సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
 వెనక తరముల వారి
చేతిరాతల వెతలు
కవితలై రాణించు
పథ విధము తెలియాలోయ్
అని రాస్తూ కలం కాగితం కొత్తగా కొనుక్కుంటున్న సరికొత్త కవులకు అంకితం అంటూ తెలుగు కవుల చేతిరాతల కవితా సంకలనం "పొయిట్రి వర్క్ షాప్"  ఏటుకూరి ప్రసాద్, యామిజాల ఆనంద్  నిర్వహణలో పురుడుపోసుకుంది. 
ముప్పై ఏళ్ళ క్రితం మొదటి సారి 112 మంది కవుల చేతిరాతల సంకలనం వెలువడింది. అప్పుడు ఏటుకూరివారొక్కరే ఆ సంకలనాన్ని తయారు చేశారు. ఏడాదిన్నర లోపలే ఆ ప్రతులన్నీ అయిపోయాయి. అనంతరం ఆ పుస్తకాన్ని పునర్ముద్రించడానికి కొందరు ముందుకొచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. చివరికి ఏటుకూరివారు, యామిజాల ఆనంద్ సంయుక్త కృషిలో ఇప్పుడీ పొయిట్రీ వర్క్ షాప్ పుస్తకం ఆర్ట్ పేపరుమీద చూడముచ్చటగా కనువిందుగా ముస్తాబై సాహితీ ప్రియుల ముందుకొచ్చింది.  
1862 - 1962 మధ్యకాలంలో అందుబాటులో ఉన్న 182 మంది కవుల చేతిరాతలతో వెలువడిన ఈ పుస్తకం అద్భుతమైనది. తెలుగువారనుకునే ప్రతివారి ఇంటా ఉండదగ్గ గొప్ప పుస్తకమిది.  చేతిరాతలలో స్పష్టత లేని భాగాలను పదాలను తీసేస్తూ ....(డాట్స్) లతో తెలియపరచిన సంపాదకులు కొందరి కవితలకు శీర్షికలు లేనందువల్ల వారే నామకరణం చేశారు. అటువంటి శీర్షికల పక్కన స్టార్ గుర్తు ఉంచారు. ఈ సంకలనం కవి చేతి రాతకూ, సంతకానికీ ప్రాధాన్యమిచ్చేదే కనుక వస్తువును పట్టించుకోలేదని సంపాదకులు చెప్పుకున్నా చాలా వరకూ ఆసక్తికర రచనలే కనిపించాయి. అసలింతమంది కవుల చేతిరాతలు సేకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. వారి కృషి అన్ని విధాల ప్రశంసనీయం.
గురజాడ అప్పారావు (1862 – 1915) గారి కవిత “పూర్నమ్మ” తో మొదలై కవి యాకూబ్ “వలస రుతువు” కవితతో పూర్తయిన ఈ ఆరు వందల పది పేజీల ఈ పుస్తకం గొప్పదనమేమిటంటే ప్రతి కవి ఫోటో, చేతిరాత, సంతకాలతో సింగారించుకోవడం విశేషం. ఎడం చేతివైపు పేజీలో కవుల చేతిరాతలు, కుడివైపు పేజీలో ముద్రిత కవితలు పొందుపరిచారు.
ఏటుకూరి ప్రసాద్ గారు “కీ నోట్” చదివితే అనేకానేక విశేషాలు తెలుస్తాయి.
ఒకచోట ఆయనిలా అంటారు -
“కొందరు కవుల తొలి రూపాల్లో కొట్టివేతలు గమనిస్తే ఓ అంశం తడ్తుంది. ఆ వాక్యాన్ని లేదా పద్యాన్ని ఓ గీతతో కొట్టేయ తగ్గ చోట్ల, అక్షరాలు కనబడకుండా ఉండేలా పది పదిహేను సార్లు కసిగా కొట్టేసిన సందర్భాలున్నాయి. బహుశ ఆ కవి – తొలి రూపం నచ్చక ప్రత్యామ్నాయాన్ని మనసులో ఆలోచించుకొంటూనే తొలి రూపాన్ని కొట్టేస్తూ – ఆలోచిస్తూ – సరైంది తట్టేదాకా కలం ఆడిస్తూనే ఉండి వుంటారు. అంటే కవి తన కవితను గురించి అన్ని వేళలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూంటాడనిపిస్తుంది”
ఇది నిజం, ఏ కవికైనా అనుకున్నదే తడవుగా రాయడం పూర్తి చేసినా మరొక్కసారి చదువుకున్నప్పుడు దాన్ని అవసరమైన చోట్ల మార్చి రాయడం అనేది సహజం.
1941 – 42 ప్రాంతంలో తల్లావజ్జల వారు గుంటూరులో సభలు జరిపి ఎందరో కవుల సంతకాలు సేకరించిన పుస్తకం ప్రస్తుతం రచయిత బ్నిం దగ్గర ఉండటం నేను చూశాను. దాన్ని ఓ పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని బ్నింగారికి సూచించాను కూడా.
తండ్రీకొడుకులు, అన్నాచెల్లెలు, వియ్యంకులు, ఇలా ఎందరో కవుల దస్తూరీలతో కూడిన ఈ పుస్తకంలో గురజాడ అప్పారావు, యాకూబ్ లతోపాటు గిడుగు వేంకట రామమూర్తి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆదిభట్ట నారాయణ దాసు, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, వాసిష్ఠ గణపతి శాస్త్రిస ఓలేటి పార్వతీశం, కొప్పరపు కవులు, తల్లావజ్జల శివశంకరశాస్త్రి, చలం, చింతా దీక్షితులు, రాయప్రోలు సుబ్బారావు, పట్రాయని సీతారామశాస్త్రి, పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి, పి.బి. శ్రీనివాస్, బోయి భీమన్న, తెన్నేటి సూరి, బెల్లంకొండ రామదాసు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, మల్లాది మంగతాయారు, శివసాగర్, త్రిపురనేని గోపీచంద్, గుర్రం జాషువా, ఆలూరి బైరాగి, ఇస్మాయిల్, గద్దర్, నగ్నముని, నిఖిలేశ్వర్, వరవరరావు తదితరుల చేతిరాతలన్నీ ఒక్కచోట చూసే మహత్తర భాగ్యం కల్పించిన సంపాదకులకు శిరసు వంచి వందనం సమర్పిస్తున్నాను.
బెల్లంకొండ రామదాసు రాసిన “అమ్మనడిగిన ఆఖరు ప్రశ్న” అనే కవిత ఎక్కువ పేజీలు కలది. ఇక చిన్న కవితగా చెప్పుకోవలసింది - చింతా దీక్షితులు గారు రమణ మహర్షి శీర్షికన రాసిన “నేనిదిపుట్టు నాస్థానంబు వెదక నేనిదిపడు నిది జ్ఞానపద్ధతిర భగవాన్ శ్రీ రమణ మహర్షి”  (1941)! చింతావారి చేతిరాతను పంపిన వారు బ్నిం.  కొందరు కవుల చేతిరాతలను సంపాదకులకు పంపించి తమ వంతు సహకారం అందించిన వారి పేర్లు కూడా ఈ పుస్తకంలో ప్రచురించడం ముదావహం.
182 మంది కవులలో నేను విన్న పేర్లు ఓ వందకు పైగా ఉన్నప్పటికీ నాకు తెలిసిన చేతి రాతల సంఖ్యను వేళ్ళ మీద లెక్కించొచ్చు. అంటే అంత తక్కువ చేతిరాతలే తెలిసిన నాకు ఈ పుస్తకం ఓ గొప్ప కానుకే. పైగా ఇందులో నా పేరు ఉండటం మరింత ఆనందం. కారణం, నేను ప్రముఖ నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్ గారి కవితను పంపడమే. ఆయన మా నాన్నగారి గురించి రాసిన కవిత అది.    
ఇంతటి భారీ అరుదైన అపురూపమైన పుస్తకాన్ని మరే భాషలోనూ లేనందువల్ల దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పుస్తకానికి పంపి అందులో చోటు సంపాదించేలా చేసే బాధ్యత ఈ పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారి చేతుల్లో ఉంది. అది గానీ సాధించగలిగితే తెలుగు కవితకు అంతర్జాతీయ స్థాయిలో పట్టం కట్టినట్టవుతుంది.
ఈ పుస్తకం ఖరీదు అయిదు వందలైనా కొని కళ్ళకద్దుకోవలసిన పుస్తకంగా ఎంతో పదిలంగా చూసుకోవలసిందే.
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం