నటనకు వ్యాకరణం- బందా (17);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కైమోడ్పు నాటకంలో మహామహులంతా పాల్గొన్నారు. బందా, కందుకూరి రామ భద్రరా,వు వింజమూరి లక్ష్మి, పాలగుమ్మి విశ్వనాథం, విఠల్, నేను, నండూరి, రామ్మోహన్, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎన్.సి.వి జగన్నాథాచార్యులు భారీ తారాగణం. ఓలేటి గారు  మ్యూజిక్ ప్రొడ్యూసర్ కర్ణాటక హిందుస్తానీ బాణీలను ఆపోసన పట్టిన వాడు  ఆయన అలపిస్తూ ఉంటే  వీనులకు విందు చేసినట్టు ఉంటుంది. నా నాటకాలలో పాటలు, పద్యాలు పాడవలసి వస్తే వారే. కానీ వారు ఎప్పుడూ వేషం కట్టలేదు  దీనిలో మాత్రం వేశారు వేషం.  బడే గులామ్ అలీ ఖాన్ గళం వింటే ఎలా ఆనందిస్తామో వీరిదీ అంతే. పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీతజ్ఞుడు లలిత, లలిత శాస్త్రీయ జానపదాల ద్వారా ప్రసిద్ధుడు. ప్రపంచ ప్రఖ్యాత రచయితగా పేరు పొందిన పద్మరాజు గారికి స్వయంగా తమ్ముడు  విశ్వనాథం గారి సంగీత రూపకాలలో నేను గాత్రాన్ని ఇచ్చాను. ఓలేటి గారు చేసే యక్షగానాలకు సంగీత రూపకంలో వారు సహకరిస్తూ ఉంటారు. నండూరి విఠల్ తో పరోపకారార్థం నాటకంలో సుశీలా,మహంతి, నందిని సుబ్బారావు కుటుంబరావు పాల్గొన్నాం. నా మొదటి పౌరాణిక నాటకం 63వ సంవత్సరంలో ప్రతిజ్ఞ దీనిని  జీవీ కృష్ణారావు గారు రచించారు. దాన్ని బందా గారు నిర్వహిస్తూ వారు కృష్ణుడి వేషం నేను అర్జునుడి వేషం బివి రంగారావు రంగస్థల నటుడు బలరాముడుగా  నటించాము. వేలురి శివరామశాస్త్రి గారు రచించిన కథను ఆధారం చేసుకొని  పిత్తల్ కా దర్వాజా ను నాటకంగా మలిచి బందాగారి నిర్వహణలో వారితో పాటు కలిసి నటించాను. ఆ నాటకం ఆధారంగా ఆ తరువాత అనేకమంది అదే కథాంశాన్ని  మిగిలిన కోణాలలో రాసి  రేడియోలో ప్రసారం చేశారు. దానిలో బందా గారు రాసిన నాటకం కూడా ఉంది.
1963 వ సంవత్సరం మే నెల 19వ తేదీ  జీవితంలో నేను మరచిపోలేని రోజు  కొడాలి గోపాల్ రావు గారు రచించిన చైర్మన్ నాటకాన్ని  రంగస్థలం మీద  హనుమంతరాయ గ్రంధాలయంలో విజయవాడలో ప్రదర్శించాం.  ఆ రోజు విశేషం  అరుణతో నా వివాహం  18 రూపాయల 50 పైసలతో  ఎలాంటి లాంఛనాలు లేకుండా గోపరాజు రామచంద్రారావు  (గోరా) గారి అధ్యక్షతన నా వివాహం నిరాడంబరంగా జరిగింది మా గ్రామంలో. ఆ వివాహానికి వచ్చినంత మంది ప్రజలు  ఇంక ఎవరి వివాహానికి రాలేదు. పెళ్లయిన తర్వాత మేము అక్కడ సాయంత్రం కారులో బయలుదేరి విజయవాడ వచ్చి  నాటకం ప్రదర్శించిన తర్వాత  నిర్వాహకులు  మా దంపతులను  సన్మానించి   ఆశీస్సులు అందించారు.


కామెంట్‌లు