ప్రజ్ఞానం బ్రహ్మ(విస్తరించిన పుస్తకం);-యామిజాల జగదీశ్
 ఆధ్యాత్మిక తత్వానికి చెందిన అనేకానేకాంశాలను మహనీయుల దగ్గర సేకరించి వాటికి కావలసిన పరిభాషను చెప్పడం కోసం రామనాథుడి నామధేయంతో పాఠకలోకానికి అందించిన పుస్తకమే ప్రజ్ఞానం బ్రహ్మ. రెండు దశాబ్దాల క్రితం అరచేతిలో ఇమిడేంత చిన్న పుస్తకంలో చెప్పిన వాటికే మరిన్ని కొత్త కొత్త విషయాలను జోడించి సమర్పించారిప్పుడు.
శ్రీరాముడు విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో మనసులో క సందేహం వచ్చింది. వెంటనే వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంత రాతరి వేళ వచ్చిందెవరని ఆశ్చర్యపడ్డాడు వశిష్ఠుడు.
ఎవరూ అని గట్టిగా అన్నాడు. దానికి రాముడు నేనే అన్నాడు.
నేనంటే ఎవరు అని తిరిగి ప్రశ్నించాడు వశిష్ఠుడు.
అది తెలుసుకోవాలనే ఇలా వేళ కాని వేళ తలుపు తట్టాను గురుదేవా అన్నాడు రాముడు. మాటిమాటికి మనిషి నోట నేను అనే మాట వస్తూనే ఉంది. కానీ ఈ నేను ఎవరనేది చిక్కు ప్రశ్నగా చిదంబర రహస్యంగా మిగిలిపోతూనే ఉంది. ముప్పై రెండు వేల శ్లోకాలతో తత్త్వబోధ చేసాడు. అదే యోగవాశిష్టం (పేజీ 59).
కానీ అన్ని శ్లోకాలు చదివే ఓపిక లేని వారి కోసం ఎనభై పేజీలలో పొందుపరచిన విషయాలు సమస్త మానవకోటి మనుగడకు ఉపయోగపడతాయి. అప్పుడప్పుడైనా పుస్తకం చదివేవారైనాసరే ఈ ప్రజ్ఞానం బ్రహ్మను చూస్తే చదవకుండా విడిచిపెట్టరు.
సత్యం, జ్ఞానం, అనంతం, సహస్రనామం, ద్వాదశాక్షరి మంత్రం, షోడశి మంత్రం, పంచదశాక్షరి మహా మంత్రం, తమసోమా జ్యోతిర్గమయ తదితర అంశాలతో సాగిన ఆరవ అధ్యాయం ఆసక్తికరంగా ఉది.
మనసు సరిగ్గా వికసించని వారిలో ఇంద్రియాలు సమన్వయంగా పనిచేయక వాటి ఇష్టం వచ్చినట్లు పని చేస్తాయంటూ మనస్సంటే ఏమిటో రెండు పేజీలలో చెప్పిన విషయాలు అవశ్య పఠనీయం.
ఉపనిషత్తుల సారాన్ని అర్థమయ్యేలా సులభ శైలిలో చెప్పిన రచయిత అభినందనీయులు.
సహనశీలి, సౌందర్యరాశి స్త్రీ అని, శారీరక బలాఢ్యుడు, శ్రమ కోర్చే ధీరుడు పురుషుడు అంటూ విడమరచి చెప్పిన తీరు, ఇందుకు సంబంధించి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ప్రస్తావించి వాటి భావాన్ని ఇవ్వడం బాగుంది.
శివతాండవం గురించి చెప్తూ సర్వప్రాణుల జడ పదార్థాల జనన మరణాలు అంటే సృష్టి లయలకు సంకేతమంటూ స్విట్జర్లాండులోని జెనీవా నగరంలో ఉన్న సెర్న్ పరిశోధనాలయంలో పరమాణువులపై జరిగిన పరిశోధనను ఉదహరిస్తూ అక్కడ ఆరున్నర అడుగుల ఎత్తయిన నటరాజ విగ్రహం ఉందనడం చదువుతుంటే రామనాథుడి అధ్యయనం ఎంత పట్టుగా సాగిందో అర్థమవుతుంది.
ఏదో పైపైన కొన్ని మాటలని కాకుండా ఎక్కడికక్కడ అవసరమైన శ్లోకాలు, వాటి అర్థాలు, సంబంధిత ఇతర అంశాలను పేర్కొనడం వల్ల ప్రతి పేజీ ఆసక్తిదాయకమే.
నేను చదవడమే కాదు, చాలా మంది చేత చదివిస్తున్నాను అన్న రచయిత్రి జలంధరగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ప్రతి పాఠకుడు ఈ పుస్తకాన్ని చదివాక మరికొందరితోనూ చదివిస్తే ఎంతో బాగుంటుందన్నది నా అభిమతం.
విషయం పెద్దది. ధర చిన్నదీ (ముప్పై రూపాయలు) అయిన ఈ పుస్తకం కోసం సంప్రదించవలసిన రచయిత రామనాథుడు ఫోన్ నెంబరు – 9441435087.   
-         


కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఇది అక్షర సత్యం అండి.