్తులంటే ఈర్ష్య అసూయ. అలాంటి వాళ్ళు ద్వేషముతో రగిలిపోతూ ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ నలుగురిలో  నికారము చేయడానికి ప్రయత్నం చేస్తారు.
వారు చేసే నికారము మనసును చాలా నొప్పిస్తుంది. కానీ అలాంటప్పుడే  సంయమము పాటించాలి.తద్వారా వ్యక్తి లోని యోగ్యత, మేలిమి బంగారం లాంటి మనీషితనం బయట పడుతుంది.నికారము చేసిన వారి బుద్ధి తెలుస్తుంది.
ఇంతకూ నికారము అంటే ఏమిటో చూద్దాం... అవమానము,అపకర్షము,అపమానము,తలవంపు,పరాభూతి,పరిభవము,చులకదనము అర్థాలతో పాటు మోసము,కౌటిల్యము, అపకారము,బూటకము,దుష్టము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నికరముగా ఉన్న పనులను చేద్దాం.
నికారము చేసే వికారమైన మనసున్న వారిని మన హృదయ ఔన్నత్యంతో క్షమిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు